గుర్రాల్లో ‘గ్లాండర్స్‌’

ABN , First Publish Date - 2022-05-28T09:34:16+05:30 IST

గుర్రాల్లో ‘గ్లాండర్స్‌’

గుర్రాల్లో ‘గ్లాండర్స్‌’

గుంటూరు జిల్లాలో ప్రాణాంతక అంటువ్యాధి గుర్తింపు

 ప్రబలకుండా పశుసంవర్థకశాఖ చర్యలు

గుర్రాల ప్రదర్శన, సేకరణపై నిషేధం విధింపు

నియంత్రిత జిల్లాగా  సర్కార్‌ గెజిట్‌ జారీ 


అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): గుర్రాలకు ‘గ్లాండర్స్‌’ అనే అంటువ్యాధి ప్రాణాంతకమవుతోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న ఈ వ్యాధిని తాజాగా గుంటూరు జిల్లాలో పశువైద్యులు గుర్తించారు. దీంతో వ్యాధి ప్రబలకుండా పశుసంవర్ధకశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పశువుల అంటువ్యాధుల నియంత్రణ, నిరోధక చట్టం ప్రకారం రాష్ట్రం లోపల, బయట ఎక్కడికైనాగుర్రాలను తరలించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాను గుర్రాల నియంత్రిత ప్రాంతంగా ప్రకటించింది. అలాగే గుర్రాల ప్రదర్శన, సేకరణను కూడా నిషేధిస్తూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 


వ్యాధి ప్రబలే తీరు..

కలుషిత ఆహారం, కలుషిత నీటిలోని బ్యాక్టీరియా ద్వారా గుర్రపు జాతికి వచ్చే ప్రాణాంతక అంటువ్యాధి గ్లాండర్స్‌. దీన్ని ఫార్సీ అని కూడా అంటారు. గుర్రాల్లో శ్వాసకోశం, ఊపిరితిత్తులు, చర్మంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. గుర్రాల నుంచి ఇతర జంతువులకు, మనుషులకూ సంక్రమించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. అమెరికా సహా అనేక దేశాల్లో ఈ వ్యాధిని నియంత్రించారు. 2019కు ముందు ఇరాక్‌, టర్కీ, పాకిస్థాన్‌, భారత్‌, మంగోలియా, చైనా, బ్రెజిల్‌, అరబ్‌ దేశాల్లో ఉనికిని గుర్తించారు. ముక్కు ద్వారా లేదా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా ఈ వ్యాధి గుర్రాలకు సంక్రమిస్తుంది. గ్లాండర్స్‌ సోకిన జంతువులకు 106డిగ్రీల జ్వరం, రక్తంలో, కాళ్లపై గడ్డలతో చీము వంటి ఇన్ఫెక్షన్‌ ఏర్పడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి, కొన్ని రోజుల్లోనే మృత్యువాత పడే ప్రమాదం ఉందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లేదు. లక్షణాలను ముందుగా గుర్తించి, వ్యాధి నిర్మూలనకు చర్య లు తీసుకోవడమే ఉత్తమ మార్గమని చెబుతున్నారు. పూర్వం రాజుల వాహనాలుగా గుర్రాలను వినియోగించారు. కాలక్రమంలో వాటి సంతతి బాగా తగ్గిపోయింది. 1990 వరకు గుర్రపు బండ్లు విరివిగా ఉండేవి. క్రమంగా అవీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఎక్కడో కొద్ది మంది గుర్రాలను పెంచుకుంటున్నారు. వాటిని వివాహ వేడుకలు, రాజకీయ నాయకుల ఊరేగింపుల్లో వాడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటలో ఆట గుర్రాలను స్థానికులు పెంచుతున్నారు. మంచి జాతి లక్షణాలున్న గుర్రాలను రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి, ఖరీదైన ఆహారంతో పెంచుతున్నారు. అందంగా అలంకరించి వేడుకల్లో వినియోగిస్తున్నారు.  


జాగ్రత్తలు తీసుకోవాలి: వెటర్నరీ డైరెక్టర్‌ 

గుంటూరు జిల్లాలో కొన్ని కేసులు నిర్ధారణ అయినందున ముందుజాగ్రత్త చర్యగా నియంత్రణ ఉత్తర్వులు ఇచ్చినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. వేడుకలకు గుర్రాలను వాడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గుర్రాల సంతతి చాలా తక్కువగా ఉన్నందున భయపడనవసరం లేదని, గుర్రాలు అధికంగా ఉన్న చోట మాత్రమే వ్యాధి విస్తరించే అవకాశం ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2022-05-28T09:34:16+05:30 IST