జీవో 19... చట్టవిరుద్ధం

ABN , First Publish Date - 2021-04-23T10:52:26+05:30 IST

రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను విలీనం చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ

జీవో 19... చట్టవిరుద్ధం

కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే అధికారం స్పెషల్‌ సీఎ్‌సకు లేదు

మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌  ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం

కౌంటర్‌ వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను విలీనం చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కమిషనర్లు తదితరులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యంపై వేసవి సెలవుల తరువాత విచారణ జరుపుతామని పేర్కొంది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఆదేశాలిచ్చారు.


మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 23న మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఆ జీవోను సవాల్‌ చేస్తూ ఉండవల్లికి చెందిన జె.సాంబశివరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ... గ్రామ పంచాయతీలను సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ వ్యాజ్యా లు పరిష్కారం కాకముందే ప్రభుత్వం హడావుడిగా జీవో 19 తీసుకొచ్చిందన్నారు. ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం సెక్షన్‌ 3(1)కు జీవో 19 విరుద్ధమన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే అధికారం పురపాలక శాఖ ప్రత్యేక సీఎ్‌సకు లేదన్నారు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 14,19,21ని ఉల్లంఘించడమేనని అన్నారు.

Updated Date - 2021-04-23T10:52:26+05:30 IST