గోవాడ షుగర్స్‌లో ఆర్థిక సంక్షోభం

ABN , First Publish Date - 2022-09-29T06:27:21+05:30 IST

చెరకు బకాయిల చెల్లింపు.. గుదిబండలా మారిన అప్పులు.. మాటలకే పరిమితమైన ప్రభుత్వ సహకారం.. పౌరసరఫరాల శాఖ పంచదార బకాయిలు.. పట్టాలెక్కని ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణం.. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మహాజన సభలో ఈ అంశాలను ప్రస్తావించడానికి సభ్య రైతులు సిద్ధంగా వున్నారు.

గోవాడ షుగర్స్‌లో ఆర్థిక సంక్షోభం
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ

చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు అగచాట్లు

గత సీజన్‌లో రైతులకు అందాల్సింది రూ.80.44 కోట్లు 

ఇంతవరకు అందింది రూ.41 కోట్లు మాత్రమే!

మరో రెండు నెలల్లో క్రషింగ్‌ సీజన్‌ ఆరంభం

పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న రైతులు

ఏటేటా తగ్గిపోతున్న చెరకు సాగు

ఈ ఏడాది 15 వేల ఎకరాల్లోనే పంట

క్రషింగ్‌ లక్ష్యంపై ప్రతికూల ప్రభావం

ఫ్యాక్టరీకి గుదిబండలా మారిన అప్పులు

మాటల్లోనే ప్రభుత్వ సహకారం

కార్యరూపం దాల్చని ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణం

రేపు గోవాడ షుగర్స్‌ మహాజన సభ


చోడవరం, సెప్టెంబరు 28:

చెరకు బకాయిల చెల్లింపు.. గుదిబండలా మారిన అప్పులు.. మాటలకే పరిమితమైన ప్రభుత్వ సహకారం.. పౌరసరఫరాల శాఖ పంచదార బకాయిలు.. పట్టాలెక్కని ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణం.. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మహాజన సభలో ఈ అంశాలను ప్రస్తావించడానికి సభ్య రైతులు సిద్ధంగా వున్నారు. కొవిడ్‌-19 కారణంగా 2020, 2021లో మహాజన సభలను నిర్వహించలేదు. కరోనా వైరస్‌ ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో ఈ ఏడాది మహాజన సభను 30వ తేదీ శుక్రవారం నిర్వహించడానికి ఫ్యాక్టరీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి, రైతులకు చెరకు బకాయిలు, అప్పుల భారం తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఒకప్పుడు సహకార రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వుండేది. చెరకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేవి. కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు అందేవి. కానీ ఆరేడేళ్ల నుంచి పంచదార మార్కెట్‌లో అస్థిరత, ఉత్పత్తి వ్యయం కన్నా పంచదార ధర తక్కువగా వుండడంతో ఫ్యాక్టరీకి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. చెరకు రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలేదు. కార్మికులకు వేతనాల చెల్లింపు కూడా ఇదే తీరుగా వుంది. బకాయిల చెల్లింపు కోసం పంచదారను ఆప్కాబ్‌కు తనఖా పెట్టి రుణం తీసుకోవడం ఆనవాయితీ మారింది. మరోవైపు పంచదార అమ్మకాలపై కేంద్రం విధించి సీలింగ్‌ కూడా ఫ్యాక్టరీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి చెరకు రైతులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మరో రెండు నెలల్లో కొత్త క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుండగా, గత క్రషింగ్‌ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంకా సగం డబ్బులు చెల్లించాల్సి వుంది. మొత్తం 2 లక్షల 92 వేల టన్నుల చెరకు క్రషింగ్‌ చేయగా, టన్నుకు రూ.2,755 చొప్పున రూ.80.44 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ ఇటీవల వరకు లక్షా 66 వేల టన్నులకు రూ.2,500 చొప్పున రూ.41 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.40 కోట్ల వరకు రైతులకు అందాల్సి వుంది. శుక్రవారం మహాజన సభ జరగనుండడంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందన్న ఉద్దేశంతో ఈ నెల 27వ తేదీ నుంచి చెల్లింపులు ప్రారంభించారు. అది కూడా రూ.20 కోట్ల వరకేనని ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్నారు. 

తగ్గిపోయిన చెరకు సాగు

దశాబ్దం క్రితం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో చెరకు సాగు అయ్యేది. ప్రతి సీజన్‌లో నాలుగు నుంచి ఐదు లక్షల టన్నుల వరకు చెరకు క్రషింగ్‌ జరిగేది. అయితే ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతుండడం, చెరకు మద్దతు ధరను ఆ స్థాయిలో పెంచకపోవడం, చెరకు డబ్బులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు క్రమేపీ చెరకు సాగుకు స్వస్తి పలుకుతున్నారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 15 వేల ఎకరాల్లో మాత్రమే చెరకు సాగు అవుతున్నది.   ఫలితంగా ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్‌ సగానికి తగ్గిపోయింది.  

గుదిబండలా మారిన అప్పులు

తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ అప్పులు ఒక దశలో రూ.140 కోట్లకు పెరిగాయి. ఇటీవల కాలంలో కొంత తీర్చినప్పటికీ ఇంకా రూ.60 కోట్ల వరకు రుణబకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ గోదాముల్లో 80 వేల క్వింటాళ్ల పంచదార నిల్వ వుంది. మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.25 కోట్లు వుంటుందని అంచనా. ఇక పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన పంచదారకు సంబంధించి సుమారు రూ.25 కోట్లు రావాల్సి వుంది. దీనిలో సుమారు రూ.10 కోట్ల మేర వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. చెరకు రైతులకు రూ.40 కోట్లు చెల్లించాలి. ఇందుకోసం ఆప్కాబ్‌ నుంచి రుణం తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఫ్యాక్టరీ అపులు రూ.50 కోట్ల వరకు వుంటాయి.  

మాటల్లోనే ప్రభుత్వ సహకారం

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ అభివృద్ధికి చర్యలు చేపడతాం, అదనపు ఆదాయం కోసం ఇథనాల్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ సంఘం అమరావతిలో సమావేశాలకే పరిమితమైంది తప్ప ఒక్కసారి కూడా షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించలేదు. ఇథనాల్‌ ప్రాజెక్టుకు గతంలో మంజూరు చేసిన రూ.19 కోట్లు కూడా కాగితాలకే పరిమితం అయ్యాయి. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పాలకులు చెబుతున్న మాటలను చెరకు రైతులు విశ్వసించే పరిస్థితిలో లేరు. తాము అధికారంలోకి వస్తే సహకార చక్కెర ఫ్యాక్టరీలకు పూర్వవైభవం తెస్తామని జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కానీ ఆయన సీఎం అయిన తరువాత జిల్లాలోని ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు మూతపడిన విషయాన్ని ఈ సందర్భంగా చెరకు రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కూడా మూసివేత జాబితాలో చేరుస్తారా? లేకపోతే సహకారం అందించి గాడిలో పెడతారా? అన్నది మహాజన సభలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలతో స్పష్టమవుతుంది.


Updated Date - 2022-09-29T06:27:21+05:30 IST