సేవ చేస్తామన్నా లంచమే

ABN , First Publish Date - 2020-10-27T07:48:35+05:30 IST

సేవ చేస్తామన్నా లంచమే

సేవ చేస్తామన్నా లంచమే

 వృద్ధాశ్రమం అనుమతికి రూ.10 వేలు డిమాండ్‌

 ఏసీబీకి పట్టుబడిన విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ

 

గుంటూరు, అక్టోబరు 26: వృద్ధాశ్రమం అనుమతికి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ ఇన్‌చార్జి ఏడీ గాజుల వెంకటరమణ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీలు టీవీవీ ప్రతాప్‌కుమార్‌, భవానీహర్ష తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట పరిధిలోని యలమంద పంచాయతీ కోటప్పకొండ రోడ్డుకి చెందిన శ్రీ వివేకానంద మహిళా మండలి సంస్థ అధ్యక్షుడు రాజాభరత్‌ తన ఇంట్లో వృద్ధాశ్రమం పెట్టేందుకు గుంటూరులోని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో ఈ నెల 15న ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22న వెంకటరమణ తనిఖీకి వెళ్లిన సమయంలో కారు డీజిల్‌ ఖర్చు కింద రాజా భరత్‌ నుంచి రూ.2 వేలు వసూలు చేశాడు. 


ఆ తరువాత ఆశ్రమానికి అనుమతి మంజూరు చేయాలంటే రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలుకున్నా తగ్గలేదు. దీంతో బాధితుడు ఏసీబీ అఽధికారులను సంప్రదించగా వారు ఆధారాలు సేకరించాక కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా సోమవారం రాజా భరత్‌ సంచాలకులు వెంకట రమణను గుంటూరులోని ఆయన కార్యాలయంలో కలసి 10 వేలు ఇచ్చుకోలేనని చెప్పి 5 వేలు ఇచ్చారు. నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను అదుపులోకి తీసుకుని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ దాడిలో డీఎస్పీలతో పాటు ఏసీబీ సీఐలు శ్రీధర్‌, నాగరాజు, రవిబాబు, ఎస్‌ఐ మూర్తి పాల్గొన్నారు. అనంతరం విజయవాడలోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. 

 

ఉద్యోగాల నియామకంలో అక్రమాలు

ఏసీబీ దాడి గురించి తెలుసుకున్న కొందరు విభిన్న ప్రతిభావంతులు కార్యాలయం వద్దకు చేరుకుని వెంకటరమణపై పలు ఆరోపణలు చేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను నగదు తీసుకుని అనర్హులకు ఇచ్చారన్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. దీనిపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగు చూస్తాయని తెలిపారు.


లంచం డిమాండ్‌ చేస్తే సంప్రదించండి 

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ  ప్రతాప్‌కుమార్‌ కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబును 8332971046లో, తనను 8332971039లో, డీఎస్పీ భవానీ హర్షను 9491305638లో సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి పని పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  

Updated Date - 2020-10-27T07:48:35+05:30 IST