సిద్ధాపురం చెరువుకు గండ్లు

ABN , First Publish Date - 2021-12-05T06:26:02+05:30 IST

జిల్లాలో పెద్దదైన సిద్ధాపురం చెరువుకు శనివారం మధ్యాహ్నం గండ్లు పడ్డాయి.

సిద్ధాపురం చెరువుకు గండ్లు

  1. పూడ్చేందుకు రైతులు, లస్కర్ల ముమ్మర యత్నాలు


ఆత్మకూరు, డిసెంబరు 4: జిల్లాలో పెద్దదైన సిద్ధాపురం చెరువుకు శనివారం మధ్యాహ్నం గండ్లు పడ్డాయి. కేజీ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దతూము పక్కన మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ నీరు సమీప పంటపొలాల్లోకి చేరకుండా రైతులు తూము కాలువలోకి మళ్లించారు. శనివారం సాయంత్రమే గండ్లు పూడ్చేందుకు మట్టిని తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒక ట్రాక్టర్‌ ఇరుక్కు పోయింది. దీంతో గండి పూడ్చేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గండ్ల నుంచి నీరు బయటకు వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గండ్లు ఉధృతమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గండ్లను పూడ్చేందుకు లస్కర్లు, రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం గండ్లను గుర్తించిన వెంటనే ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం చెరువులో 19 అడుగుల నీరు ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు తెలుగుగంగ ఏఈ శివనాయక్‌ వచ్చారు. మధ్యాహ్నం వచ్చి చూశామని, అంత తీవ్రత ఉండదనుకున్నామని ఆయన తెలిపారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ హరిప్రసాద్‌ కూడా చెరువు కట్ట వద్దకు వచ్చారు. 


చెరువు కట్ట వద్దకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా


చెరువు కట్టకు గండ్లు పడ్డాయన్న విషయం తెలియగానే శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రస్తుతం గండి పడిందన్నారు. చెరువు కట్ట మీద కంపచెట్లు పెరిగాయని, దీన్ని పట్టించుకోక పోవడం వల్లే గండ్లు పడ్డాయని అన్నారు. ఇక్కడే ఉండి గండి పూడ్చివేత పనుల్లో పాలుపంచుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-12-05T06:26:02+05:30 IST