దేవుడా, తెలుగు నేలకు ఆ తెగులు వద్దు!

ABN , First Publish Date - 2022-04-07T07:06:32+05:30 IST

యాదృచ్ఛికమో, సహజమో తెలియదు కానీ, స్వతంత్ర భారతదేశంలో మతతత్వ రాజకీయాల ఉధృతీ, ప్రపంచీకరణలో భాగమైన ఆర్థిక సంస్కరణల ప్రారంభమూ మూడుదశాబ్దాల కిందట ఒకేసారి జరిగాయి...

దేవుడా, తెలుగు నేలకు ఆ తెగులు వద్దు!

యాదృచ్ఛికమో, సహజమో తెలియదు కానీ, స్వతంత్ర భారతదేశంలో మతతత్వ రాజకీయాల ఉధృతీ, ప్రపంచీకరణలో భాగమైన ఆర్థిక సంస్కరణల ప్రారంభమూ మూడుదశాబ్దాల కిందట ఒకేసారి జరిగాయి. సంస్కరణలు దేశవనరుల భవితవ్యాన్ని, ప్రజల జీవనోపాధులను దెబ్బతీస్తాయేమోనని ప్రజలు సహజంగానే కలవరపడ్డారు. అదే సమయంలో, అట్టహాసపు ప్రపంచీకరణ, మతతత్వాన్ని నిరుత్సాహపరుస్తుందని, దేశంలో ఆధునిక జీవనసరళి ప్రబలి మూర్ఖపు శక్తులు బలహీనపడతాయని ఒక ఆశా కలిగింది. కానీ, ఉదారవాద విధానాలు అన్న పేరు తగిలించుకుని వచ్చిన పరిణామాలు, దేశంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మరింత పరిమితం చేయడంతో పాటు, ఛాందసాన్ని, పరద్వేషాన్ని, మూఢత్వాన్ని పెంచిపోషించసాగాయి. మతతత్వం, అభివృద్ధి చూడచక్కని జంటగా మారిపోయాయి. గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా ఈ రసాయనిక మిశ్రమం అద్భుత ఫలితాలను సాధిస్తూ వస్తోంది.


కర్ణాటకలో తీవ్రమవుతున్న విభజన వాతావరణం చూసి పద్మభూషణ్ గ్రహీత, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా ఆందోళన చెందారు. వర్తక వ్యాపారాల నుంచి ఒక మతం వారిని నిషేధించడం సమాచార సాంకేతికతలో సిలికాన్ వ్యాలీ అంతటి పేరు తెచ్చుకున్న బెంగళూరుకు మంచిది కాదని ఆమె హితవు చెప్పారు. ఆధునికంగా, హేతుబద్ధంగా ఆలోచించేవారు, సమాజం సమ్మిశ్రితంగా ఉండాలనుకునేవారు కార్పొరేట్లలో కూడా ఉంటారు. రాహుల్ బజాజ్, అజీమ్ ప్రేమ్‌జీ, శివనాడార్ వంటి వాణిజ్యవేత్తలు కొంత భిన్నంగా కనిపిస్తారు. కానీ, దేశంలోని అన్ని రంగాలలోనూ వ్యాపించి ఉన్న భయం కారణంగా, గొంతులు పెగలడం లేదు. కిరణ్ షా అట్లా మాట్లాడేసరికి, ఒక్క కుదుపు వచ్చినట్టయింది. ఆమెను కాంగ్రెస్ మనిషి అని ఆరోపించి, వివాదానికి ముగింపు పలికామని బిజెపి సంతోషించింది కానీ, అది అట్లా ముగిసిపోకపోవచ్చు. ఆర్థికరంగం నుంచి అసమ్మతులు క్రమంగా పెరిగిపోవచ్చు. ఒకరిని చూసి మరొకరికి ధైర్యం కలగవచ్చు.


