డబ్బులు ఇవ్వండి సారూ..!

ABN , First Publish Date - 2021-01-12T05:59:55+05:30 IST

ఈ రైతు పేరు కుమార్‌. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం. ఐదెకరాలలో వేరుశనగ సాగు చేశాడు.

డబ్బులు ఇవ్వండి సారూ..!

  1. అరకొర దిగుబడులు కొనీ.. పైసా ఇవ్వలేదు
  2. ఆయిల్‌ ఫెడ్‌ చుట్టూ రెండు నెలలుగా ప్రదక్షిణ
  3. ఆర్‌బీకేల్లో కొనలేదని యార్డుకు వచ్చిన మరికొందరు
  4. సంక్రాంతి సమయంలో వేరుశనగ రైతుల కష్టాలు


కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 11: ఈ రైతు పేరు కుమార్‌. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం. ఐదెకరాలలో వేరుశనగ సాగు చేశాడు. భారీ వర్షాలకు 50 శాతం దాకా పంట దెబ్బతినింది. కనీసం 60 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 25 క్వింటాళ్లకు పడిపోయింది. మద్దతు ధరకు అమ్ముకుందామని మూడు నెలల పాటు ఆర్‌బీకే కేంద్రాల చుట్టూ తిరిగాడు. ఈరోజు.. రేపు అనుకుంటూ అధికారులు వాయిదా వేశారు. దీంతో విసిగిపోయి కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి అమ్ముకున్నాడు. అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులందరిదీ ఇదే పరిస్థితి. మద్దతు ధర కాగితాలకే పరిమితమైంది. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతోంది తప్ప లాభం లేదని రైతులు అంటున్నారు. మరికొందరు తంటాలు పడి నవంబరులో ఆయిల్‌ ఫెడ్‌కు వేరుశనగ దిగుబడులను అమ్ముకున్నారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రైతులకు ఆయిల్‌ఫెడ్‌ నుంచి అందలేదు. డబ్బుల గురించి అడుగుదామంటే.. జిల్లాలో ఆయిల్‌ఫెడ్‌ అధికారులు పత్తా లేకుండా తిరుగుతున్నారని బాధిత రైతులు ఆవేదన చెందున్నారు.


రూ.3.64 కోట్ల బకాయి

బనవంబరు, డిసెంబరు నెలల్లో రైతుల నుంచి ఆయిల్‌ఫెడ్‌ అధికారులు 7,770 క్వింటాళ్ల వేరుశనగ కాయలను కొనుగోలు చేశారు. క్వింటానికి రూ.5,275 మద్దతు ధర, తక్కువ క్వాలిటీ కాయలకు క్వింటానికి రూ.4,500 ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.3.64 కోట్ల విలువైన వేరుశనగ దిగుబడులను కొనుగోలు చేశారు. రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దాదాపు 1100 మంది రైతులు ఆయిల్‌ఫెడ్‌ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి కార్యాలయం ఎక్కడుందో అర్థం కాక కలెక్టరేట్‌ వద్ద అధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఇంట్లో పిల్లలకు బట్టలు కొనాలన్నా, పండుగ జరుపుకోవాలన్నా, చేతిలో పైసా లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. 


రెండు నెలలైనా..

జిల్లాలో దాదాపు 70 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. భారీ వర్షాలు, తుఫానుల కారణంగా ఆశించిన దిగుబడి చేతికందలేదు. సాధారణంగా ఎకరానికి 12 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి రావాలి. వర్షాల కారణంగా కేవలం 2, 3 క్వింటాళ్లు మాత్రమే అందింది. ఈ కాస్త దిగుబడికి మద్దతు ధర లభిస్తుందని ఆశించి ఆర్‌బీకేల వద్ద పేర్లను నమోదు చేసుకునేందుకు, ఈక్రాఫ్‌ బుకింగ్‌ చేసుకునేందుకు రైతులు ప్రదక్షిణ చేశారు. మద్దతు ధర పేరిట ఆయిల్‌ఫెడ్‌ అధికారులు చుక్కలు చూపించారు. జిల్లాలో దాదాపు పది లక్షల క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి రైతులకు చేరింది. ఇందులో 50 శాతం దిగుబడులను కూడా ఆయిల్‌ ఫెడ్‌ కొనుగోలు చేయలేదు.7,770 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రూ.3.64 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని  ప్రకటించారు. రెండు నెలలు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు. 


త్వరలో చెల్లిస్తాం..

రైతులకు రూ.3.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేరుశనగ దిగుబడులను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా అందలేదు. ఏదో విధంగా పండుగ సమయానికల్లా రైతులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - ప్రదీప్‌ కుమార్‌, ఆయిల్‌ఫెడ్‌ అధికారి 


నామమాత్రంగా కొనుగోలు..

ఆర్‌బీకే పరిధిలో రైతుల నుంచి వేరుశనగ కాయలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సవాలక్ష అడ్డంకులు సృష్టించారు. ఎక్కడా పూర్తి స్థాయిలో కొనలేదు. నాతోపాటు చాలా మంది రైతులు ఆయిల్‌ఫెడ్‌కు విక్రయించే అవకాశం లేక కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చాం. వేరుశనగ కాయలను వ్యాపారుల చేతిలో పెట్టాల్సి వచ్చింది. వ్యాపారులు వెంటనే డబ్బులు చెల్లించారు.

- ఎర్రపరెడ్డి, అయ్యవారిపల్లి, అనంతపురం జిల్లా


మంత్రికి చెప్పినా.. 

ఆర్‌బీకే కొనుగోలు కేంద్రంలో వేరుశనగ కాయలు విక్రయిద్దామని వెళ్లాను. అయితే ఏవేవో సాకులు చెప్పి మళ్లీ రమ్మని కొనుగోలు కేంద్రాల అధికారులు వెనక్కి పంపారు. మా గ్రామంలోని రైతులందరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. అయినా కొత్తబురుజులో వేరుశనగ కాయలను కొనుగోలు చేయలేదు. మరోదారి లేక కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి వ్యాపారికి విక్రయించాను. ప్రభుత్వం చెబుతున్న మద్దతు ధర ఎవరికీ అందిందో ఏమో మరి. - చంద్రన్న, కొత్తబురుజు

Updated Date - 2021-01-12T05:59:55+05:30 IST