జ్ఞాన్‌వాపి: ఆ చట్టమే న్యాయానికి వెలుగుదారి

Published: Tue, 24 May 2022 00:50:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జ్ఞాన్‌వాపి: ఆ చట్టమే న్యాయానికి వెలుగుదారి

అయోధ్యలో కట్టడాన్ని కూల్చివేయడానికి ఏడాదికి ముందే ‘ ప్రార్థనా స్థలాల చట్టం–1991’ని పార్లమెంటు ఆమోదించింది. అయోధ్యలోని వివాదం, పెండింగ్‌లో ఉన్న అదే విధమైన వివాదాల మధ్య ఈ చట్టం ఒక నిర్దిష్ట వేర్పాటును నిర్దేశించింది. అయోధ్య వివాదాన్ని న్యాయస్థాన ప్రక్రియల ద్వారా పరిష్కరించుకోవాలని, అయితే ఇతర వివాదాలపై ఎలాంటి కొత్త దావాలను విచారణకు స్వీకరించకూడదని కూడా ఈ చట్టం స్పష్టం చేసింది.


1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఇతర మత కట్టడాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయని, వాటి స్థితిగతులను ఎట్టి పరిస్థితులలోనూ మార్చకూడదనే నిశ్చిత వైఖరికి ‘ప్రార్థనా స్థలాల చట్టం–1991’ ద్వారా పార్లమెంటు నిబద్ధమయింది. ఈ దృష్ట్యా, చట్టం, తర్కం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఒక ప్రార్థనా స్థలం మసీదుగా ఉన్న పక్షంలో అది మసీదుగానే ఉంటుంది. అలాగే ఒక దేవాలయంగా ఉన్నట్టయితే అది ఒక దేవాలయంగా మాత్రమే కొనసాగుతుంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ప్రార్థనా స్థలాలు మతపరమైన లేదా అందులోని వేర్వేరు శాఖలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక శివాలయం ఒక వైష్ణవాలయం కావడం చట్ట విరుద్ధం; ఒక షియా మసీదు ఒక సున్నీ మసీదుగా మారకూడదు.


ఒక ఏడాది అనంతరం 1992 డిసెంబర్ 6న అయోధ్య వివాదం పరాకాష్ఠకు చేరింది. కట్టడాన్ని కూల్చివేసి, దాని శిథిలాలపై నిర్మించిన ఒక తాత్కాలిక దేవళంలో రామ్ లల్లాను ప్రతిష్ఠాపించారు. ఈ ప్రక్రియ అంతా ‘కరసేవ’గా సుప్రసిద్ధమయింది అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నవారందరూ ఈ ‘కరసేవ’లో పాల్గొన్న వారే. శిథిలాల కింద ఉన్న భూమికి యజమాని ఎవరనే విషయమై అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఆ వివాదం అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతో పరిసమాప్తి అయింది. గమనార్హమైన విషయమేమిటంటే అయోధ్యలో కట్టడం కూల్చివేత ‘ఒక భయానక చర్య’ అని అంతిమ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం అంగీకరించింది.


ఆ భూమిపై వాది, ప్రతివాది (హిందువులు, ముస్లింలు) హక్కులను నిర్ధారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం న్యాయనిర్ణయం తీసుకుంది. అయితే మత సామరస్యాన్ని సంరక్షించే లక్ష్యంతో ముస్లింలకు మరో చోట రెట్టింపు స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు న్యాయమూర్తులు ప్రయత్నించారు. సుప్రీంకోర్టు తీర్పును పలువురు తీవ్రంగా విమర్శించారు. ఆ తీర్పు ‘తానేదార్ న్యాయం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. శాంతి సామరస్యాలను కాపాడాలన్న ఆరాటంలో న్యాయశాస్త్ర నియమాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఉల్లంఘించిందని, సమన్యాయపాలనకు నిబద్ధమవ లేదని పలువురు అభిప్రాయపడ్డారు.


1980 దశకం ద్వితీయార్థంలో అయోధ్య వివాదంపై ఉద్యమం ముమ్మరమవుతున్న దశలోనే ‘అయోధ్య తో బస్ ఝాన్ కి హై, కాశీ మథుర బాకీ హై’ అనే నినాదాన్ని బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వదిలాయి. నేడు, వారణాసిలో జ్ఞాన్‌వాపి మసీదు, మథురలో కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహి ఈద్గా మసీదు భవిష్యత్తుకు సంబంధించి న్యాయవిచారణా క్రమం పునః ప్రారంభమవడాన్ని దేశ భవిష్యత్తుకు దుశ్శకునాలుగా భావించి తీరాలి. ‘ప్రార్థనా స్థలాల చట్టం–1991’ ప్రకారం ఈ దావాలను అసలు న్యాయవిచారణకు స్వీకరించడమే చట్ట విరుద్ధం. 1991 చట్టం ప్రకారం ప్రార్థనా స్థలాల స్వరూప, స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పిటిషిన్ దాఖలు వేయడానికి వీలులేదు. కోర్టులో ఏ దావాలూ చెల్లవు.


