‘మొక్క’వోని లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T06:28:59+05:30 IST

జల సిరిని సంతరించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను హరితవనంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు మొదలవడంతోనే ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాలో హరితహారానికి ప్రణాళిక రూపొందించారు.

‘మొక్క’వోని లక్ష్యం
ముస్తాబాద్‌లోని నర్సరీ

 -  ఎనిమిదో విడత హరితహారానికి సన్నాహాలు 

- జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటేందుకు  ప్రణాలిక 

- శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు

- గ్రామీణాభివృద్ధి సంస్థకు అత్యధికం 

- ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్‌ 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జల సిరిని సంతరించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను హరితవనంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు మొదలవడంతోనే  ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాలో హరితహారానికి ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధంగా ఉంచారు. హరితహారంలో  భాగంగా ఇళ్లలో నాటేందుకు  పూలు, పండ్ల మొక్కలను అందించనున్నారు.  

శాఖల వారీగా లక్ష్యం 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని 2017లో ప్రారంభింనాటి నాటినుంచి జిల్లాలో అధికంగా మొక్కలు నాటుతూ అదర్శంగా నిలుస్తున్నారు. ఈ సారి కూడా అధికారులు వర్షాలు ప్రారంభమడంతోనే మొక్కలు నాటడానికి సన్నద్ధమయ్యారు  జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం యాక్షన్‌ ప్లాన్‌లో 39 శాఖల ద్వారా 33.72 లక్షల మొక్కలు నాటే విధంగా లక్ష్యాలను నిర్ణయించుకున్నారు. ఇందులో అత్యధికంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 25.52 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 1.50 లక్షలు, వేములవాడ మున్సిపాలిటీలో 1.50 లక్షలు, వ్యవసాయ శాఖలో లక్ష, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో లక్ష, విద్యాశాఖ ద్వారా 15 వేలు, అటవీ  శాఖ ద్వారా లక్ష, ఉద్యాన శాఖ ద్వారా 50 వేలు, ఆర్‌అండ్‌బీ ద్వారా 20 వేలు, ఆరోగ్య శాఖ ద్వారా 20 వేలు, డీడబ్ల్యూవో ద్వారా 10 వేలు, బీసీ, ఎస్సీ,  వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ ద్వారా పది వేల మొక్కల చొప్పున, జిల్లాలో నడుస్తున్న ప్రాజెక్ట్‌లు, ప్యాకేజీలకు సంబంధించిన ఈఈ ద్వారా 25 వేల మొక్కలు, మైనింగ్‌ ద్వారా, వేములవాడ దేవస్థానం ద్వారా 5 వేల మొక్కల చొప్పున మైనార్టీ వెల్ఫేర్‌ ద్వారా 2 వేలు, పౌరసరఫరాలు, పశుసంవర్థక శాఖ, పరిశ్రమలు, పోలీస్‌, దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖల ద్వారా 3 వేల మొక్కల చొప్పున, సెస్‌, మార్కెటింగ్‌, డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియెట్‌ బోర్డు, ఆర్‌డబ్ల్యూఎస్‌, జిల్లా సహకార శాఖ, పాలిటెక్నిక్‌, చేనేత జౌళిశాఖ, టెక్స్‌టైల్‌ పార్కుల ద్వారా 2 వేల మొక్కల చొప్పున సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల్లో 2 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


హరితహారంపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో మొక్కలు నాటడంపై అన్ని గ్రామాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్లకు ఇరువైపులా స్థలాలను గుర్తించారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, అటవీ ప్రాంతాలు, మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్‌ చేసి సంరంక్షించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఈజీఎస్‌ ద్వారా హరితహారంలో మొక్కలు నాటేందుకు గోతులు తీయనున్నారు. పకడ్బందీగా హరిత లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ భూమిలో 189, ప్రైవేటు భూమిలో 66 నర్సరీలు కొనసాగుతున్నాయి. నర్సరీల్లో 67లక్షల మొక్కలు సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం 75.28 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో నాటుతున్న మొక్కలు ఎక్కువ శాతం బతుకుతున్నాయి. గత హరితహారంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 26,78,762 మొక్కలు నాటారు. 25,10,908 మొక్కలు బతికి ఉన్నాయి. దాదాపు 96 శాతం మొక్కలు బతికి ఉండి రికార్డును సాధించారు. ఈ సారి కూడా గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా లక్ష్యం 33.72 లక్షలు కాగా గ్రామీణాభివృద్ధి శాఖ 25.52 లక్షలతో ముందుకు సాగుతోంది.


Updated Date - 2022-05-21T06:28:59+05:30 IST