పెద్దాసుపత్రికి వెళ్లండి

ABN , First Publish Date - 2022-06-23T04:28:44+05:30 IST

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రెఫరల్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

పెద్దాసుపత్రికి వెళ్లండి
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగం

- ఉమ్మడి జిల్లాల నుంచి జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ అవుతున్న కాన్పుల కేసులు

- నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల నుంచే అధికం

- ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 1,315 కేసులు రెఫర్‌

- మాతా, శిశు విభాగం డాక్టర్లు, సిబ్బందిపై పనిభారం 

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రెఫరల్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల నుంచి అధికంగా కేసులు రెఫర్‌ అవుతున్నాయి. సాధారణ కాన్పులు అయ్యే కేసులను సైతం ఇక్కడికి పంపిస్తుండటంతో డాక్టర్లు, సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఆయా జిల్లాల నుంచి 1,315 కేసులు రెఫర్‌ అయ్యాయి. 

- మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ కాన్పులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో సాధారణ, సిజేరియన్‌ కాన్పులు చేయా లని, అత్యవసరమైతేనే జిల్లా ఆస్పత్రులకు పంపించాలని ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. కానీ చాలా చోట్ల ఆయన ఆదేశాలు అమలు కావడం లేదు. సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్నా, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికే పంపిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వచ్చిన కేసులకు అక్కడ పనిచేసే సిబ్బంది కుంటి సాకులు చెప్పడంతో పాటు, ఏదైనా అయితే మాకేం సంబంధం లేదని భయాందోళనకు గురి చేస్తున్నారు. 


కేసులు రెఫర్‌ 

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మాతా శిశు విభాగానికి రెఫరల్‌ కాన్పు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల నుంచి 1,315 కేసులు రెఫర్‌ అయ్యాయి. ఇందులో అత్యధికంగా నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జడ్చర్ల నుంచి సైతం కాన్పు కేసులు రెఫర్‌ అవుతున్నాయి. ఆయా జిల్లాల్లో నార్మల్‌ డెలివరీ అయ్యే కేసులు సైతం జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు.


ఎక్కడి కేసులు అక్కడే చేయాలి

జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి ఉమ్మడి జిల్లాల నుంచి గర్భిణుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. కాన్పు కేసుల రెఫరల్స్‌ పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఓపీ కేసులు కూడా రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఓపీ కేసులు రోజూ 400 నుంచి 600 వరకు ఉండగా, కాన్పులు కూడా రోజుకు 30 నుంచి 50 వరకు చేస్తున్నారు. ఈ కేసులన్నీ ఉమ్మడి జిల్లాల నుంచి రావడంతో డాక్టర్లు, సిబ్బందిపై పనిభారం తీవ్రంగా పెరుగుతోంది. కొంతమంది డాక్టర్లు, నర్సులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆస్పత్రిలోనే రోగులుగా మారి, చికిత్స తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడి కేసులు అక్కడే చేస్తే బాగుంటుందని డాక్టర్లు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. 



Updated Date - 2022-06-23T04:28:44+05:30 IST