pakistan లో మరో పరువు నేరం.. అభంశుభం తెలియని నాలుగేళ్ల పసిపాప మృతి

ABN , First Publish Date - 2022-05-30T21:10:01+05:30 IST

రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న రగడ అభంశుభం తెలియని 4 ఏళ్ల పసిహృదయం పాలిట మృత్యువైంది.

pakistan లో మరో పరువు నేరం.. అభంశుభం తెలియని నాలుగేళ్ల పసిపాప మృతి

కరాచీ : పొరుగుదేశం పాకిస్తాన్‌(pakistan)లో పరువు హత్యలు(honor killings), సంబంధిత నేరాలు(crimes) కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన అభంశుభం తెలియని 4 ఏళ్ల పసిహృదయం పాలిట మృత్యువైంది. మంటల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని రోహ్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  చౌహాన్ వర్గానికి  చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను పన్వార్ వర్గానికి చెందిన యువకులు కిడ్నాప్ చేశారంటూ మొదలైన రగడ 10 కుటుంబాలను వీధిన పడేసింది. 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. తమ వర్గం అమ్మాయిలనే కిడ్నాప్ చేస్తారా అంటూ రెచ్చిపోయిన చౌహాన్ వర్గీయుల 10-12 మంది సమూహం ప్రత్యర్థి వర్గానికి చెందినవారి ఇళ్లకు నిప్పంటించారు. కనీసం 10 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ ఇంట్లో ఉన్న నాలుగేళ్ల చిన్నారి మంటల్లో చిక్కుకుపోయింది. రక్షించే మార్గం లేకపోవడంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలిందని పోలీసులు వివరించారు. 


కాగా ఇది ‘పరువు నేరం’గా పోలీసులు కేసు నమోదు చేశారు. చౌహాన్ కమ్యూనిటీకి చెందిన యువతి పన్వార్ వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన చెల్లిని కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురయిన బాధిత కుటుంబం.. కుల పెద్దలకు ఫిర్యాదు చేశారు. తమ సోదరీమణులను పన్వార్ వర్గానికి చెందినవారు కిడ్నాప్ చేశారంటూ చౌహాన్ వర్గీయులు రెచ్చిపోయారు. పన్వార్ వర్గం ఇళ్లపై దాడులకు తెగబడ్డారని వివరించారు. పోలీసులు చేరుకునే సమయానికి నిందితులు పారిపోయారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగతావారిని అరెస్ట్ చేస్తామని స్థానిక పోలీసులు వివరించారు.


పాక్‌లో పెరిగిపోతున్న పరువు నేరాలు..

పాకిస్తాన్ మానవహక్కుల కమిషన్ నివేదిక ప్రకారం..  ఆ దేశంలో ప్రతి ఏడాది 1170 పరువు హత్యలు జరుగుతున్నాయి. 2021లో ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే 128 మంది మహిళలు హత్యకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. తుపాకీతో కాల్చిచంపడం, కత్తితో పొడవడం, నిప్పంటించడం వంటి నేరాలకు పాల్పడుతూ మహిళల ప్రాణాలు తీస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది.

Updated Date - 2022-05-30T21:10:01+05:30 IST