అమ్మాయికి బదులుగా అమ్మాయి.. అక్కడ పెళ్లిళ్లలో వింత ఆచారం.. వయసుతో సంబంధం లేకుండా..

ABN , First Publish Date - 2021-07-17T22:05:17+05:30 IST

వేగంగా మారుతున్న మోడ్రన్ నాగరికతలో మానవుల విలువలు మారిపోతున్నాయి. తాము చేసేది తప్పో ఒప్పో ఆలోచించే స్థాయిని మనిషి దాటేస్తున్నాడు. ‘తాను మెచ్చిందే రంభ.. తాను చెప్పిందే వేదం’ రీతిగా పోకడలు పోతున్నాడు.

అమ్మాయికి బదులుగా అమ్మాయి.. అక్కడ పెళ్లిళ్లలో వింత ఆచారం.. వయసుతో సంబంధం లేకుండా..

ఇంటర్నెట్ డెస్క్: వేగంగా మారుతున్న మోడ్రన్ నాగరికతలో మానవుల విలువలు మారిపోతున్నాయి. తాము చేసేది తప్పో ఒప్పో ఆలోచించే స్థాయిని మనిషి దాటేస్తున్నాడు. ‘తాను మెచ్చిందే రంభ.. తాను చెప్పిందే వేదం’ రీతిగా పోకడలు పోతున్నాడు. ఈ క్రమంలో సమాజంలో గౌరవించాల్సిన స్త్రీకి అసలు విలువ ఇవ్వడం మర్చిపోతున్నాడు. స్త్రీ విలువల కోసం పోరాటాలు సలిపిన చరిత్రను మరిచిపోయి, అమ్మాయిలను అంగడి సరుకుల్లా అమ్ముకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఇటీవల వెలుగు చూసిన ఒక యువతి సూసైడ్. ఈ ఆత్మహత్య ‘ఆటా-సాటా’ అనే వింత ఆచారాన్ని బయటపెట్టింది. ఈ ఆచారమే ఆమె మరణానికి కారణమని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.


ఇంతకీ ఏంటీ ‘ఆటా-సాటా’?

జనాభాలో ఆడవారి సంఖ్య తగ్గిపోయి, చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కరువైపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం రాజస్థాన్‌లోని నాగౌర్ వంటి గ్రామాలు అమలు చేస్తున్న సంప్రదాయం ‘ఆటా-సాటా’. దీని ప్రకారం ఏ అబ్బాయైనా పెళ్లి చేసుకుంటుంటే.. తమ ఇంట్లోని అమ్మాయిని వధువు కుటుంబంలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. అంటే పెళ్లి కొడుకు అక్కకో చెల్లికో.. పెళ్లి కూతురి కుటుంబంలో పెళ్లి చేయాలి. అలా చేయకపోతే అతని పెళ్లి కూడా జరగదు. ఇలా పెళ్లిళ్లు చేసే సమయంలో వయసులో ఎక్కువ తక్కువలను ఆ కుటుంబాలు పెద్దగా పట్టించుకోవడం జరగదు. ఇలా తనకు పెళ్లి చేయబోవడంతో అది ఇష్టం లేని ఒక 21 ఏళ్ల యువతి ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. దీంతో ‘ఆటా-సాటా’ చర్చనీయాంశంగా మారింది.


అంతకుమించి ‘ఝగడా’..

రాజస్థాన్‌లో ‘ఆటా-సాటా’కు మించి మధ్యప్రదేశ్‌లో మరో భయానక ఆచారం వెలుగులోకి వచ్చింది. అదే ‘ఝగడా’. దీని మూలాలు బాల్యవివాహాల్లో ఉన్నాయి. చిన్నతనంలోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తారు. ఇలా చేసే సమయంలో అబ్బాయిల వయసును పెద్దగా పట్టించుకోరు. ఆ అమ్మాయి వయసుకు వచ్చిన తర్వాత ఆమెను అత్తారింటికి పంపుతారు. ఒకవేళ అమ్మాయి వెళ్లనన్నా, లేక అబ్బాయి కుటుంబం అమ్మాయిని వద్దన్నా ఆ భారం అమ్మాయి కుటుంబం మీదే పడుతుంది. ఊర్లో పరువు పోవడమే కాకుండా, అబ్బాయి కుటుంబానికి అమ్మాయి కుటుంబం భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం అబ్బాయి కుటుంబం పంచాయతీ ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో ఈ సొమ్ము అడుగుతుంది. అమ్మాయి కుటుంబం ఈ సొమ్ము ఇవ్వడంలో విఫలమైతే.. అబ్బాయి కుటుంబం వాళ్లు తెగిస్తారు. అమ్మాయి కుటుంబానికి చెందిన ఇళ్లు, పొలాలు తగలబెడతారు. స్థానిక పంచాయతీలు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చేస్తాయి. ఈ ఘోరాలు కేవలం అమ్మాయి కుటుంబానికే పరిమితం కావు. కొంతకాలం తర్వాత ఆ ఊర్లో ఎవరి ఆస్తులనైనా అబ్బాయి కుటుంబం అగ్నికి ఆహుతి చేస్తుంది. అప్పుడు సదరు బాధిత కుటుంబం కూడా అమ్మాయి కుటుంబం మీదనే ఒత్తిడి చేసి, వరుడి కుటుంబానికి డబ్బు చెల్లించాలంటూ గొడవ పడుతుంది. ఇలా ఊరు మొత్తం ఏకమై ఒక కుటుంబాన్ని అణగదొక్కుతుంది. కానీ ఇలా చిన్నతనంలోనే అమ్మాయిల పెళ్లిళ్లు చేసే కుటుంబాలు ధనిక కుటుంబాలు కాదు. దీంతో వాళ్లు ఈ సొమ్ము చెల్లించలేదు. అప్పుడు మరో ఘోరమైన ఆచారం అమల్లోకి వస్తుంది. అదే ‘నాత్రా’.


