జ్ఞానవాపి కేసు.. జిల్లా జడ్జికి బదిలీ

ABN , First Publish Date - 2022-05-21T08:03:28+05:30 IST

వారాణసీలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

జ్ఞానవాపి కేసు.. జిల్లా జడ్జికి బదిలీ

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇది సున్నితం.. సంక్లిష్ట వ్యవహారం

అనుభవజ్ఞుడు విచారించాలి

జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టీకరణ 


న్యూఢిల్లీ/అలహాబాద్‌, మే 20: వారాణసీలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) నుంచి వారాణసీ జిల్లా జడ్జికి బదిలీచేసింది.

ఈ వ్యవహారం సున్నితం.. సంక్లిష్టమైనది కావడంతో అనుభవజ్ఞుడైన సీనియర్‌ న్యాయాధికారి విచారణ జరపడం మంచిదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఇంతవరకు కేసును విచారించిన సివిల్‌ జడ్జిపై తామెలాంటి ప్రతికూల వ్యాఖ్యలూ చేయడం లేదని, ఆయన న్యాయవ్యవస్థలో భాగమని తేల్చిచెప్పింది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ)లోని 11వ నిబంధనలోని ఏడో ఆదేశం కింద ప్రార్థనా మందిరాలకు సంబంధించి సివిల్‌ సూట్‌ దాఖలు చేయరాదని పార్లమెంటు చట్టం నిషేధిస్తోందంటూ మసీదు కమిటీ దరఖాస్తు దాఖలు చేసిందని.. ఆ కేసు పత్రాలు సివిల్‌ జడ్జి నుంచి బదిలీ కాగానే ఆ దరఖాస్తు విచారణార్హతపై తొలుత తేల్చాలని జిల్లా జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. దీనిని తేల్చాక.. కక్షిదారులకు ఏవైనా అభ్యంతరాలుంటే పై కోర్టులో సవాల్‌ చేయడానికి 8 వారాలు గడువిచ్చింది. అప్పటిదాకా ఈ నెల 17న తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని అంటున్న ప్రాంతాన్ని సంరక్షించాలని.. మసీదు ప్రాంగణంలో ముస్లింలు యథాప్రకారం నమాజ్‌ చేసుకోవచ్చని తేల్చిచెప్పింది. నమాజ్‌ కోసం వచ్చే ముస్లింలు కాళ్లూచేతులు కడుక్కోవడానికి వీలుగా తగు ఏర్పాట్లు చేయాలని.. ఇందుకోసం ఈ వివాదంలో భాగస్వాములైనవారిని సంప్రదించాలని జిల్లా జడ్జిని నిర్దేశించింది. ఈ కేసును వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని తెలిపింది.

జ్ఞానవాపి మసీదు సముదాయంలో పశ్చిమ గోడ వెనుక ఉన్న శృంగార గౌరి ఆలయంలో ఇప్పటివరకు ఏడాదికి ఒక్కసారే పూజలకు అనుమతిస్తున్నారని.. అలాకాకుండా ఏడాది పొడవునా పూజలు చేసేందుకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు సివిల్‌ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో అక్కడ వీడియోగ్రఫీ, సర్వే చేసేందుకు  న్యాయస్థానం గత నెల 26న ఆదేశాలిచ్చింది. దీనిని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు నిర్వహణ కమిటీ సవాల్‌ చేయగా.. అలహాబాద్‌ హైకోర్టు.. కమిషన్‌ నియామకాన్ని సమర్థించింది. హైకోర్టు ఆదేశాలను కమిటీ సుప్రీంలో సవాల్‌ చేసింది. ఈ అప్పీలుపై త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కోర్టు కమిషనర్‌ ఇప్పటికే సర్వే పూర్తిచేసినందున మసీదు కమిటీ అప్పీలు నిష్ఫలమైపోయిందని హిందూ కక్షిదారుల తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కమిషనర్‌ నివేదికను పరిశీలించాలని కోరారు. అయితే సర్వే చేసే అధికారం కమిషన్‌కు ఉందో లేదో తేలాలంటే.. మొదట మసీదు కమిటీ పిటిషన్‌ విచారణార్హతను దిగువ కోర్టు తేల్చాల్సి ఉంటుందని.. ముస్లింలకు అనుకూలంగా ఆ కోర్టు గనుక నిర్ణయం తీసుకుంటే వివాదం ముగిసిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, కాశీవిశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించిన విచారణను అలహాబాద్‌ హైకోర్టు జూలై 6కి వాయిదావేసింది. 


సుప్రీం జోక్యం  చేసుకోకుంటే అలజడులే..

అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రార్థనాస్థలాల చట్టానికి (1991) అనుగుణంగా లేవని.. అందుచేత వాటిని కొట్టివేయాలని మసీదు కమిటీ తరఫు సీనియర్‌ న్యాయవాది హుఫేజా అహ్మదీ విజ్ఞప్తి చేశారు. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకపోతే ఇతర కట్టడాలకు సంబంధించి కూడా మరిన్ని వివాదాలను రేపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మసీదు కమిటీపై నిర్ణయం తీసుకునేవరకు క్షేత్రస్థాయిలో జరిగేది మీరు గమనించాలి. ఈ కేసును దేశవ్యాప్తంగా మరో నాలుగైదు మసీదుల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇది మరిన్ని అలజడులను రేపుతుంది. ఈ రోజు దీనిని అనుమతిస్తే రేపు మరో మసీదు కూడా గతంలో ఆలయమేనని వారు చెబుతారు’ అని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే తమంతట తాము పిటిషన్‌ విచారణార్హతపై నిర్ణయం తీసుకోజాలమని బెంచ్‌ పేర్కొంది. 


లీకులు ఆపాలి..

మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు సంబంధించి మీడియాకు లీకులివ్వడం ఆపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారాణసీ సివిల్‌ కోర్టుకు అడ్వకేట్‌ కమిషనర్‌ గురువారం సర్వే నివేదికను సమర్పించిన కొద్ది గంటలకే అందులోని అంశాలు లీకయ్యాయి. ఇలా ఎంపిక చేసిన లీకులు ఆపాలని, వివిధ వర్గాల మధ్య సోదర భావం అవసరమని.. శాంతి తమకు అత్యంత ప్రధానమని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-05-21T08:03:28+05:30 IST