ఆహారం కోసం వెళ్లి కర్ణాటక విద్యార్థి బలి

ABN , First Publish Date - 2022-03-02T07:14:41+05:30 IST

ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత విద్యార్థి దుర్మరణం

ఆహారం కోసం వెళ్లి కర్ణాటక విద్యార్థి బలి

  • ఉక్రెయిన్‌ ఖార్కివ్‌లో ఘటన
  • మరో విద్యార్థికి గాయాలు
  • షాపు దగ్గర క్యూలో ఉండగా దూసుకొచ్చిన క్షిపణి
  • మృతుడి తండ్రికి మోదీ ఫోన్‌
  • ఆదుకుంటాం: సీఎం బొమ్మై

 

బెంగళూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత విద్యార్థి దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి అక్కడ భారతీయులు మరణించడం ఇదే తొలిసారి. ఖార్కివ్‌ నగరంపై మంగళవారం రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా చళగేరి గ్రామానికి చెందిన శేఖరప్ప గ్యానగౌడర్‌ నవీన్‌(21) ప్రాణాలు కోల్పోయారు. అదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి గాయపడ్డారు. నవీన్‌ ఖార్కివ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి. యుద్ధం నేపథ్యంలో ఇతర విద్యార్థులతో పాటు ఓ బంకర్‌లో నవీన్‌ తలదాచుకున్నారు. మంగళవారం ఉదయమే తండ్రి శేఖరప్పకు నవీన్‌ ఫోన్‌ చేసి, తామున్న బంకర్‌లో ఆహారం, నీరు కూడా లేవని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నవీన్‌ ఆహారం కోసం బయటికి వెళ్లి క్యూలో నిల్చుండగా, అక్కడికి క్షిపణి దూసుకొచ్చింది. ఈ దాడిలో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల శాఖ ధ్రువీకరించింది.



ఉక్రెయిన్‌ మహిళకు దొరికిన ఫోన్‌..

ఆహారం కోసం నవీన్‌ బయటికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని ఖార్కివ్‌లోని స్టూడెంట్స్‌ కోఆర్డినేటర్‌ పూజా ప్రహరాజ్‌ ఓ ఆంగ్ల న్యూస్‌ చానల్‌కు తెలిపారు. అతని సెల్‌ఫోన్‌ ఉక్రెయిన్‌ మహిళకు దొరకడంతో, విషయాన్ని ఆమె తెలియజేశారని వివరించారు. కాగా, నవీన్‌ ఓ కిరాణా షాపు ఎదుట క్యూలో నిల్చొని ఉండగా, రష్యా సైన్యం కాల్పులు జరిపిందని ఉక్రెయిన్‌లో నవీన్‌ స్నేహితుడు శ్రీధరన్‌ గోపాలకృష్ణన్‌ చెప్పడం గమనార్హం. నవీన్‌ మరణవార్త వినగానే తండ్రి శేఖరప్ప బోరున విలపించారు. వైద్యుడై తిరిగి వస్తానని చెప్పాడని, అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని విలపించారు.


దేశంలో వైద్యవిద్య చాలా ఖరీదైనదిగా మారిందని, మెడికల్‌ సీటు కోసం కోట్ల రూపాయల లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, అంత ఇచ్చుకోలేకే ఉక్రెయిన్‌కు పంపామన్నారు. నవీన్‌ మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన ఇంటికి భారీగా జనం తరలివచ్చారు. ప్రధాని మోదీ శేఖరప్పకు ఫోన్‌ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. శేఖరప్పకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఫోన్‌ చేసి ఓదార్చారు.  


Updated Date - 2022-03-02T07:14:41+05:30 IST