నిద్రకు వెళ్లి తిరిగివస్తూ శాశ్వత నిద్రలోకి!

ABN , First Publish Date - 2022-05-09T08:09:34+05:30 IST

విషాదంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు, బంధువుల్లో అంతకుమించి ఘోర విషాదం నెలకొంది.

నిద్రకు వెళ్లి తిరిగివస్తూ  శాశ్వత నిద్రలోకి!

  • టాటా ఏస్‌ను ఢీకొన్న బియ్యం లారీ.. తొమ్మిది మంది దుర్మరణం
  • ఎనిమిది మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. మరో ఇద్దరు అత్తాకోడళ్లు
  • కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


కామారెడ్డి, మే 8 (ఆంధ్రజ్యోతి): విషాదంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు, బంధువుల్లో అంతకుమించి ఘోర విషాదం నెలకొంది. ఇంట్లో ఒకరు చనిపోతే నిద్ర చేసేందుకు ఆ  కుటుంబంలోని వారు, బంధువులు కలిసి టాటా ఏస్‌ వాహనంలో మరోచోటుకు వెళ్లి తిరిగివస్తుండగా ఘోరం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌ నుజ్జునుజ్జయి.. అందులో ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, మరో ఇద్దరు అత్తాకోడళ్లు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు, క్షతగాత్రులంతా బంధువులే. వ్యవసాయం, కూలిపనులు చేసుకొని బతికే నిరుపేదలే. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని.. టాటా ఏస్‌లో పరిమితికి మించి జనం ప్రయాణించడంతో మృతుల సంఖ్య పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి మాణిక్యం అనే వ్యక్తి నాలుగు రోజుల కిత్రం మృతి చెందాడు. ఆయన కుటుంబీకులు, బంధువులు మొత్తం 26మంది టాటా ఏస్‌లో శనివారం సాయంత్రం చిల్లర్గ నుంచి ఎల్లారెడ్డికి నిద్ర చేసేందుకు వెళ్లారు.


స్థానికంగా ఓ ఆలయంలో నిద్రించారు. ఆదివారం ఉదయం స్థానికంగా జరిగిన అంగడిలో కొన్ని సరుకులు కొనుగోలు చేసి మధ్యాహ్నం 3 గంటలకు టాటా ఏస్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా.. నిజాంసాగర్‌ నుంచి ఎల్లారెడ్డికి పీడీఎస్‌ బియ్యం లోడ్‌తో వస్తున్న లారీ.. టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్‌ సాయిలు (35), చౌదర్‌పల్లి లచ్చవ్వ (48) ఘటనాస్థలిలోనే మృతిచెందారు. క్షతగాత్రులను బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా చౌదర్‌పల్లి వీరమణి(38)  చౌదర్‌పల్లి సాయవ్వ (40), అంజవ్వ (40), పోచయ్య (46), గంగవ్వ (51) మృతిచెందారు. ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నవారిలో ఎల్లయ్య (46), ఈరమ్మ (58) మృతిచెందారు.


బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కార్తిక్‌, సాయిలు  పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో సాయవ్వ, అంజవ్వ అక్కాచెల్లెళ్లు. చౌదర్‌పల్లి లచ్చవ్వ, వీరమణి అత్తాకోడళ్లు  ఇటీవల మృతిచెందిన మాణిక్యం.. సాయవ్వ, అంజవ్వకు సోదరుడు. దీంతో నాలుగు రోజుల్లో ముగ్గురు తోబుట్టువులు మృతిచెందినట్లయింది. మృతదేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా  ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.   



Read more