కంటి చూపు దోచే గ్లాకోమా.. జాగ్రత్త పడకపోతే..!

ABN , First Publish Date - 2022-07-19T19:28:28+05:30 IST

చడీచప్పుడు లేకుండా కంటి చూపును హరించే కంటి సమస్య ‘గ్లాకోమా’. బాధితుడికి ఎటువంటి అనుమానం

కంటి చూపు దోచే గ్లాకోమా.. జాగ్రత్త పడకపోతే..!

చడీచప్పుడు లేకుండా కంటి చూపును హరించే కంటి సమస్య ‘గ్లాకోమా’. బాధితుడికి ఎటువంటి అనుమానం రానివ్వకుండా కంటి చూపును హరించే సమస్య ఇది. ఈ సమస్యను కనిపెట్టకుండా ఉండిపోతే,  చివరకు కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 


ఈ సమస్య గురించి మనలో 95 శాతం మందికి తెలియదు. నేను కూడా ప్రారంభంలో కనిపెట్టలేకపోయాను. ఇందుకు కారణం ఈ నీటి కాసుల సమస్యలో కంటి నొప్పి, వాపు, ఎర్రబడడం లాంటి లక్షణాలు లేకపోవడమే! ఈ సమస్యలో కనుచూపు కనుగుడ్డు పక్కల నుంచి హరించడం మొదలుపెడుతుంది. నేరుగా అన్నీ చూడగలుగుతాం కాబట్టి, పక్కల నుంచి కమ్ముకొచ్చే సమస్యను పట్టించుకోం. మనంతట మనకు అనుమానం తలెత్తి, వైద్యులను కలిసి, పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య బయటపడుతుంది.


లక్షణాలు ఇవే!

ఈ నీటి కాసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి నెమ్మదిగా చూపును హరిస్తే, రెండో రకంలో చూపు హఠాత్తుగా పోతుంది. కోల్పోయిన చూపును చికిత్సతో, మందులతో తిరిగి తెప్పించే వీలుండదు కాబట్టి, ఉన్న చూపును కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఇందుకోసం కొందర్లో కొన్ని లక్షణాలు మొదలవుతాయి. అవేంటంటే..


  • కళ్లు నొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబారడం, దృష్టి లోపం, లైట్ల చుట్టూరా కాంతి వలయాలు. 


ఆలస్యం అమృతం, విషంనా విషయానికొస్తే, సుమారు దశాబ్దం క్రితం ఓ యువ కంటి డాక్టరు నా కళ్లను పరీక్షించి, గ్లాకోమా అనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నేను వేరొక ప్రముఖ కంటి వైద్యుడిని కలిశాను. అయితే యువ డాక్టరు వ్యక్తం చేసిన అనుమానం గురించి, నేను పెద్ద డాక్టరుకు చెప్పకపోవడంతో, ఆయన కళ్లు పరీక్షించి, చూపుకు అవసరమయ్యే అద్దాలు సూచించారు. ఆ తర్వాత శుక్లాలు ఉన్నాయని, వాటిని తీయించినా, కంటి చూపు మెరుగు పడలేదు. ఈ విషయం డాక్టరుకు చెప్పినప్పుడు వైద్య పరీక్షలు చేసి గ్లాకోమాగా నిర్ధారించారు. అప్పటికే నా కుడి కన్ను 90%, ఎడమ కన్ను 80% దృష్టిని కోల్పోయాయి. జీవితాంతం కంట్లో వేసుకునే చుక్కల మందును సూచించారు. మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి చూపు కూడా పోకుండా ఉండాలంటే నేను ఆ చుక్కల మందును వాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఉన్న చూపును కాపాడుకునే పనిలో ఉన్నాను. కాబట్టి మీకు చూపు మందగిస్తున్నట్టు అనుమానం వస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి గ్లాకోమా కాదని నిర్ధారించుకోండి. 

-సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌.

Updated Date - 2022-07-19T19:28:28+05:30 IST