పిఆర్‌సికి మోక్షం కల్పించండి

ABN , First Publish Date - 2021-10-14T08:13:31+05:30 IST

పదకొండవ పిఆర్‌సి 2018 జూలై నుంచి అమలు కావలసిన ఉంది. అయితే అది ఎప్పుడు అమలవుతుంది? అసలు అమలవుతుందా లేదా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో...

పిఆర్‌సికి మోక్షం కల్పించండి

పదకొండవ పిఆర్‌సి 2018 జూలై నుంచి అమలు కావలసిన ఉంది. అయితే అది ఎప్పుడు అమలవుతుంది? అసలు అమలవుతుందా లేదా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఈ చర్చే ప్రధానంగా జరుగుతోంది. గత ప్రభుత్వం పిఆర్‌సిని నియమించి 2019 ఏప్రిల్‌ నుంచి 20 శాతం తాత్కాలిక భృతి కూడా మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసి 2019 జూలై నుంచి 27 శాతం ఐఆర్‌ మంజూరు చేసింది. మూడు నెలలు నష్టపోయినా ఉద్యోగులు ఈ పెంపుదలను స్వాగతించారు. కానీ పిఆర్‌సి కమిటీ నివేదిక ఇచ్చి సంవత్సర కాలం గడిచినా అది ఇంకా అమలుకాకపోవడం శోచనీయం. గత ప్రభుత్వం రెండు వాయిదాల డీఎల అమలులో కొంత ఆలస్యం చేసింది. కానీ జీతాలు, పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే చెల్లించింది. అప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి అనేక హామీలు గుప్పించారు. ఉద్యోగులకు సకాలంలో డిఎలు ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన హయాంలో ఆరు వాయిదాల డిఎలు బకాయి ఉండడం, ఆ బకాయిలను ఈనాటికీ చెల్లించకపోవడం ఆక్షేపణీయం. అసలు 1వ తేదీకి జీతాలు, పెన్షన్లయినా వస్తాయా అని ఎదురుచూసేలా చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, రెండేళ్లయినా రద్దు చేయకపోగా రకరకాల కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ నీటి మీద రాతయింది. ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ కూడా ఆయన అమలుపరచలేదు.

11వ పిఆర్‌సి కమిటీ తన నివేదికను గత ఏడాది అక్టోబర్‌ 4న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసింది. సంవత్సరకాలం గడిచినా ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి హయాంలో 8వ పిఆర్‌సి, రోశయ్య హయాంలో 9వ పిఆర్‌సి 21 నెలలు ఆలస్యంగా ఉద్యోగులకు అందాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి 38 నెలలు గడిచినా పిఆర్‌సి అమలు చేయకుండా వారిని మించిపోయారు. అనేక జీవోలు జారీచేసి పిఆర్‌సి కాలాన్ని పెంచుకుంటూపోయారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకే జెఎసిగా పోరాడారు. ప్రస్తుతం వీరందరూ ఐక్యపోరాట వేదికగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చించాలి. ఫలితం లేకపోతే తీవ్రతరమైన పోరాటం జరపడం ద్వారా మన న్యాయబద్ధమైన హక్కులు సాధించుకోవాలి.

చెరుకూరి సుభాష్‌ చంద్రబోస్‌

ఉపాధ్యాయ ఉద్యమనేత

Updated Date - 2021-10-14T08:13:31+05:30 IST