శతాబ్దాల నాటి వివాదాలపై కొత్త దావాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి తీరాలని 1991 చట్టం నిబంధనలు స్పష్టం చేశాయి. అయితే వారణాసిలోని జిల్లా కోర్టు ఆ దావాలను త్రోసిపుచ్చడానికి బదులు వివాదం కొనసాగేలా సాక్ష్యాధారాలను సేకరించేందుకు మసీదు ప్రాంగణంలో సర్వేకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు సైతం తరువాత ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఇటువంటి పిటిషన్లను చట్టం నిర్దేశించిన విధంగా తొలుతనే తిరస్కరించడానికి బదులు, విచారణకు స్వీకరించడం పార్లమెంటు సంకల్పాన్ని వ్యతిరేకించడమే అనడంలో సందేహం లేదు. దీనివల్ల జాతి మళ్లీ అనిశ్చిత పరిస్థితులను, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవలసిరావచ్చు. 1992లో అయోధ్యలో కట్టడాన్ని కూల్చివేసినప్పుడు దేశంలో ప్రజ్వరిల్లిన మతతత్వ హింసాకాండ మళ్లీ రగుల్కొనేందుకు ఆస్కారముంది.


‘ప్రార్థనా స్థలాల చట్టం–1991’ని న్యాయస్థానాలు అమలుపరచితీరాలి. వాటికి మరో ప్రత్యామ్నాయం లేదు. అది పార్లమెంటు చేసిన చట్టం. పార్లమెంటు చేసిన ఒక చట్టాన్ని పార్లమెంటుచేసే మరో చట్టం ద్వారా మాత్రమే మార్చ వలసి ఉంటుంది. మరి 1991 చట్టాన్ని మార్చాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారా? పార్లమెంటు సైతం ఆ చట్టాన్ని మార్చాలని కోరుకుంటుందా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు ఇతమిద్దంగా ఏమీ చెప్పలేం. అలా అని ఊహాగానాలు ఎంత మాత్రం అభిలషణీయంకాదు. పార్లమెంటు తరఫున న్యాయస్థానాలు మాట్లాడకూడదు. అటువంటి తెంపరితనం చూపడం న్యాయవ్యవస్థకు మంచిదికాదు. ఒక చట్టం ఇబ్బందికరంగా కనిపించినప్పుడు పార్లమెంటరీ చట్టాన్ని నిర్లక్ష్యం చేసే హక్కు న్యాయస్థానాలకు లేదు. అటువంటి చట్ట రాహిత్యాన్ని న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితులలోనూ ప్రోత్సహించకూడదు.


1991 చట్టాన్ని ప్రశ్నించడమే దానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు వేసిన వారి లక్ష్యమా? పార్లమెంటు ఆ చట్టాన్ని పునః పరిశీలించే పరిస్థితులను సృష్టించడమే వారి ఉద్దేశమై ఉండవచ్చు. ఏమైనా 1991నాటి పార్లమెంటు విజ్ఞతా వివేకాలను నేటి పార్లమెంటుకూడా చూపగలదని నేను ఆశిస్తున్నాను. దేశం ఒక తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఆ చట్టాన్ని తీసుకువచ్చింది. ఒక పక్క మండల్ ఉద్యమం, మరో పక్క మందిర్ ఉద్యమం దేశాన్ని అల్లకల్లోలం చేసిన రోజులవి. వీటన్నిటికీ మించి దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా దివాలా తీసిన సందర్భమది. సరళీకృత ఆర్థిక విధానలను ప్రవేశపెట్టడం అనివార్యమయింది. ఆ వెన్వెంటనే దేశంలో మత సామరస్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ‘ప్రార్థనా స్థలాల చట్టం’ను మన పార్లమెంటు తీసుకువచ్చింది. అవును, 1991 మన వర్తమాన చరిత్రతో ఎంతో ప్రాముఖ్యమున్న సంవత్సరం.


జ్ఞాన్‌వాపి, దానిని పోలిన ఇతర కేసులపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. 1991 చట్టం నిబంధనల మేరకు అసలు ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు అర్హమైనవా అనే విషయాన్ని నిర్థారించమని ట్రయల్ కోర్టును ఆదేశించే అవకాశముంది. అయితే ఇటీవల అయోధ్య వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు తాను ప్రయత్నించిన విషయాన్ని సర్వోన్నతన్యాయస్థానం విస్మరించకూడదు. ఆ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతమయిందని చెప్పలేము. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయ సంబంధ విధానం స్ఫూర్తితో మథుర, వారణాసి, ఇంకా ఇతర ప్రదేశాలలో కొత్త సమస్యలు ఏర్పడకుండా విజ్ఞతాయుతమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. శతాబ్దాల నాటి వివాదాలపై సరికొత్త దావాలను విచారణకు స్వీకరించడం వివేకవంతంకాదనే భావన ప్రాతిపదికనే ఏ దృఢ న్యాయవ్యవస్థ అయినా తన విధి నిర్వహణను కొనసాగిస్తుంది. ఎవరైనా ఒకరు ఎలాంటి ఆస్తిపైన అయినా 12 సంవత్సరాల పాటు ప్రతికూల యాజమాన్యం కలిగి ఉన్నప్పుడు అతడు ఆ సంపదను బేదఖల్ చేయనవసరం లేదని కాలపరిమితి శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. మొగల్ చక్రవర్తుల కాలంలో ప్రార్థనా స్థలాలలో మార్పులు జరిగినట్టు చారిత్రక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాటి యథాతథ పరిస్థితి కొనసాగడమే న్యాయసమ్మతమవుతుంది.

సంజయ్ ఆర్ హెగ్డే

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.