రేషన్‌ ఇవ్వండి.. మహాప్రభో!

ABN , First Publish Date - 2021-03-07T05:03:12+05:30 IST

రేషన్‌ సరుకులు అందక రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే రేషన్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిశిఖర పంచాయతీ దారపర్తి గిరిజనులు శనివారం కదంతొక్కారు. గ్రామం నుంచి ఎస్‌.కోట పట్టణం వరకు 23 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు

రేషన్‌ ఇవ్వండి.. మహాప్రభో!
పాదయాత్ర చేస్తున్న దారపర్తి గిరిజనులు

కదంతొక్కిన దారపర్తి పంచాయతీ గిరిజనం

23 కిలోమీటర్లు పాదయాత్ర

శృంగవరపుకోట రూరల్‌, మార్చి 6:  రేషన్‌ సరుకులు అందక రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే రేషన్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిశిఖర పంచాయతీ దారపర్తి గిరిజనులు శనివారం కదంతొక్కారు. గ్రామం నుంచి ఎస్‌.కోట పట్టణం వరకు 23 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామపెద్దలు, యువత, స్థానికులు కలసి ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎస్‌.కోట దేవిబొమ్మ జంక్షన్‌ వద్దకు రాగానే మానవహారంగా ఏర్పడి విశాఖ-అరకు ప్రధాన రహదారిపై భైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నీలకంఠం సిబ్బందితో అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. రేషన్‌ పంపిణీపై తహసీల్దార్‌, ఇతర అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదలబోమని భీష్మించారు. వీరికి మద్దతుగా సీపీఎం నాయకుడు మద్దిల రమణ వచ్చి మాట్లాడగా అతన్ని, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన గిరిజన యువత ఆర్‌టీసీ బస్సు ముందు బైఠాయించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పటికీ వారు శాంతించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మీ సమస్యను తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెప్పాలని ఎస్‌ఐ కోరడంతో శాంతించి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. సమస్యను డిప్యూటీ తహసీల్దార్‌ హరికి వివరించారు.  

ఎట్టకేలకు రేషన్‌

దారపర్తి గిరిజనులకు శనివారం మధ్యాహ్నం కిల్తంపాలెం పంచాయతీ కాపుసోంపురం వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ హరి ఆధ్వర్యంలో రేషన్‌ సరుకులు అందించారు. ఉదయం 10గంటల నుంచి సరుకుల కోసం ఆందోళన చేయడంతో రెండు బియ్యం వాహనాలను రప్పించి వారికి ఆఫ్‌లైన్‌లో బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు.


Updated Date - 2021-03-07T05:03:12+05:30 IST