గోలీ.. జేబు ఖాళీ!

Published: Sun, 27 Mar 2022 03:07:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గోలీ.. జేబు ఖాళీ!

  • 1 నుంచి పెరగనున్న ఔషధాల ధరలు..
  • 850 రకాల మందుల ధరలు పెంపు
  • జ్వరం, బీపీ, షుగర్‌ తదితర గోలీల రేట్లు 
  • 10.7 శాతం పెరుగుదల
  • జాబితాలో పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌
  • పేదలు, మధ్యతరగతిపై ఆర్థిక భారం
  • రాష్ట్రంలో 40 లక్షల మంది బీపీ, షుగర్‌ రోగులు
  • 15% మందికి వైద్యారోగ్య శాఖ మందులు
  • 85% మంది ప్రైవేటులోనే ఔషధాల కొనుగోలు
  • ఇప్పటికే ధరాభారంతో జనం విలవిల
  • మందుల ధరలూ పెరిగితే బతికేదెలా?


హైదరాబాద్‌, మార్చి 26 (ఆంఽధ్రజ్యోతి): వంటనూనెలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల మంటతో జనం సతమతమవుతున్నారు. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి సామాన్యులకు బీపీలు పెరిగిపోతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకపోతుండడంతో బతుకు బండిని ఎలా లాగాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ధరాభారంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆహారంతో పాటు ఔషధాలు కూడా జీవితంలో భాగమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. రక్తపోటు (బీపీ), షుగర్‌ (మధుమేహం) వంటి ‘నిత్యావసర’ గోలీలు సహా 850 రకాల మందుల ధరలూ పెరగనున్నాయి! పెట్రో మంటలు, గ్యాస్‌ ‘బండ’లు, వంటనూనెల సలసలతో వేగిపోతున్న ప్రజలకు.. ఇప్పుడు మందుగోలీలు కూడా పెనుభారం కానున్నాయి! ఏప్రిల్‌ 1 నుంచి ఔషధాల రేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగించే వాటితో పాటు మొత్తం 850 రకాల షెడ్యూల్‌ మందుల ధరలు పెరగబోతున్నాయి. 


1 నుంచి 10.7 శాతం పెంపు..

జ్వరం, బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్‌ మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020తో పోలిస్తే 2021 సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచీ 10.76 శాతం పెరిగినట్లు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) శుక్రవారం ప్రకటించింది. దీంతో పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌తో సహా పలు అత్యవసర మందుల ధరలు పెరిగిపోనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, రక్తపోటు (బీపీ), చర్మవ్యాధులు, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసెట్‌మాల్‌, అజిత్రోమైసిన్‌, ఫెనోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, సిప్రోఫ్లోక్సాసిన్‌ హైడ్రోక్లోరైడ్‌, మెట్రోనిడాజోల్‌ వంటి మందులు ఈ జాబితాలో ఉన్నాయి.


నాన్‌-షెడ్యూల్‌ ఔషధ ధరల వార్షిక పెరుగుదల (గరిష్ఠంగా 10శాతం)తో పోలిస్తే తొలిసారిగా షెడ్యూల్‌ డ్రగ్స్‌ ధరల పెంపు ఎక్కువగా ఉంది. టోకు ధరల సూచీలో మార్పుల కారణంగా కొన్నేళ్లుగా షెడ్యూల్‌ ఔషధాల ధరల పెరుగుదల 1-2శాతానికే పరిమితమైంది. 2019లో ఔషధ కంపెనీలకు 2శాతం పెంపును అనుమతించగా, 2020లో కేవలం 0.5 శాతమే పెంచారు. కొవిడ్‌ అనంతరం ముడిపదార్థాలు, ప్యాకింగ్‌, రవాణా తదితర ఖర్చులు పెరిగిపోవడంతో మందుల ధరలు పెంచాలని కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్‌పీపీఏ తాజా నిర్ణయంతో వాటికి కొంత ఊరట కలగనుండగా.. సామాన్యులకు పెనుభారం కానుంది.  


మధ్యతరగతిపై అదనపు భారం..

ప్రస్తుతం ప్రజల జీవితాల్లో మందులు కూడా భాగమయ్యాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఎక్కువ. బీపీ, షుగర్‌ రోగులకు ప్రతినెలా మందుల ఖర్చు సగటున రూ.1000-2500 వరకు ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంటే ఇంట్లో ఇద్దరు బీపీ, షుగర్‌ బాధితులు ఉంటే నెలకు సగటున నాలుగైదు వేల వరకు ఖర్చు వస్తుంది. పెరిగే మందుల ధరల వల్ల ప్రతినెలా అదనంగా ఐదారు వందలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారనుంది. ప్రజలపై మందుల భారం వేయడం తగదని వైద్యనిపుణులంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 30 ఏళ్లు పైబడిన వారిలో 24 శాతం మంది బీపీ రోగులున్నారు. 12 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నారు.


మొత్తం 40 లక్షల మంది వరకు బాధితులు ఉన్నారు. ఇందులో 15 శాతం మందికి వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రతినెలా బీపీ, షుగర్‌ మందులు ఇస్తున్నారు. మిగిలిన 85 శాతం మంది ప్రైవేటుగానే కొనుగోలు చేస్తున్నారు. వీరందరిపై ఔషధ భారం పడనుంది. ఇక ప్రస్తుతం దేశంలో 10500 ఫార్మాస్యూటికల్‌ కంపెనీలున్నాయి. ఒక్క తెలంగాణలోనే 550 కంపెనీలు ఉన్నాయి. బల్క్‌డ్రగ్స్‌ అంతా మనదగ్గరే ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు ఇండియానే అనేక దేశాలకు బల్క్‌డ్రగ్స్‌ ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తి అంతా మన దగ్గరే జరుగుతున్నప్పుడు ఔషధ ధరలు పెంచాల్సిన అవసరం లేదని.. ఫార్మా కంపెనీలకు మరింత లబ్ధి చేకూర్చేందుకే పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


  జనరిక్‌ మందులను ప్రోత్సహించాలి 

రోగాలు పెరిగాయి. మందుల వాడకం కూడా పెరిగింది. ప్రాథమికంగా అందరికీ అవసరమైన మందులు, యాంటీబయాటిక్‌ ఔషఽధాల ధరలు పెంచడం సరికాదు. దీనిపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలి. జనరిక్‌ మెడిసిన్‌ను ప్రోత్సహించాలి. దీంతో ప్రజలపై భారం తగ్గుతుంది. వైద్యులు కూడా జనరిక్‌ మందులనే రాయాలి. కేవలం ఫార్మా కంపెనీలకు లాభం కోసమే ఔషధాల ధరలు పెంచుతున్నారు. దీనివల్ల ప్రతి కుటుంబంపై సగటున నెలకు రూ.1000 నుంచి 2000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై మరింత భారం పడనుంది. 

- డాక్టర్‌ సంజయ్‌రెడ్డి, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యుడు


గోలీ.. జేబు ఖాళీ!

బీజేపీ మందుల ధరలనూ పెంచింది: కవిత

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరకు మందుల ధరలనూ పెంచిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అత్యవసర మందుల ధరలను పెంచిందని ఆమె ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.