అదిరే గోదావరి రుచులు

ABN , First Publish Date - 2020-10-10T05:51:36+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఒకో ప్రాంతానిది ఒక్కో రుచి. భౌగోళిక పరిస్థితులు.. సంస్కృతి.. పండే పంటలు.. ఈ మూడింటి ఆధారంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం వంటలు

అదిరే గోదావరి రుచులు

తెలుగు రాష్ట్రాల్లో ఒకో ప్రాంతానిది ఒక్కో రుచి. భౌగోళిక పరిస్థితులు.. సంస్కృతి..

 పండే పంటలు.. ఈ మూడింటి ఆధారంగా ఒక్కో  ప్రాంతంలో ఒక్కో రకం వంటలు 

వండుతూ ఉంటారు. వంటల విషయంలో రాయలసీమది ఒక పద్ధతైతే.. 

కోస్తా ప్రాంతానికి మరొక పద్ధతి. తెలంగాణ విషయంలో మరొక పద్ధతి. 

ఆ వంటలను పరిచయం చేసే క్రమంలో- పాడి పంటలకు పేరుగాంచిన 

పశ్చిమగోదావరి జిల్లాలో వండే కొన్ని రుచులను మీకు ఈ వారం అందిస్తున్నాం. 


తోటకూర కాడల కూర

కావలసినవి

తోటకూర కాడలు - పావుకేజీ, బెల్లం - 100గ్రాములు, కారం - ఒక స్పూన్‌, జీలకర్రపొడి - పావు స్పూన్‌, ఉప్పు - ఒక స్పూన్‌, పసుపు - కొద్దిగా, చింతపండు - నిమ్మకాయంత, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - రెండు స్పూన్‌లు, ఇంగువ - కొద్దిగా, ఎండుమిర్చి - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, సెనగపప్పు - పావు టీ స్పూన్‌, మినప్పప్పు - పావు టీ స్పూన్‌, ఆవాలు - కొద్దిగా, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు. 


తయారీ విధానం

తోటకూర కాడలు ముక్కలుగా తరిగి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.

చింతపండు నానబెట్టుకోవాలి. బెల్లం పొడి పొడిగా చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.

తరువాత ఇంగువ, పచ్చిమిర్చి వేయాలి. కరివేపాకు వేసుకుని కలపాలి.

ఇప్పుడు తోటకూర కాడలు, చింతపండు నీళ్లు, బెల్లం, ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించాలి.

ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత జీలకర్ర పొడి వేసుకోవాలి.

మరికాసేపు ఉడికించుకొని స్టవ్‌ పై నుంచి దింపాలి. అంతే.. ఘుమఘుమలాడే తోటకూర కాడల కూర రెడీ.



తోటకూర 100 గ్రాములలో..

క్యాలరీలు  23

ప్రొటీన్‌  2.46 గ్రా

ఫ్యాట్‌ 0.33 గ్రా

కార్బోహైడ్రేట్లు 4.02 గ్రా

సోడియం  20 ఎంజి


అరటి దూట పెరుగు పచ్చడి

కావలసినవి

అరటి దూట - పావు కేజీ, పెరుగు - పావు కేజీ, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, సెనగపప్పు - ఒక స్పూన్‌, మినప్పప్పు - ఒక స్పూన్‌, ఆవాలు - కొద్దిగా, జీలకర్ర - పావు టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - రెండు స్పూన్‌లు. 


తయారీ విధానం

అరటి దూట పీచు తీస్తూ చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. 

ముక్కలు ఉడికిన తరువాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.

సెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి. 

తరువాత పెరుగు వేయాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి.

చివరగా ఉడికించి పెట్టుకున్న అరటి దూట ముక్కలు వేసి కలపాలి.

ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది.


