ప్రవేశాలు.. ప్రహసనం

ABN , First Publish Date - 2020-10-29T11:21:19+05:30 IST

ఈ ఏడాది నుంచి ఇంటర్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రవేశాలు.. ప్రహసనం

 నేటితో ముగియనున్న ఇంటర్‌ అడ్మిషన్లు

 ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో సర్వత్రా గందరగోళం

 10 శాతం కూడా పూర్తికాని జూనియర్‌ కళాశాలల్లో సీట్లు

 వెబ్‌సైట్‌లో కనిపించని ప్రధాన కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలు 


గుంటూరు(విద్య), అక్టోబరు 28: ఈ ఏడాది నుంచి ఇంటర్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరే అవకాశం కల్పించింది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు తమకు ఇష్టమైన కళాశాల ఆ వెబ్‌సైట్‌లో కనిపించక పోవడంతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. మరోవైపు జూనియర్‌ కళాశాలల్లో ఆడ్మిషన్‌ ప్రక్రియ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తరహాలో ఉంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 57వేల మంది విద్యార్థులు పదిలో ఉత్తీర్ణత సాధించారు. కరోనాతో పరీక్షలు నిర్వహించక పోవడంతో వారికి మార్కులు ఇవ్వకుండా అందరినీ పాస్‌ చేశారు. దీంతో  కులం, ఇతర సామాజిక అంశాలను బేరీజు వేసుకుని అడ్మిషన్‌ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ఇష్టారాజ్యంగా అడ్మిషన్ల విధానానికి స్వస్తిపలికేందుకు ఈ విధానమని  అధికారులు చెబుతున్నారు. అయితే దానివల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు.


గురువారంతో అడ్మిషన్ల గడువు ముగియనున్నా కనీసం 10 శాతం అడ్మిషన్లు కూడా పూర్తికాలేదు. మరోవైపు జిల్లాలో ప్రధాన కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలల వివరాలు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. నిబంధనలు పాటించడం లేదని, పైర్‌ సర్టిఫికెట్‌ తదితర కారణాలతో ఆయా కళాశాలల జాబితాలను వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఇన్‌టెక్‌ విషయంలో కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యహరించాయని, అడ్మిషన్ల జాబితా బోర్డుకు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. 

 

ఆ ఫీజులతో నిర్వహణ ఎలా?

ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులతో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల నిర్వహణ సాధ్యం కాదని యాజమాన్యాలు చెబుతున్నాయి. కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు డే స్కాలర్స్‌ విద్యార్థికి రూ.35 వేల వరకు ఫీజు వసూలు చేసేవారు. అదే రెసిడెన్సీయల్‌ విధానంలో అయితే రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేసేవారు. నీట్‌, ఐఐటీ, ఎంసెట్‌ శిక్షణకు ప్రత్యేకంగా ఫీజులు ఉండేవి. పదిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రభుత్వమే కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కల్పించడానికి గతంలో రూ.35 వేలు చెల్లించింది. అయితే ఇప్పడు మాత్రం రూ.3 వేల నుంచి రూ.5 వేల ఫీజులతో విద్యార్థులకు ఎలా బోధన చేయాలో అర్థం కావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. 


ప్రభుత్వ కళాశాలల్లో అదే పరిస్థితి

జిల్లాలో దాదాపు 35కిపైగా ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో కూడా అడ్మిషన్లు మందకొడిగా సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో అడ్మిషన్ల ఏ కళాశాలలో కూడా జరగలేదని ప్రిన్సిపాల్స్‌ చెబుతున్నారు. అడ్మిషన్ల గడువును ప్రభుత్వం మరో వారం పొడిగించే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2020-10-29T11:21:19+05:30 IST