Viral Video: గాయానికి బ్యాండేజ్ వేస్తుంటే జాతీయ గీతం పాడిన ఉక్రెయిన్ బాలిక.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-06-30T21:25:40+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు జనాల గుండెలను పిండేస్తోంది. గాయంతో

Viral Video: గాయానికి బ్యాండేజ్ వేస్తుంటే జాతీయ గీతం పాడిన ఉక్రెయిన్ బాలిక.. వీడియో వైరల్

కీవ్: సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు జనాల గుండెలను పిండేస్తోంది. గాయంతో బాధపడుతున్న ఉక్రెయిన్ (Ukraine) బాలికకు బ్యాండేజ్ కడుతుంతే ఆ చిన్నారి జాతీయ గీతాన్ని (National Anthem) పాడుతూ బాధను భరించే ప్రయత్నం చేసింది. ఉక్రెయిన్ అంతర్గత శాఖ మంత్రి ఆంటోన్ గెరాష్‌చెంకో (Anton Gerashchenko) ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అన్‌బ్రేకబుల్.. బ్యాండేజ్‌లు కట్టించుకుంటూ ఓ చిన్నారి ఉక్రెయిన్ జాతీయ గీతాన్ని ఆలపిస్తోంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు. 


బాలిక కాలికి గాయాలు ఎలా అయ్యాయన్న విషయం తెలిరాలేదు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆ చిన్నారి కాలికి నర్సులు బ్యాండేజీ కడుతుండగా నొప్పిని భరిస్తూనే బాలిక జాతీయ గీతాన్ని ఆలపిస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 1.58 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 11 వేలకు పైగా లైకులు వచ్చాయి. 2వేల సార్లు రీట్వీట్ అయింది.

 

చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ హోరెత్తిపోతోంది. ఈ బాలిక చేతిలో పుతిన్ ఓడిపోయాడని ఓ యూజర్ కామెంట్ చేస్తే, ఇంత చిన్న వయసులోనే ఉక్రేనియన్లలో కావాల్సినంత ధైర్యం నింపారని మరొకరు కామెంట్ చేశారు. ‘చల్లగా ఉండు తల్లీ.. ఉక్రేనియన్ల స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.  



Updated Date - 2022-06-30T21:25:40+05:30 IST