రెండో దశ.. అందరూ శత్రువులే?

‘ఝగడా’ వల్ల తమపై వచ్చే ఒత్తిడి తట్టుకోలేని అమ్మాయి కుటుంబం దారుణమైన పద్ధతిని అమలు చేస్తుంది. ఊరు మొత్తం తమను శత్రువలా చూస్తూ ఒత్తిడి చేయడంతో, దానికి తలొగ్గిన అమ్మాయి కుటుంబం ‘నాత్రా’ ఆచారాన్ని అమలు చేస్తుంది. దీని ప్రకారం, అత్తారింటికి వెళ్లని అమ్మాయిని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మొదటి భర్త కుటుంబానికి ఆమె ఇవ్వాల్సిన పరిహారాన్ని.. కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ సొమ్ము ఎవరు చెల్లిస్తానంటే వారికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసేస్తారు. ఒక్కోసారి అమ్మాయిలను అమ్మేస్తారు కూడా. ఇలాంటి ఘటనలు మధ్యప్రదేశ్‌లోని పలుగ్రామాల్లో కోకొల్లలు. మధ్యప్రదేశ్ గ్రామాల్లో ఇళ్లు, పొలాలు తగలబెట్టిన కేసుల్లో అధికభాగం ఈ సంప్రదాయాల వల్ల నమోదైనవే అనడం అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతున్నా ఇదో ‘సంప్రదాయం’ కాబట్టి దీనిపై స్థానికులెవరూ పెదవి విప్పరు. ఇలాంటి దారుణమైన ఆచారాలు మనమంతా ఉంటున్న సమాజంలోనే ఉన్నాయని తెలిసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు.


ఇవిగో తాజా ఉదాహరణలు..

కేస్-1: గుణా ప్రాంతానికి చెందిన ఒక యువతిని ‘నాత్రా’ ఆచారం ప్రకారం తండ్రి, మామయ్య కలిసి అమ్మేయబోయారు. దీంతో భయపడిపోయిన యువతి.. అక్కడి నుంచి పారిపోయి ఇండోర్ వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయి రాజస్థాన్‌లోని కోటాకు చేరుకుంది. అక్కడే కాయకష్టం చేసుకుంటూ జీవనం సాగించింది. ఘీసాలాల్ భీల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆమె విషయం తండ్రికి తెలిసింది. అంతే ఆమె తండ్రి, సోదరుడు కోటాకు చేరుకున్నారు. ఆమెను తమతో ఇంటికి రావాలని బలవంతం చేశారు. ఆమె ససేమిరా అనడంతో 1.5లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె భర్తను డిమాండ్ చేశారు. ఆ సొమ్ము తీసుకొని తిరిగి వెళ్లిపోయారు.


కానీ వారి అత్యాస అక్కడితో తీరలేదు. ఆమె అడ్రస్ దొరకడంతో మరోసారి తండ్రి, సోదరుడు, మామ కలిసి రాజస్థాన్ వెళ్లారు. ఆమెను బలవంతంగా సొంతూరికి తీసుకొచ్చి సుల్తాన్ అనే వ్యక్తికి రూ.2.5లక్షలకు అమ్మేశారు. ఆమెను తనతో తీసుకెళ్లిన సుల్తాన్.. బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇలా 18 రోజులపాటు నరకం అనుభవించిన ఆమె.. ఎలాగోలా సుల్తాన్ చెర నుంచి తప్పించుకొని పారిపోయి భర్త చెంతకు చేరింది.


కేస్-2: ఇది రాజ్‌గఢ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. ఖిల్చీపూర్‌ గ్రామానికి చెందిన రామ్‌కళా బాయి అనే యువతికి చిన్నతనంలోనే కమల్ సింహ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. వయసుకు వచ్చిన తర్వాత ఆమెను అత్తారింటికి పంపారు. అత్తారింటి వాళ్లు ఆమెను చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆమె భర్త కమల్ పచ్చి తాగుబోతు. అతని హింస తట్టుకోలేక పుట్టింటికి తిరిగొచ్చి తన కష్టాలు చెప్పుకుంది రామ్‌కళా బాయి. అత్తారింటికి వెళ్లడం తనకు ఇష్టం లేదని భీష్మించుకొని కూర్చుంది. దీంతో కమల్ కుటుంబం 2019లో ఆమె కుటుంబంపై విరుచుకుపడింది. ఇంటికి నిప్పుపెట్టింది. 9లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పట్టుబట్టింది. ఆమెను ఎవరికైనా అమ్మేసి, తమకు సొమ్ము చెల్లించాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఖిల్చీపూర్‌లో ఆ కుటుంబంపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది.



Updated Date - 2021-07-17T22:05:17+05:30 IST