ముంచుకొస్తోంది..

ABN , First Publish Date - 2022-08-10T05:37:45+05:30 IST

గోదావరిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.

ముంచుకొస్తోంది..
పోలవరం స్పిల్‌వే వద్ద వరద నీరు

భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి

గత నెల కంటే మించి ఉధృతి

కష్టాలు తీరకమునుపే మళ్ళీ కన్నీళ్లా..

ఇప్పటికీ కొండలు, గుట్టల మీదే నిర్వాసితులు

ఈసారి కాఫర్‌ డ్యాం నుంచి ఎదురుపోటు

అప్రమత్తంగా ఉండండంటూ హెచ్చరికలు


గోదావరిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రాబోయే 24 గంటల్లో  భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికలను దాటి మరింత ఉగ్రరూపం ప్రదర్శించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం గోదావరి వరద బీభత్సానికి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. కొంపా, గూడు కొట్టుకు పోయాయి. ఆ బాధ నుంచి తేరుకోకమునుపే గోదావరి మరోసారి తరుముకొస్తోంది. ఎగువున తెలంగాణలో నీటి ఉధృతి భారీగా ఉండడం, ఇంద్రావతి, చిత్రావతి ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండడంతో ఆ ప్రవాహం పోలవరం వైపు దూసుకొస్తోంది. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

భద్రాచలం వద్ద ఇప్పటికేమొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా, మరికొద్ది గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరికకు చేరువుగా వరద మారే అవకాశం ఉందని అధికారులు అంచనా. దీంతో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అప్రమత్తమయ్యాయి. ఇప్ప టికే కొండలు, గుట్టల మీద తలదాచుకుంటున్నారు. పోలవరం కాఫర్‌ డ్యాం వద్ద మంగళవారం నాటికే నీటి ప్రవాహ ఉధృతి దాదాపు ప్రమాదస్థాయికి చేరింది. గతంలో ఎలాంటి అప్రమత్తం లేకుండా యంత్రాంగం వ్యవహరించిన తీరుతో నిర్వాసితులు సర్వం కోల్పో యారు. ఈసారైనా అప్రమత్తం అవుతారా..వదిలేస్తారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.

ప్రమాద స్థాయిలో వరద 

గోదావరిలో వరద మంగళవారం పొద్దుపోయే నాటికి ప్రమాద స్థాయికి చేరింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద దిగువున ఉన్న పోలవరానికి దూసుకొస్తున్నది. ఒక్క రోజు వ్యవధిలోనే గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతుండడంతో అధికారులు విస్తుపోతున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 44 అడుగులకు చేరగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద  43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చ రిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సోమవారం సాయంత్రం నుంచి ఇంద్రావతి, చిత్రావతి ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతూనే వచ్చింది. దీనికితోడు ఎగువ, దిగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కార ణంగా వాగులు, వంకల నుంచి భారీ వరద నీరు గోదావరిలో కలుస్తున్నది. 

ఇప్పుడు మరో ముప్పు 

గోదావరి మరోసారి నెల వ్యవధిలోనే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నది. గత నెల 10వ తేదీ నుంచి రెండు వారాల పాటు వరద పోటెత్తింది. మళ్ళీ అదే తరహాలో మంగళవారం నుంచి ఒక్కసారిగా గోదావరిలో వరద పుంజుకుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా మధ్యాహ్నం నాటికే మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద పుంజుకుంటున్నది.  గతంలో భద్రాచలం వద్ద నాలుగు రోజుల వ్యవధిలోనే వరుస ప్రమాద హెచ్చరికలు జారీ కాగా, ఇప్పుడు మాత్రం దానికి అతీతంగా కేవలం 24 గంటల్లోనే మూడు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యేలా ప్రమాద స్థాయిలో ప్రస్తుతం వరద కొనసాగుతోంది. గత నెలలో ఎవరూ ఊహించని విధంగా 36 ఏళ్ళ నాటి వరదను తలపించేలా భద్రాచలం వద్ద అత్యధికంగా 71.3 అడు గుల నీటి మట్టం నమోదైంది. అప్పట్లో వరదను అంచనా వేయలేక యంత్రాంగమే తడబడింది. ముందస్తు జాగ్రత్తలు విఫలమయ్యారు. ఎవరంతట వారుగా తలోదారిన వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నారు.  ఇప్పుడు తాజాగా ఎగువ నుంచి వస్తున్న వరదతో మరింత ప్రమాదం పొంచే ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. 

