పింఛన్లు ఇప్పించండి మహాప్రభో

ABN , First Publish Date - 2020-09-23T07:03:06+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మ కంగా ఆసరా పింఛన్‌

పింఛన్లు ఇప్పించండి మహాప్రభో

ఆసర సాయం కోసం వృద్ధుల వేడుకోలు 

అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన


కరకగూడెం, సెప్టెంబరు 22: తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మ కంగా ఆసరా పింఛన్‌ ఇస్తోంది. కానీ కరకగూడెం మండలంలోని వందల మందికి ఆసరా పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్‌ కోసం కార్యాలయలు, అధికారులు, రాజకీయ నాయకుల చుట్టు తిరిగి విసిగిపోతున్నారు. తమకు పింఛన్‌ ఇప్పించండి.. మహాప్రభో అంటూ వృద్ధులు వేడుకుంటున్నారు. మండలంలోని 16 పంచాయతీల్లో ఇప్పటివరకు 1,706 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇందులో వితంతు 639, వృద్ధాప్య పింఛన్లు 776, వికలాంగుల పింఛన్లు 217, ఒంటరి మహిళలు 72, చేనేత కార్మికులకు రెండు పింఛన్లు వస్తున్నాయి. కానీ మండల వ్యాప్తంగా సుమారు 500 మందికి పింఛన్లు రావడం లేదు. ఇందులో వృద్ధులు 50, ఒంటరి మహిళలు 20, వితంతులు 15, వికలాంగులు 12 ఉన్నారు. మండల పరిధిలోని చిరుమళ్ల, వంటవారి గుంపులో సుమారు 40 మంది ఆసరా పింఛన్‌ కోసం అధికారులు తిరిగి విసిగి పోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం చిరుమళ్లలో విలేకరులతో వారు తమకు పింఛన్‌ ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు.


ఎవరూ పట్టించుకోవడం లేదు..చందా శ్రీ లక్ష్మి, చిరుమళ్ల గ్రామం

పింఛన్‌ కోసం పలు మార్లు అధికారులు చుట్టు తిరిగినా వారు పట్టించుకోవడం లేదు. ఇంటిపెద్ద కన్నుమూయడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. కావలసిన అన్ని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా   పింఛన్‌ ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వం అర్హులకు పింఛన్‌ ఇస్తామని చెప్పినా నాకు న్యాయం జరగడం లేదు. అధికారులు, రాజకీయ నాయకులను కలసినా  నాగోడు పట్టించుకోవడం లేదు.


వృద్ధుడినయినా పింఛన్‌ ఇవ్వడం లేదు..ఊకే బుచ్చయ్య, పోలకమ్మతోగు గ్రామం

నాకు 72 సంవత్సరాలు. ఇప్పటికీ వృద్ధాప్య పింఛన్‌ రావడం లేదు. అధికారులను అడిగితే దరఖాస్తు ఇవ్వండని అంటున్నారు. నాలుగు సార్లు అధికారులకు పత్రాలు ఇచ్చాను. ఏళ్లు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ నాకు పింఛన్‌ మాత్రం రావడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి నాకు పింఛన్‌ ఇప్పించాలి.

Updated Date - 2020-09-23T07:03:06+05:30 IST