కేసును నీరుగారుస్తున్నారా!?

ABN , First Publish Date - 2021-10-14T05:44:36+05:30 IST

అగనంపూడిలో పదమూడేళ్ల బాలిక మృతి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కేసును నీరుగారుస్తున్నారా!?

బాలిక మృతి కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు

సమగ్ర విచారణ చేపట్టకుండానే ఆత్మహత్యగా ప్రకటించారనే విమర్శలు


విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అగనంపూడిలో పదమూడేళ్ల బాలిక మృతి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి వీలైనంత త్వరగా కేసును ముగించడానికే యత్నం చేశారని జరిగిన ఘటనల వల్ల అర్థం అవుతోంది. పోలీసులు  ఘటన జరిగిన 24 గంటల్లోనే...నిందితుడిని పట్టుకున్నామని, అతడితో బాలికకు రెండు నెలలుగా శారీరక సంబంధం నెరుపుతున్నదని ప్రకటించారు. వారిద్దరి మధ్య వాట్సాప్‌ కాల్స్‌, ఆమె వినియోగిస్తున్న మరో సిమ్‌ ఆధారంగా ఈ రకమైన నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా 174 సెక్షన్‌ కింద కేసు నమోదుచేశారు. అసలు విచారణ సరిగా చేపట్టలేదు. కనీసం తల్లిదండ్రులు చెబుతున్న సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అవసరమైన సాక్ష్యాల కోసం పోస్టుమార్టం వీడియో తీయించామని చెప్పారు. దీనిపై తదుపరి వివాదాలు లేకుండా ఆత్మహత్య చేసుకున్నదని తెలియజేశారు. దీనికి పోస్టుమార్టం నివేదికే ఆధారమని ప్రకటించారు. నిందితుడితో వుండగా తండ్రి చూశాడని, అందుకే ఆమె భయపడి, టెర్రస్‌ పైకి వెళ్లి చనిపోతున్నానని ఆ యువకుడికి చెప్పి అక్కడి నుంచి దూకేసి చనిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తండ్రి ఖండిస్తున్నారు. తాను ఆ యువకుడితో కలిసి వుండగా చూడలేదని, కనీసం అలాంటి అనుమానమే లేదని ఆయన మీడియా ముందు వెల్లడించారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం వుందనే విషయం ఎవరూ ధ్రువీకరించడం లేదు. నిందితుడే చెప్పాడని పోలీసుల కథనం. శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం...అతడు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు కదా? అని అనుమానించడం లేదు. ఫోన్‌ చేసి ఆమెను బయటకు రప్పించి, అత్యాచారం చేసి, ఆ తరువాత అంతా కలిసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు క్లోజ్‌ చేసిన కేసుపై పునర్విచారణ ప్రారంభించారు. ప్రజా సంఘాల డిమాండ్‌ మేరకు క్లూస్‌ టీమ్‌ను రప్పించి  వివరాలు సేకరించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక నాయకులతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం వున్నదని వి.విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. నగర్‌ పోలీస్‌ కమిషనర్‌, ఇతర అధికారులతో మాట్లాడి కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-10-14T05:44:36+05:30 IST