వైభవం.. అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం

ABN , First Publish Date - 2022-05-24T07:53:18+05:30 IST

కుప్పం గంగ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతర గంగమ్మదే అయినా, ఆమె సోదరి ముత్తుమారెమ్మకు సైతం విశేష వాహన సేవలు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిర్వహిస్తున్నారు.

వైభవం.. అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం
భక్తులను అదుపు చేస్తున్న పోలీసులు

నేడు కుప్పంలో గంగమ్మ శిరస్సు ఊరేగింపు 

కుప్పం, 23: కుప్పం గంగ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతర గంగమ్మదే అయినా, ఆమె సోదరి ముత్తుమారెమ్మకు సైతం విశేష వాహన సేవలు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చేది కేవలం బుధవారం మాత్రమే. మంగళవారం కూడా ఆయమ్మ శిరస్సు మాత్రమే ఊరేగింపునకు వస్తుంది. ముత్తుమారెమ్మ అగ్నిప్రవేశ ఘట్టం సోమవారం అత్యద్భుత రీతిలో జరిగింది. అగ్నిగుండం రగిలేచోట ఉదయం పూజారులు, అర్చకులు భూమిపూజ చేశారు. అనంతరం పెద్దబావి వద్ద గంగపూజ నిర్వహించి ముత్తుమారెమ్మ అభిషేకంకోసం గంగను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అదే గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్నిగుండానికి పూజారాధన నిర్వహించి గుండాన్ని నిప్పుతో రగిల్చారు. అనంతరం పెద్దబావినుంచి అమ్మవారి ఆభరణాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి పూజలు చేసి ముత్తుమారెమ్మకు అలంకరించారు. తర్వాత అమ్మవారికి అడ్డుగా ఉన్న తెర తొలగించి కర్పూర హారతులిచ్చారు. అప్పుడు బయలుదేరింది అమ్మవారు అగ్నిగుండ ప్రవేశంకోసం. మంగళతూర్యారావాలు మోగుతుండగా, అర్చకుల మంత్రపఠనాలు సాగుతుండగా, భక్తజనం జేజేలు పలుకుతుండగా, కిక్కిరిసిన జనసమూహం మధ్యగా ఉగ్రరూపిణియైున అమ్మవారు అగ్నిగుండం వద్దకు వేంచేశారు. అమ్మవారికి మళ్లీ అక్కడ అర్చకులు, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మల్లెచెండును గుండంలో దొర్లించి అనంతరం గణాచారి ప్రవేశించాడు. ఆయన ముందు వెళ్తుండగా అమ్మవారు కదనరంగంలో దూకిన అపరకాళిలా, గుండంలో పైగెసే జ్వాలా కేళికలా అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆలోగా పవిత్ర స్నానాలాచరించి తడి బట్టలతో వరుసలో నిలబడ్డ భక్తులు.. ఒకరితర్వాత ఒకరుగా అమ్మ వెంట అగ్నిగుండంలో నడిచారు. కొద్దిసేపు వరుస తప్పకున్నా, తర్వాత భక్తులు ఒకరితో పోటీ పడుతూ మరొకరు, ఒకరిని మించుతూ ఇంకొకరు అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారి పట్ల తమ భక్తిని చాటుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారు పుష్పపల్లకీపై ఆసీనులై పురవిహారం చేశారు. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కాగా, భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. 

Updated Date - 2022-05-24T07:53:18+05:30 IST