అధికార బలం, వీధి బలం కలిస్తే ఇక దానికి తిరుగుండదని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అటువంటి వాతావరణం కర్ణాటకలో ఏర్పడింది. కొన్ని విద్వేషబృందాలు సమాజంలో అలజడి సృష్టిస్తాయి. ఆ అలజడిని ప్రభుత్వం సమర్థించడమో, ఖండించకుండా మౌనం వహించడమో చేస్తుంది. ప్రభుత్వం తనంతట తను కూడా కొన్ని విభజన వాద చట్టాలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంది. ఈ చర్యలు, చట్టాలు ఆ రాష్ట్రానికి పరిమితమైనవిగా కనిపిస్తాయి. అట్లాగే, కొన్ని హింసాత్మక సంఘటనలు స్థానికమైనవి. కాకపోతే, వాటి ప్రభావం దేశమంతటా ఉంటుంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం వెనుక ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో లబ్ధిపొందే ఆలోచన ఉన్నదన్న విమర్శలు విన్నాము. కాదు, తమ వ్యతిరేకులకే ఆ ఆలోచన ఉన్నదని బిజెపి నాయకురాలు ఉమాభారతి అన్నారు. ఇప్పుడు హలాల్, అజాన్ అంశాలు వచ్చే ఏడాది జరగవలసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదంగా మారాయన్నది కనిపిస్తూనే ఉన్నది. హిందూ దేవాలయాల బయట ముస్లిమ్ వ్యాపారులను అనుమతించకూడదని ఒక వివాదం. తీరప్రాంత కర్ణాటకలో అయితే, ముస్లిమ్ వ్యాపారులపై బహిష్కరణ కొనసాగుతున్నది. మైనారిటీల జీవనోపాధుల మీద ప్రభావం వేసే నిర్ణయాలు కొంత కాలంగా జరుగుతున్నాయి. గోవుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన చట్టం, మొత్తంగా అన్ని రకాల మాంసం వ్యాపారాన్ని దెబ్బతీసి లక్షలాది మంది ఉపాధిని ప్రభావితం చేసింది. ఇటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కిరణ్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. ఆసియాలోనే పేరుపొందిన ఫార్మా సంస్థ అధిపతి అయి ఉండీ, ఆమె చిరు వ్యాపారుల, ఉపాధుల వారి మనుగడ సమస్యను ప్రస్తావించడం విశేషమే.


మజుందార్ షాకు బిజెపి ఐటి విభాగం సారథి అమిత్ మాలవీయ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉన్నది. ‘‘కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న వాతావరణం కారణంగా వాణిజ్య వాతావరణం దెబ్బతింటుందని అంటున్నారు. ఒకప్పుడు రాహుల్ బజాజ్ గుజరాత్ గురించి కూడా ఇట్లాగే వ్యాఖ్యానించారు. ఇప్పుడు వెళ్లి చూడండి, ఆటోమొబైల్ రంగంలో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది’’. నాటి గుజరాత్, నేటి కర్ణాటక తరహా వాతావరణమే వ్యాపారరంగానికి చోదకంగా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారా? లేక, సామాజిక ఉద్రిక్తతలకు ఆర్థికాభివృద్ధికీ సంబంధం లేదంటున్నారా? అదే నిజమైతే, కార్మికులు, రైతులు చేసే ఆందోళనల వల్ల, ప్రజా ఉద్యమాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఇంతకాలం చెబుతున్న మాటలన్నీ వట్టివేనా? చేస్తున్న నిర్బంధాలన్నీ అకారణమేనా?


కిరణ్ షా చెప్పిన కారణం కాదు కానీ, రవీశ్ నరేశ్ అనే ఐటి రంగ యువ పారిశ్రామికుడు, బెంగళూరులో స్టార్టప్‌లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్నిస్తున్నాయి కానీ, సరైన మౌలిక సదుపాయాలు లేవని, గ్రామీణ ప్రాంతంలోని రోడ్ల కన్న అధ్వాన్నమయిన రహదారులు, కరెంటు కోతలు బాధిస్తున్నాయని ట్వీట్ చేశారు. దానికి తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కె.టి.ఆర్ ఉత్సాహంగా స్పందించారు. పెట్టేబేడా సర్దుకుని హైదరాబాద్ రమ్మని, తమ దగ్గర పారిశ్రామికంగాను, సామాజికంగానూ మంచి మౌలిక సదుపాయాలున్నాయని ఆహ్వానించారు. ఐటి అభివృద్ధికి తమ దగ్గర ఉన్న తారకమంత్రాలు, నూతన ఆవిష్కరణలు, మంచి సదుపాయాలు, సమ్మిశ్రిత ఎదుగుదల అని చెప్పారు. ఈ సమ్మిశ్రితత్వం బిజెపి విధానాలపై విమర్శ అని చెప్పనక్కరలేదు. దానికి కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు శివకుమార్, వచ్చే ఏడాది తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని, అప్పుడు తమతో పోటీపడమని సవాల్ విసిరారు. అభివృద్ధిలో పోటీపడదామని, హిజాబ్, హలాల్ వంటి విషయాలలో కాదని కెటిఆర్ అన్నారు. తరువాత, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ట్వీట్ల సంవాదంలోకి దిగారు కానీ, ఆయన ప్రత్యేకంగా చెప్పిందేమీ లేదు. కిరణ్ షా చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా, కర్ణాటకపై పొరుగు రాష్ట్రం ప్రముఖుడి నుంచి ప్రస్ఫుటమైన విమర్శ రావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీ కేంద్రంతో ఎంత మేరకు పోరాడగలదన్న సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ, ఒక స్పష్టమైన విధానపరమైన విమర్శ చేయడం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం. హైదరాబాద్‌లో సాపేక్షంగా నెలకొని ఉన్న సామరస్య వాతావరణాన్ని ఆర్థికాభివృద్ధికి సానుకూలతగా ఉపయోగించుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. అప్పుడు ఆ సానుకూలత ఆవశ్యకతే, సామరస్యాన్ని గ్యారంటీ చేస్తుంది.


