చిరు అవకాశం ఇచ్చినా వదులుకొన్నా

ABN , First Publish Date - 2022-06-26T08:36:54+05:30 IST

‘‘ఓటీటీ ద్వారా నా సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నాక్కూడా నా సినిమాని నేరుగా తెలుగులో విడుదల చేయాలని ఉండేది.

చిరు అవకాశం ఇచ్చినా  వదులుకొన్నా

ఫృథ్వీరాజ్‌ సుకుమారన్‌... తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ... నటుడిగా, దర్శకుడిగా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితుడే.  ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘బ్రో డాడీ’, ‘జనగణమన’, ‘అయ్యప్పయునుమ్‌ కోషియమ్‌’ చిత్రాలతో అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఫృథ్వీరాజ్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఫృథ్వీరాజ్‌తో మాటా మంతీ... 


‘ఓటీటీ ద్వారా నా సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నాక్కూడా నా సినిమాని నేరుగా  తెలుగులో విడుదల చేయాలని ఉండేది. అది ‘కడువా’తో వాస్తవ రూపంలోకి వచ్చింది. ‘కడువా’ అంటే మలయాళంలో పులి అని అర్థం. ఈ సినిమాలో నన్ను షార్ట్‌ కట్‌లో ‘కడువా’ అని పిలుస్తారు. అందుకే అదే టైటిల్‌గా ఖరారు చేశాం. మలయాళంలో చాలారకాలైన సినిమాలొస్తున్నాయి. కమర్షియల్‌తో పాటు ప్రయోగాత్మక చిత్రాలు తీస్తున్నారు. పాప్‌కార్న్‌ తరహా సినిమా అంటారు కదా, ఆ జానర్‌లో ఓ సినిమా వచ్చి చాలాకాలమైంది. ‘ఇలాంటి కథలు ఇప్పుడు ఎందుకు తెరకెక్కించడం లేదు’ అనిపించింది. అన్ని రకాల సినిమాలూ రావాలి. రకరకాల జోనర్ల సినిమాల్ని ప్రేక్షకులు చూడాలి. ‘కడువా’ తరహా కథలు ఇదివరకెప్పుడో వచ్చాయి. వాటికి ఇప్పుడు గ్యాప్‌ వచ్చింది. అందుకే.. మళ్లీ ఆ తరహా కథని చెప్పాలనుకొని ఈ సినిమా తీశాం’’


ఆ స్పష్టత అవసరం 

‘‘నాకు తెలిసి భవిష్యత్తులో రీమేక్‌ చిత్రాలు ఉండవు. ఎందుకంటే.. ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయి. ప్రతీ సినిమానీ సబ్‌ టైటిల్స్‌తో గానీ, డబ్బింగ్‌ రూపంలోగానీ చూడడం అలవాటు చేసుకొన్నారు. ఏ కథని ఓటీటీలో చెప్పాలి? ఏది థియేటర్లో రిలీజ్‌ చేయాలి? అనే విషయంలో దర్శక నిర్మాతలకు ఓ స్పష్టత అవసరం. కొన్ని కథల్ని థియేటర్లో సమూహం మధ్యలో కూర్చుని చూడాలి. కొన్ని కథల్ని ఒంటరిగా ఇంట్లో చిన్న తెరపై చూసుకుంటే చాలు. ఈ తేడా తెలుసుకుంటే... మంచి ఫలితాలొస్తాయి. ‘బ్రో డాడీ’ సినిమాని ఓటీటీలో విడుదల చేశాం. కరోనా సమయంలో, షూటింగులకు అనువుగా లేని పరిస్థితుల్లో ‘బ్రో డాడీ’ రూపొందించాం. ఆ సమయంలో కొచ్చిలో షూటింగులకు అనుమతి లేదు. దాంతో హైదరాబాద్‌ వచ్చి.. ఓ పెద్ద ఇంట్లో షూటింగ్‌ పూర్తి చేశాం. హైదరాబాద్‌లో షూటింగ్‌కి అనువైన పరిస్థితులు ఉంటాయి. ఓ రోడ్డు బ్లాక్‌ చేసి, షూటింగ్‌ చేసినా ‘ఓహో.. షూటింగా..’ అనుకుని జనం సహకరిస్తారు. కొచ్చిలో అలా కాదు. ‘మా పనులకు ఎందుకు ఆటంకం కలిగిస్తారు’ అని అడ్డుతగులుతారు’’.


‘సైరా’లో నటించమంటే...

‘లూసీఫర్‌ని తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌’ గా రీమేక్‌ చేయాలనుకొన్నప్పుడు దర్శకుడిగా ముందు నా పేరే పరిశీలించారు. అయితే ఆ సమయంలో నాకున్న కమిట్‌మెంట్స్‌ వల్ల కుదర్లేదు. అలా చిరు సినిమా వదులుకొన్నా. ‘సైరా నరసింహారెడ్డి’ సమయంలోనూ ఓ చిన్న పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పుడూ వీలు కాలేదు. ‘లూసిఫర్‌ 2’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ సినిమాని కూడా తెలుగులో చిరంజీవి సార్‌ రీమేక్‌ చేయాలనుకుంటే, అప్పుడు మాత్రం దర్శకత్వం చేసే అవకాశాన్ని వదులుకోను. ‘భీమ్లానాయక్‌’ షో నాకోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకొన్నారు రానా. కానీ ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. కాబట్టి చూడడడం కుదర్లేదు. ‘సలార్‌’లో నాకు అవకాశం వచ్చింది. అయితే డేట్లు సర్దుబాటు కాలేదు. ఆ సినిమాని వదులుకొందాం అనుకొన్నా. ఇప్పుడు మళ్లీ డేట్లు ఎడ్జస్ట్‌ చేసే అవకాశం వచ్చింది. ఈసారైనా కుదురుతుందో, లేదో చూడాలి’’

Updated Date - 2022-06-26T08:36:54+05:30 IST