
ఆమెకు ఇప్పుడు 18ఏళ్ల వయసు.. తెలిసీతెలీని వయసులో ఆమె తండ్రి చేసిన పనికి.. ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. చదువుకునే వయసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. మరోవైపు తనను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యువకుడి కుటుంబం వెంటాడుతోంది. ఈ పరిస్థితికి కారణమైన ఆమె తండ్రి.. కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువతి ఇబ్బందులు తెలుసుకుని.. స్థానికులు అయ్యో పాపం! అని అంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లా ఖిల్చిపూర్ ప్రాంత పరిధిలోని డియోరీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాపులాల్, శాంతా బాయి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తేజ్‌కరణ్, మాల్వియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాల్వియాకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు.. బర్ఖేడా గ్రామానికి చెందిన అంకిత్‌లాల్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. ఆ సమయంలో నగలు తదితరాలు కొనేందుకు మాల్వియా తండ్రికి అంకిత్‌లాల్.. రూ.15వేలు ఇచ్చారు. మాల్వియాకు 18ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం మాల్వియా తండ్రి బాపులాల్ మరణించాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ శాంతాబాయి చూసుకుంటోంది. మాల్వియాకు 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవాలని అంకిత్‌లాల్ కుటుంబం ఒత్తిడి చేయడం మొదలెట్టింది.
అయితే అంకిత్‌లాల్ ప్రస్తుతం అస్సలు బాగోలేడని, అందులోనూ అతను తాగుడుకు బానిసై.. ఏ పనీ చేయడం లేదని చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అయితే అంకిత్‌లాల్ కుటుంబం మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందేనని మాల్వియా కుటుంబంపై ఒత్తిడి చేస్తోంది. లేనిపక్షంలో 13ఏళ్ల క్రితం తీసుకున్న రూ.15వేలకు వడ్డీతో కలిపి రూ.6లక్షలు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తల్లితో కలిసి మాల్వియా.. పోలీసులకు ఫిర్యాదు చేసంది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక కుటుంబం ఆరోపిస్తుంది.
ఇవి కూడా చదవండి