Advertisement

అమరావతి కోసం ఆంధ్రుల నినాదం

Oct 27 2020 @ 02:15AM

పెయిడ్‌ ఆర్టిస్టులతో గందరగోళానికి కుట్ర

314వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి రూరల్‌, తాడికొండ, అక్టోబరు 26: అమరావతి కోసం ఆంధ్రులంతా ఒకే నినాదం చేస్తోన్నారని రాజధాని రైతులు, రైతు కూలీలు తెలిపారు. ఏకైక రాజధాని అమరావతి కోసం వారు చేస్తోన్న ఉద్యమం సోమవారంతో 314వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకువచ్చి ఆందోళన చేయించడం విడ్డూరమన్నారు. రోజూ ఆటోల్లో అమరావతికి తరలిస్తున్నారని దళిత జేఏసీ సభ్యులు పులి చిన్నా, మార్టన్లు ఆరోపించారు. వారివారి ప్రాంతాల్లో ఆందోళనలు చేసుకోవాలని సూచించినందుకు తమపై పోలీసులచే అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిలోకి అసాంఘీక శక్తులు చొరబడుతున్నాయన్నారు. భూములు ఇచ్చిన వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ ఆందోళనలు చేయించడం దారుణమన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని దసరా సందర్భంగా దీక్షా శిబిరాల్లో పోలేరమ్మకు, దుర్గామాతకు పూజలు చేశారు. నెక్కల్లులో చిన్నారులు నవ దుర్గాల వేషాధారణలతో నిరసన తెలిపారు.  


నేడు హైకోర్టు న్యాయవాది పర్యటన

జైబీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌(జేఏజే) వ్యవస్థాపకుడు, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ మంగళవారం రాజధాని గ్రామాలలో పర్యటించి అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేయనున్నారు. ఈ క్రమంలో ఆయనకు తమ బాధలు చెప్పేందుకు రైతులు, కూలీలు సిద్ధమయ్యారు.


 తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న దీక్షలు సోమవారంతో 314వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ  రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనజాలవని వ్యాఖ్యానించారు. 314రోజులుగా దీక్షలు చేస్తున్నా మొండి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు.

  

 మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ మంగళగిరి మండలం యర్రబాలెం, బేతపూడిలో రైతులు, రైతు కూలీలు నిరసనలు కొనసాగించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు, ఐకాస నేతలు తెలిపారు.     సీఎం జగన్‌ మైండ్‌ సెట్‌ మార్చి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా చూడాలంటూ మాజీ జడ్పీటీసీ, జేఏసీ నేత ఆకుల జయసత్య ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారికి   పూజలు నిర్వహించారు.


 రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  మూడు రాజధానులపై కొన్ని సంస్థల సర్వేలో 88 శాతం మంది ప్రజలు వ్యతిరేకించగా 12 శాతం మాత్రమే మద్దతు తెలిపారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.