వంటలు

ఇకపై మేక పాలతో చీజ్‌

ఇకపై మేక పాలతో చీజ్‌

చీజ్‌, బటర్‌, యోగర్ట్‌... ఈ పాల ఉత్పత్తులన్నీ ఇప్పటి వరకు కేవలం ఆవు పాలు, గేదె పాలతో చేసినవే అమ్మేవి మన డెయిరీ సంస్థలు. త్వరలో మేక పాలతో కూడా వీటిని తయారుచేసి పంపిణీ చేయబోతున్నాయి.. 


మనదేశంలో మేక పాల వాడకం చాలా తక్కువ. ఆవు, గేదెపాలను వాడినంత విరివిగా మేక పాలు వినియోగించరు. కానీ కెనడా, అమెరికా, సింగపూర్‌, బ్రిటన్‌... లాంటి చాలా దేశాల్లో మేక పాల వాడకం ఎక్కువ. వాటితో చేసిన అనేక ఉత్పత్తులను అధికంగా వాడతారు. ఆవు పాలకన్నా మేక పాలలో పోషకాలు ఎక్కువని చెబుతారు పోషకాహార నిపుణులు. అందుకే గాంధీ  మేకపాలు  ఎక్కువగా తాగేవారు. వీటి వాడకం తక్కువ కావడంతో మన దేశంలో లీటరు పాల ధర రూ. 35 మాత్రమే. త్వరలో వీటికి గ్లోబల్‌ మార్కెట్‌ కల్పించాలని భావిస్తున్నాయి ప్రముఖ డెయిరీ సంస్థలు. దీనివల్ల మేకల పెంపకందారులకు కూడా లాభం కలుగుతుందనేది వారి ఆలోచన. ఇందుకు ప్రభుత్వాలు కూడా 

సానుకూలంగా స్పందిస్తున్నాయి. 


ఆవు పాలతో చీజ్‌, బటర్‌, యోగర్ట్‌, లస్సీ... ఇలా ఎన్నో ఉత్పత్తులు తయారవుతాయి. ఇలాగే మేక పాలతో కూడా చేయవచ్చు. ఇప్పటికే రాజ్‌ కోట్‌కు చెందిన ఓ డెయిరీ సంస్థ మేకపాలతో ‘శ్రీ ఖండ్‌’ అనే స్వీటును, లస్సీని తయారుచేసి అమ్మడం ప్రారంభించింది. ఇక అమూల్‌ సంస్థ కూడా చీజ్‌, పేడా (కోవా) తయారుచేసి అమ్మేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొదట గుజరాత్‌ నుంచే ఈ మేక పాల ఉత్పత్తుల తయారీ భారీగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడెరేషన్‌ మేకల పెంపకందారులతో మాట్లాడి పాల ఉత్పత్తిని పెంచమని సూచించింది. ముందుగా సేలా, చోటిలా, ధ్రన్‌ గద్రా తాలూకాల్లోని మేకల పెంపకందారులతో అనుసంధానమయ్యారు. 


‘సుర్‌ సాగర్‌ డెయిరీ’ పేరుతో పైలెట్‌ ప్రాజెక్టు మొదలైంది. ఈ ప్రాజెక్టు కింద 8000 మంది మేకల పెంపకం దారులు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన ఆద్విక్‌ ఫుడ్స్‌, దిల్లీకి చెందిన కంట్రీయార్డ్‌ ఫామ్‌, న్యూట్రా గోట్‌, ఫామ్‌ ఫ్రెష్‌ ఇవన్నీ మేక పాల ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించాయి. ఫ్రొజెన్‌ మేక పాలు లీటరు రూ.400 లకు అమ్ముతుండగా, గొర్రె పాల పొడిని కిలో రూ.1200లకు, ఒక్కో సబ్బును రూ.150కు అమ్ముతున్నారు. త్వరలో వీటి జాబితా పెరగనుంది. ఆవు, గేదె పాలతో పోలిస్తే మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి. కొందరిలో ఆవు పాల వల్ల అలర్జిక్‌ లక్షణాలు కనిపిస్తాయి. కానీ మేకపాలు పడకపోవడం అనేది ఉండదు. చర్మసౌందర్యానికి మేలు చేస్తుంది. ప్రొటీన్‌ను పుష్కలంగా కలిగి ఉంటుంది. మిగతా పాలతో పోలిస్తే ఇందులో ఉండే కొవ్వు శాతం చాలా తక్కువ.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.