నేను అతడిని పెళ్లి చేసుకోను.. అంటూ తెగేసి చెప్పిన ఈ 20 ఏళ్ల యువతికి రూ.31 లక్షల జరిమానా..!

ABN , First Publish Date - 2022-04-20T20:34:20+05:30 IST

రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌లో నివసించే కొన్ని గిరిజన తెగల్లో వివాహానికి సంబంధించి ఎప్పట్నుంచో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తున్నారు.

నేను అతడిని పెళ్లి చేసుకోను.. అంటూ తెగేసి చెప్పిన ఈ 20 ఏళ్ల యువతికి రూ.31 లక్షల జరిమానా..!

రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌లో నివసించే కొన్ని గిరిజన తెగల ప్రజలు వివాహానికి సంబంధించి ఎప్పట్నుంచో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తున్నారు. అక్కడ ఎక్కువగా `అట్టా-సతా` సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ సంప్రదాయం ప్రకారం అన్నాచెల్లెళ్లు మరో కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లను వివాహం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వివాహాలను కుండ మార్పిడి వివాహాలు అంటారు. `అట్టా-సతా`  సాంప్రదాయానికి ఎదురు తిరిగిన ఓ యువతికి గ్రామ పెద్దలు ఏకంగా రూ.31 లక్షలు జరిమానాగా విధించారు. 


దుంగార్పూర్‌లోని రామ్‌సగడ గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడికి మనా అనే యువతితో పెళ్లి కుదిరింది. ప్రతిగా కిషోర్ సోదరి జాగృతి.. మనా సోదరుడు రాజేంద్రను వివాహం చేసుకోవాలని పెద్దలు తీర్మానించారు. అయితే ఆ వివాహం జాగృతికి ఇష్టం లేదు. దీంతో ఆమె పెళ్లికి తిరస్కరించింది. దీంతో పంచాయితీ పెద్దలు జాగృతి కుటుంబంపై పగబట్టారు. జాగృతి తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టారు. పంచాయితీ నిర్వహించి పెళ్లి తిరస్కరించినందుకు నష్టపరిహారంగా జాగృతి రూ.31 లక్షలు కట్టాలని తీర్మానించారు. 


డబ్బులు కట్టకపోవడంతో జాృగతి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు. ఆమె ఇంటికి నీళ్లు, కరెంట్ రాకుండా నిషేధించారు. ఆమె ఇంటికి ఎవరూ వెళ్లకూడదని తీర్పునిచ్చారు. దీంతో జాగృతి పోలీసులను ఆశ్రయించింది. మొదట పోలీసులు జాగృతి ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఆమె నేరుగా ఎస్పీని ఆశ్రయించడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-04-20T20:34:20+05:30 IST