దేవుడి భూమికి టెండర్‌!

ABN , First Publish Date - 2021-06-23T07:42:37+05:30 IST

దేవుని భూములకు రక్షణ కరువైంది. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు.

దేవుడి భూమికి టెండర్‌!
దేవాలయ భూమిలో ఏర్పాటు చేసిన సిమెంట్‌ రోడ్డు

కౌలు పేరుతో రూ.30 కోట్ల విలువైన భూమిలో పాగా 

సొంతం చేసుకునేందుకు ఓ రియల్టర్‌ ప్రయత్నం 

సిమెంట్‌ రోడ్డు కూడా నిర్మాణం 

చోద్యం చూస్తున్న దేవదాయశాఖ అధికారులు

పొదిలి, జూన్‌ 22 : దేవుని భూములకు రక్షణ కరువైంది. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. పొదిలి పట్టణంలో వేంకటేశ్వరస్వామి దేవాలయ సమీపంలో ఉన్న పృదులగిరి లక్ష్మీనరసింహస్వామికి చెందిన కోట్లాది రూపాయల విలువచేసే భూమిపై ఓ రియల్‌ వ్యాపారి కన్నేశాడు. 831 సర్వే నెంబర్లోని 7.41 ఎకరాల్లో కొంత ఆక్రమించి ఏకంగా సిమెంట్‌ రోడ్డు నిర్మించాడు. దేవాలయ ఈవో కార్యాలయానికి కూతవేటు దూరంలో  రూ.30 కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురవుతున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


రియల్టర్‌  ఆధీనంలో భూమి 

గత దశాబ్దకాలంగా ఓ వ్యాపారి దేవునిభూమిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆరు సంవత్సరాలుగా ఎలాంటి పంటలు సాగు చేయకుండా నామమాత్రపు కౌలు చెల్లిస్తూ వస్తున్నాడు. పక్కనే ఉన్న తన సొంత రియల్‌ భూములకు వెళ్లేందుకు ఏకంగా దేవాలయభూమిలో పక్కా సిమెంట్‌ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నివాస గృహాలు కూడా నిర్మించారు. ఇటీవల దేవాలయభూమిని కౌలు వేలం నిర్వహించేందుకు అధికారులు బహిరంగ వేలం ప్రక్రియను చేపట్టారు. తిరిగి అదే వ్యక్తి తన అనుయాయులతో పాట దక్కించుకునేందుకు ధరావత్తు కూడా చెల్లించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. 


పాలకవర్గం అభ్యంతరం 

ఎకరా రూ.4 కోట్లు విలువచేసే  7ఎకరాల 41సెంట్లలో ఉన్న విలువైన భూమిని పరిరక్షించాలని దేవాలయ పాలకవర్గ చైర్మన్‌, సభ్యులు సదరు భూమికి వేలంపాట నిర్వహించేందుకు వీలులేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్‌ 831లో 7ఎకరాల41సెంట్ల భూమికి సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసిన తరువాతే వేలం నిర్వహించాలని వారు పట్టుబట్టారు. అదేరోజు సాయంత్రం దేవాలయభూమిని అధికారులు, పాలకవర్గ సభ్యులు పరిశీలించి కోట్లరూపాయల విలువైన భూమి కొంత ఆక్రమణకు గురైందని గుర్తించారు. రెవెన్యూ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి పొలం చుట్టూ కంచె వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంత జరిగినా దేవదాయశాఖ ఈవో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. .సత్వరమే సర్వే నిర్వహించేందుకు దేవస్థాన ఈవో చర్యలు తీసుకోకుంటే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు పాలకవర్గం సమాయత్తమవుతోంది.  


Updated Date - 2021-06-23T07:42:37+05:30 IST