అరటి దూట

క్యాలరీలు  13

కార్బోహైడ్రేట్లు  2 గ్రా

డైటరీ ఫైబర్‌  1 గ్రా


కంద గారెలు

కావలసినవి

తియ్య కంద - పావు కేజీ, కందిపప్పు - ఒకటిన్నర కప్పు, బియ్యం - గుప్పెడు, జీలకర్ర - రెండు స్పూన్‌లు, పచ్చిమిర్చి - మూడు, నూనె - పావు కేజీ, ఉప్పు - తగినంత,


తయారీ విధానం

కందిపప్పు, బియ్యం నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. 

కంద పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేయాలి. తరువాత కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్‌ చేసుకోవాలి.

పచ్చిమిర్చి, జీలకర్ర, నానబెట్టిన కందిపప్పు, బియ్యం తగినంత ఉప్పు తీసుకుని కచ్చా పచ్చాగా ఉండేలా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో గ్రైండ్‌ చేసి పెట్టుకున్న కంద కూడా కలిపి గారెలా పిండిలా చేసుకోవాలి.

స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని చేతిలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ గారెలుగా ఒత్తుకుని నూనెలో వేగించుకోవాలి. 

వేడి వేడిగా సర్వ్‌ చేసుకుంటే ఈ గారెలు టేస్టీగా ఉంటాయి.


తియ్య కంద 100 గ్రాములలో...

క్యాలరీలు  86

ప్రొటీన్స్‌ 1.6 గ్రా

కార్బోహైడ్రేట్లు 20 గ్రా

డైటరీ ఫైబర్‌ 3 గ్రా

సోడియం 55 ఎంజి


సొరకాయ తెలగపిండి కూర


కావలసినవి

సొరకాయ - సగం, తెలగపిండి - 100గ్రాములు, సెనగపప్పు - ఒక స్పూన్‌, మినప్పప్పు - ఒక స్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, నూనె - రెండు స్పూన్లు, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, కరివేపాకు - ఒక రెమ్మ, మెంతులు - కొద్దిగా.


తయారీ విధానం

ముందుగా సొరకాయ పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

ఈ ముక్కలను ఒక పాత్రలో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.

ముక్కలు ఉడుకుతున్న సమయంలో కొద్దిగా నీళ్లు ఉండగానే జీలకర్ర, తెలగపిండి, తగినంత ఉప్పు వేసి కలపాలి.

మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని దింపాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి.

తరువాత సెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి.

ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సొరకాయ, తెలగపిండి కూడా వేసి నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకుని దింపాలి.


తెలగపిండి 100 గ్రాములలో..

క్యాలరీలు  565 

ప్రొటీన్‌   17 గ్రా

ఫ్యాట్‌  48 గ్రా

డైటరీ ఫైబర్‌   14 గ్రా

కార్బోహైడ్రేట్లు   26 గ్రా


కొబ్బరి రొట్టె


కావలసినవి

మినప్పప్పు - ఒక గ్లాసు, బియ్యపు నూక - ఒకటిన్నర గ్లాసు, కొబ్బరి తురుము - ఒక గ్లాసు, సెనగపప్పు - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

మినప్పప్పును నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత రుబ్బి పెట్టుకోవాలి. 

కుక్కర్‌లో ఒకటిన్నర గ్లాసు బియ్యపు రవ్వ తీసుకుని మూడు గ్లాసుల నీరు పోయాలి.

తరువాత అందులో సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

ఇప్పుడు ఒక పాత్రలో రుబ్బిన మినప్పప్పు, ఉడికించిన బియ్యపు నూక, కొబ్బరి తురుము వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని రొట్టెలా ఒత్తుకోవాలి.

స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె రాసుకుంటూ రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి.

వీటిని బెల్లం పానకంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.


కొబ్బరి 100 గ్రాములలో..


క్యాలరీలు  660 

ప్రొటీన్‌  6.88 గ్రా

డైటరీ ఫైబర్‌  16.3 గ్రా

కార్బోహైడ్రేట్లు  24 గ్రా

ఫ్యాట్‌  64.53 గ్రా

Updated Date - 2020-10-10T05:51:36+05:30 IST