Kerala NEET Innerwear row: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం.. ఆ బాలికలకు మళ్లీ నీట్ రాసే అవకాశం

ABN , First Publish Date - 2022-08-27T22:09:32+05:30 IST

గత నెలలో నీట్ పరీక్ష(NEET Exam) సందర్భంగా కేరళలోని కొల్లాంలో బాలికల లోదుస్తులు తొలగింపు వివాదంపై ఎన్‌టీఏ (National Testing Agency) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బాలికలకు మళ్లీ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది.

Kerala NEET Innerwear row: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం..  ఆ బాలికలకు మళ్లీ నీట్ రాసే అవకాశం

తిరువనంతపురం : గత నెలలో నీట్ పరీక్ష(NEET Exam) సందర్భంగా కేరళలోని కొల్లాంలో ‘బాలికల  లోదుస్తులు తొలగింపు ఒత్తిడి’ వివాదంపై ఎన్‌టీఏ (National Testing Agency) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బాలికలకు మళ్లీ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. బాలికలు కోరుకుంటే సెప్టెంబర్ 4న పున:పరీక్ష నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ-మెయిల్స్ పంపించింది. కాగా గత నెలలో నీట్ ఎగ్జామ్ సందర్భంగా లోదుస్తులు తొలగించి పరీక్ష కేంద్రంలోకి రావాలంటూ కొల్లాంలో ఓ పరీక్ష కేంద్ర సిబ్బంది బాలికలను ఒత్తిడి చేశారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పరీక్షా కేంద్రం సిబ్బంది ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్లంతా బెయిల్‌పై విడుదలయ్యారు. 


కాగా లోదుస్తులు తొలగించాలంటూ బాలికలను ఒత్తిడి చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్విజిలేటర్లు అమానవీయ చర్యకు పాల్పడ్డారని, బాలికల మనసుపై దుష్ప్రభావం చూపిందని, ప్రశాంతంగా పరీక్షా రాయలేకపోయారని వాపోయారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నీట్ ఏర్పాటు చేసింది. విద్యార్థినులు ఎదుర్కొన్న మానసిక పరిస్థితిపై ఈ కమిటీ దర్యాప్తు జరిపి తుది రిపోర్టును అందజేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా కొల్లాం జిల్లాలో ప్రభావిత బాలికలకు పున:పరీక్ష నిర్వహించాలని నీట్ నిర్ణయించింది. 


కాగా లోదుస్తులు తొలగింపు ఒత్తిడి చేసిన వ్యవహారంలో మార్ థామస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐటీకి చెందిన వైస్ ప్రిన్సిపల్, నీట్ ఎగ్జామ్ సెంటర్ సూపరిటెండెంట్ ప్రిజీ కురియన్ ఇసాన్, ఎన్టీఏ అబ్సర్వర్ డా.షమ్నద్ ఉన్నారు. వీరితోపాటు కాలేజీకి చెందిన ఇద్దరు మహిళా స్టాఫ్, స్టార్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన మరో ముగ్గురు అరెస్టయ్యినవారిలో ఉన్నారు. ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 509 కింద వీరిపై కేసులు పెట్టారు.

Updated Date - 2022-08-27T22:09:32+05:30 IST