టీడీపీ కార్యకర్త దుకాణం కూల్చివేత

ABN , First Publish Date - 2020-10-29T11:27:03+05:30 IST

మండలంలోని తురకపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్త షేక్‌ సుభాని మెడికల్‌షాపును ఎన్‌ఎస్పీ అఽధికారులు బుధవారం జేసీబీతో కూల్చివేశారు.

టీడీపీ కార్యకర్త దుకాణం కూల్చివేత

 వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లేనని ఆరోపణ 


మాచవరం, అక్టోబరు 28: మండలంలోని తురకపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్త షేక్‌ సుభాని మెడికల్‌షాపును ఎన్‌ఎస్పీ అఽధికారులు బుధవారం జేసీబీతో కూల్చివేశారు. కనీసం దుకాణంలో ఉన్న సరుకులను, మందులను సర్దుకోకుండానే కూల్చివేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.60 వేల విలవైన మందులు పాడైపోయినట్లు  వాపోయారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మరొక వ్యక్తి వద్ద 15 ఏళ్ల క్రితం ఎన్‌ఎస్పీ కాల్వ పక్కననున్న స్థలాన్ని కొనుగోలుచేసి దుకాణాన్ని నిర్మించారు. ఇటీవల గ్రామంలోని సచివాలయానికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని పంచాయతీ కార్యదర్శికి పలువురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఎస్పీ అధికారులకు బదలాయించారు. వారు  సర్వేచేయించి సుభానికి చెందిన దుకాణం దాదాపు 90శాతం ఎన్‌ఎస్పీ కాల్వ పరిధిలో కట్టుబడి చేసివుందని తెలిపి నోటీసులు అందజేశారు.


అయినా స్పందించకపోవడంతో బుధవారం ఎన్‌ఎస్పీ ఏఈ డీవీ నర్సయ్య పోలీసులతో వచ్చి సుభాని దుకాణాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. దీంతో అదే సమయంలో గ్రామంలో కొంతమేర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సుభాని దుకాణంతోపాటు, పక్కనే ఉన్న మరో మరుగుదొడ్డిని కూడా కూల్చివేశారు. ఈ విషయంపై ఎన్‌ఎస్పీ ఏఈ వెంకటనర్సయ్యను వివరణకోరగా సుభాని ఆరోపణలలో వాస్తవంలేదని మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. అయితే, వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లే కూల్చివేశారని సుభాని ఆరోపించారు.

Updated Date - 2020-10-29T11:27:03+05:30 IST