ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-29T06:34:28+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి దూసుకుపోయారు. కొవిడ్‌ తరువాత జరిగిన పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాల్లో అబ్బాయిల కంటే అత్యధికంగా అమ్మాయిలే ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

- ఫస్టియర్‌లో 877 మంది బాలురు, 1791 మంది బాలికల ఉత్తీర్ణత

సెకండియర్‌లో 892 మంది బాలురు, 1899 మంది బాలికల పాస్‌ 

- మొదటి సంవత్సరం 60 రెండో సంవత్సరం 64 శాతం ఉత్తీర్ణత 

- జిల్లాకు స్టేట్‌ ర్యాంకులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల )

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి దూసుకుపోయారు. కొవిడ్‌ తరువాత జరిగిన పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాల్లో అబ్బాయిల కంటే అత్యధికంగా అమ్మాయిలే ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో జిల్లాలో మొదటి సంవత్సరం ఫలితాల్లో 2021లో వంద శాతం పాస్‌ ప్రకటించారు. 2020 సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. విద్యార్థుల చదువులపై కొవిడ్‌ ప్రభావంతో ఇబ్బంది పడ్డ తీరు కనిపిస్తోంది. 

2019 సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 50 శాతం, 2020లో 51 శాతం, 2021లో 37 శాతం ప్రస్తుత ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 2019లో 61 శాతం, 2020లో 63 శాతం, 2021లో వందశాతం, ప్రస్తుత ఫలితాల్లో 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో అన్ని విభాగాల కళాశాలల్లో  మొదటి సంవత్సరంలో విద్యార్థులు 4,473 మంది  పరీక్షలకు హాజరుకాగా 2,668 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1982 మంది బాలురకు  877 మంది, 2491 మంది బాలికలకు 1791 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే 914 మంది బాలికలు అధికంగా ఉన్నారు. రెండో సంవత్సర పరీక్షలలో విద్యార్థులు 4358 మంది పరీక్షలకు హాజరుకాగా 2791మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1825 మంది బాలురకు  892 మంది, 2533 మంది బాలికలకు 1899 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే 1007 మంది బాలికలు ఉత్తీర్ణతలో అధికంగా ఉన్నారు. మొదటి సంవత్సరంలో 1805 మంది విద్యార్థులు,  రెండో సంవత్సరంలో 1567 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 1105 మంది, బాలికలు 700 మంది ఫెయిల్‌ అయ్యారు. రెండో సంవత్సరంలో బాలురు 933 మంది, బాలికలు 634 మంది బాలికలు ఫెయిల్‌ అయ్యారు. జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన అనుముల అంకిత ఇంటర్‌ ప్రథమ సంవత్సరం  బైపీసీలో 440 మార్కులకు 437మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్‌ సాధించింది. సిరిసిల్లలోని గురుకుల పాఠశాలకు చెందిన అఖిల ఎంపీసీలో 466 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండో ర్యాంక్‌ను సాధించింది. వేములవాడలోని ప్రభుత్వ కళశాలల విద్యార్థిని సామ సజయ ఎంపీసీలో 466 మార్కులతో రాష్ట్రంలో రెండో ర్యాంక్‌గా నిలిచింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన గుగులోతు నరేష్‌ ఎంపీసీలో 465 మార్కులతో, సిరిసిల్లకు చెందిన బి.లహరి ఎంపీసీలో 465 మార్కులతో రాష్ట్రంలో మూడో ర్యాంక్‌లు సాధించారు. వేములవాడకు చెందిన అస్మా బైపీసీలో 435 మార్కులతో జిల్లా ప్రథమంగా నిలిచింది. జిల్లాలో అనేక కళాశాలల్లో ర్యాంకుల పరంపర కొనసాగింది.

ఒకేషనల్‌ ఫలితాలు..

జిల్లాలో ఒకేషనల్‌  ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 59 శాతం, రెండో సంవత్సరం 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 595 మంది విద్యార్థులకు 353 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 342 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 164 మంది ఉత్తీర్ణులయ్యారు. 253 మంది బాలికల్లో 189 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం ఫలితాలలో విద్యార్థుల్లో 504 మందికి  322 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 292 మంది బాలురకు   162 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 212 మందికి  160 మంది ఉత్తీర్ణులయ్యారు. 



 


Updated Date - 2022-06-29T06:34:28+05:30 IST