గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చకుంటే పోరాటం

ABN , First Publish Date - 2022-05-28T06:56:08+05:30 IST

నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని త్రిపుర మాజీ మంత్రి, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయమంచ్‌ జాతీయ కన్వీనర్‌ జితేంద్ర చౌదరి డిమాండ్‌ చేశారు.

గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చకుంటే పోరాటం
నర్సీపట్నం సభలో మాట్లాడుతున్న జితేంద్ర చౌదరి

 ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చినా పట్టించుకోలేదు

-  రాష్ట్రంలో  రాజ్యాంగ హక్కులకు గిరిజనులు దూరం

 - నర్సీపట్నంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి

- గిరిజన సంఘం బహిరంగ సభలో త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి


నర్సీపట్నం అర్బన్‌, మే 27 : నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని త్రిపుర మాజీ మంత్రి, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయమంచ్‌ జాతీయ కన్వీనర్‌ జితేంద్ర చౌదరి డిమాండ్‌ చేశారు. నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన గిరిజన సంఘం బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని 11 మండలాల్లో గల గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని, లేనిపక్షంలో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదన్నారు. విశాఖలో జరిగే ఆదివాసీ అధికార్‌ రాష్రీయ మంచ్‌ సమావేశాల్లో ఇదే అంశాన్ని తీర్మానం చేసి రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నర్సీపట్నం ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు.  మరో ముఖ్య అతిథి మాజీ ఎంపీ మీడియం బాబూరావు మాట్లాడుతూ నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని వాపోయారు. నేటికీ ఆయా గ్రామాల్లో చాలా వరకు  రహదారులు, మంచినీరు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరదర్శనంగా పేర్కొన్నారు. ఈ ప్రాంత గిరిజనులను మైనింగ్‌ పేరుతో భూమి నుంచి దూరం చేస్తున్నారని, ఫలితంగా గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ ప్రాంత గిరిజనులకు రిజర్వేషన్‌ కూడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. గిరిజనుల భూములకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో పోరాటానికి అంతా సిద్ధం కావాలని కోరారు. ఈ మహా సభలో  గిరిజన సంఘం నాయకులు డి.సత్తిబాబు, కె.లోకనాథం, డి.వెంకన్న, నరసింహమూర్తి, చిరంజీవి. లక్ష్మణ్‌, గోవిందరావు, సూరిబాబు, అడిగర్ల రాజు, అప్పలనాయుడు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు దనార్జన సాయి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:56:08+05:30 IST