పడవలో గిరిజన మహిళకు ప్రసవం

ABN , First Publish Date - 2021-11-29T06:29:45+05:30 IST

రవాణా సౌకర్యం లేని గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ ఐటీడీఏ పీవో సహకారంతో అతి కష్టం మీద ఆస్పత్రికి చేరింది.

పడవలో గిరిజన మహిళకు ప్రసవం
ఆస్పత్రికి తీసుకువస్తున్న దృశ్యం

ఆస్పత్రిలో చేర్పించేందుకు సహకరించిన ఐటీడీఏ పీవో
కూనవరం, నవంబరు 28: రవాణా సౌకర్యం లేని గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ ఐటీడీఏ పీవో సహకారంతో అతి కష్టం మీద ఆస్పత్రికి చేరింది. పాపికొండల ప్రాంతంలోని వరరామచంద్రాపురం మండలం గొందూరు గ్రామానికి చెందిన కొండరెడ్డి మహిళ సాందల జయసుధ ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులతో ఇబ్బంది పడు తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మారుమూల గ్రామం కావడంతో అక్కడ నుంచి గర్భిణిని ఆస్పత్రికి చేర్చడం చాలా కష్టమైన పని. దీంతో  ఆమెను ఎలా ఆసుపత్రికి తీసుకురావాలో అర్థంకాని పరిస్థితి. ఈ క్రమంలో విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమెను పడవలో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆమెకు అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గోదావరిలో ప్రయాణించే పడవపైనే  ప్రసవించింది. గొందూరు నుంచి పడవలో పోచవరం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కూనవరం వచ్చేందుకు ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు ఫోన్‌ చేశారు. ఆయన చొరవతో 108 వాహనంను ఏర్పాటు చేశారు 108 వాహనంలో ఈఎంటీ శ్రీనివాస్‌, స్వరూప్‌లు వెంటనే కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీబిడ్డను తరలించారు.  అనంతరం అక్కడి వైద్యులు తల్లీబిడ్డలకు వైద్యం అందించారు. వారు క్షేమంగా ఉన్నారు.  108 సిబ్బందికి డివిజన్‌ కోఆర్డినేటర్‌ యర్రంశెట్టి వాసు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-11-29T06:29:45+05:30 IST