కెసిఆర్ మీద ఎన్ని విమర్శలైనా చేయవచ్చును కానీ, తమ రాజకీయ అవసరాలకోసమైనా సరే, సమ్మిశ్రిత సామాజిక వాతావరణాన్ని కొనసాగించడం మీద పట్టింపుతో ఉన్నారు. ఒక దశలో, ఎవరి పరిధులలో వారు ఉండగలిగితే, తనకు అవసరమైన ప్రతిపత్తి తనకు మిగిల్చితే, భారతీయ జనతాపార్టీతో స్నేహం చేసి కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం పొందాలని కెసిఆర్ ఆశించారని అప్పట్లో అనుకున్నారు. అటువంటి పొందిక సాధ్యం కాదని అర్థమైంది కాబోలు, ఈ మధ్య కాలంలో నిలకడైన వ్యతిరేకతను ప్రకటిస్తున్నారు. అయితే, కెసిఆర్‌ది ఆధునిక లౌకికవాదం కాదు. సాంప్రదాయ సామరస్య వాదం. అయోధ్యకు పోటీగా యాదాద్రి కట్టి, పండుగలు పూజలు యజ్ఞాలు చేసి తెలంగాణలోని మెజారిటీ మతస్థులకు వేరే మతవాద ఆకర్షణలు లేకుండా జాగ్రత్త పడతారు. కానీ, ఆ చాకచక్యాలు ఎక్కువ కాలం పనిచేయవు. తెలంగాణలో కూడా చాపకింద నీరులా పరమతద్వేషాలు, అసహనాలు, విభజనను తీవ్రం చేసే వివాదాలు పెరుగుతున్నాయి. ఆదమరిస్తే, చాపకింద నీరు కుర్చీలకిందికి వస్తుంది. ఆర్థిక వృద్ధి కోసం సహజీవన వాతావరణాన్ని కూడా ఒక షరతుగా భావిస్తున్న కెటిఆర్ కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలి.


భారతీయ జనతాపార్టీకి దక్షిణాది కొరకరాని కొయ్య అనుకుంటే, అందులో కర్ణాటక కొంత మినహాయింపు. ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ఆ రాష్ట్రంలో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. అధికారంలోకి వచ్చిన రెండుసార్లూ ఇతర పార్టీలలో చీలికల వల్లా, ఫిరాయింపుల వల్లా మాత్రమే రాగలిగింది. అందుకే, 2023లో సొంతంగా రావాలన్న ప్రయత్నం చేస్తున్నది, అందులో భాగంగానే కర్ణాటక పరిణామాలు. కర్ణాటకలోని ఉక్కపోతను భరించలేక, అక్కడి పరిశ్రమలు తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్‌కో తరలివస్తే సరే. కానీ, కర్ణాటకలోని నేటి భావ, సామాజిక వాతావరణమే తెలుగు రాష్ట్రాలకు సోకితే? అంత భయంలో, అంతటి ద్వేషంతో బతకగలమా? తలచుకుంటేనే భయం పుడుతుంది. బసవణ్ణ పుట్టిన నేల, సాహిత్య, నాటక సంస్కారాలు వెల్లివిరిసిన నేల కదా కర్ణాటక!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-04-07T07:06:32+05:30 IST