గ్లాండ్‌ ఫార్మా రూ.550 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-05-22T06:57:10+05:30 IST

రానున్న రెండేళ్లలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గ్లాండ్‌ ఫార్మా రెడీ అవుతోంది.

గ్లాండ్‌ ఫార్మా రూ.550 కోట్ల పెట్టుబడులు

ఇంజెక్టబుల్స్‌ సామర్థ్యాల పెంపు

2022-23 అమ్మకాల్లో 10ు వృద్ధి అంచనా


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రానున్న రెండేళ్లలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గ్లాండ్‌ ఫార్మా  రెడీ అవుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని పాశమైలారంలో ఇంజెక్టబుల్స్‌ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), వేర్‌హౌసింగ్‌ సామర్థ్యాలను పెంచుకోనున్నట్లు గ్లాండ్‌ ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు, వచ్చే ఏడాది రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వివిధ దేశాల్లో కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సర అమ్మకాల్లో 10-11 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని భావిస్తోంది.

 పెప్‌టైడ్స్‌, లాంగ్‌-యాక్టింగ్‌ ఇంజెక్టబుల్స్‌  వంటి కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్స్‌, హార్మోనల్‌ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో సామర్థ్యాలను గ్లాండ్‌ ఫార్మా పెంచుకుంటోంది. పాశమైలారం యూనిట్‌లో కొత్తగా మూడు లిక్విడ్‌ వయల్‌ లైన్లను, ఒక ప్రీ-ఫిల్డ్‌ సిరంజ్‌ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. 


కొత్త ఉత్పత్తుల ఆదాయం 5 శాతం: గత ఆర్థిక సంవత్సరం కొత్తగా విడుదల చేసిన ఉత్పత్తుల ఆదాయం మొత్తం ఆదాయంలో 5 శాతంగా ఉంది. గ్లాండ్‌ ఫార్మాకు అమెరికా, యూరోప్‌, కెనడా, ఆస్ట్రేలియా కీలక మార్కెట్లుగా ఉన్నాయి. అమెరికాలో 2021-22లో 29 ఏఎన్‌డీఏలను కంపెనీ దాఖలు చేసింది. కాగా 19 ఏఎన్‌డీఏలకు అనుమతి లభించింది. భారత మార్కెట్లో పరిమాణ పరంగా విక్రయాలు పెరగడం వల్ల అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఏడాదిలో భారత్‌లో ఔషధ విక్రయాలు 60 శాతం పెరిగి రూ.627 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. కీలక మార్కెట్లలో అమ్మకాలు 16 శాతం వృద్ధితో రూ.2,925 కోట్లకు చేరాయి.


బయోసిమిలర్లలో పట్టుకు యత్నాలు: బయోసిమిలర్లు, బయోలాజిక్స్‌ విభాగాల్లో కాంట్రాక్ట్‌ డెవల్‌పమెంట్‌, తయారీ (సీడీఎంఓ) కార్యకలాపాల్లో సామర్థ్యాలను పెంచుకోనుంది. ఇందుకు అనుగుణంగా బయోసిమిలర్ల రంగంలో పేరున్న కంపెనీలతో చేతులు కలపాలని గ్లాండ్‌ ఫార్మా నిర్ణ్ణయించింది. గత ఏడాది హైదరాబాద్‌ బయోఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ విటాన్‌ బయోలాజిక్స్‌ ఆస్తులను కంపెనీ కొనుగోలు చేసింది. వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ను బయోలాజిక్స్‌ తయారీకి అనుగుణంగా మార్పులు చేసింది. 

ఔషధాల తయారీకి అవసరమైన ఏపీఐలలో 33 శాతాన్ని సొంతంగా సమకూర్చుకుంటోంది. చైనా మార్కెట్‌ కోసం ఔషధాల అభివృద్ధి కొనసాగుతుందని.. కొవిడ్‌ కారణంగా చైనా మార్కెట్లో కొత్త ఔషధాలకు అనుమతి పొందే ప్రక్రియలో కొద్దిగా జాప్యం జరుగుతోందని గ్లాండ్‌ ఫార్మా వెల్లడించింది. 

Updated Date - 2022-05-22T06:57:10+05:30 IST