ఒకవైపు కాఫర్‌ డ్యాం..ఇంకోవైపు శబరి 

గత నెల గోదావరి వరద తీవ్రతను, నష్టాన్ని కూడు, గూడు కోల్పోయి నిరాశ్రయులైన వారి కష్టాలన్నీ కళ్ళెదుటే ఉండగానే మరోసారి గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత నెలలో ఉన్న వరద పరిస్థితికి, ఇప్పుడున్న స్థితిగతులకు కాస్తంత వ్యత్యాసం కనిపి స్తున్నది. ఇప్పుడు తాజాగా పోలవరం కాఫర్‌ డ్యాం నుంచి వరద నీరు ఎగువున ఉన్న ప్రాంతాలకు ఎగతన్నుతోంది.ఇప్పటికే మంగళవారం సాయంత్రం నాటికి పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద నీటి మట్టం 33 మీటర్లుగా నమోదైంది. గత నెలలో రికార్డు స్థాయిలో 33.210 మీటర్ల మేర రికార్డు, ప్రమాద స్థాయిలో నమోదవడమే కాకుండా ఎగువ ప్రాంతాలను వరద ముంచెత్తేలా చేసింది. కాని గత నెలలో వచ్చిన గోదావరి వరదల్లో భద్రాచలం నుంచి నేరుగా వరద పోలవరానకి ప్రవహించగా, ఇప్పుడు దానికి శబరి నుంచి వస్తున్న వరద తోడైంది. చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు పడు తుండడంతో ఒక్కసారిగా సోమవారం నాటికే శబరి ఉప్పొంగింది. ఆ నీరంతా ఇప్పుడు గోదావరిలోకి చేరుతోంది. ఒకవైపు భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న 11 లక్షల క్యూసెక్కుల వరద, ఇంకోవైపు శబరి నుంచి వస్తున్న మరికొన్ని లక్షల క్యూసెక్కుల వరద తోడైన కారణంగానే కాఫర్‌ డ్యాం వద్ద దాదాపు గరిష్ట స్థాయి నీటి మట్టం నమోదైంది. పోల వరం స్పిల్‌వే నుంచి దాదాపు ఏడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల వుతుంది. ఇది బుధవారం నాటికి తొమ్మిది లక్షల క్యూసెక్కులకుపైగానే చేరే అవకాశం ఉంది.

 అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

గోదావరిలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతుండడం, ప్రమాద స్థాయికి చేరుతుండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా పెరుగుతున్న వరదను దృష్టిలో పెట్టుకుని అందరూ అప్రమత్తం కావాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులకు సూచించారు. బుధవారం నాటికే భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకావం ఉందని 12 నుంచి 14 లక్షలలోపు వరద నీరు విడుద లయ్యే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయా మండలాలకు సూచనలు జారీ చేశారు. 

నేడు కేంద్ర బృందం పరిశీలన

గత నెలలో గోదావరి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం సంసిద్ధ మైంది. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఒక కేంద్ర బృందం బుధవారం రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి పోలవరం గ్రామ సమీపాన నక్లెస్‌బండ్‌ను పరిశీలించి ఆ తరువాత తాడువాయి వద్ద పునరావాస కాలనీలను పరిశీలించి అనంతరం వేలేరుపాడులో జరిగిన నష్టాన్ని చూడాలని నిర్ణయిం చింది. వరద నష్టం అంచనాలను జిల్లా యంత్రాంగం ఇప్పటిదాకా నిగ్గు తేల్చలేకపోయింది. దాదాపు ఏడు వేలకుపైగా ఇళ్ళు ఈ రెండు మండలాల్లో పూర్తిగా ధ్వంసమ య్యాయి. కోల్పోయిన ఇళ్ళకు పది వేలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం వేలేరు పాడును సందర్శించాలనుకుంటున్నా ఇక్కడి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. కొయిదా, కటుకూరు వంటి గ్రామాలు పరిశీలిందుకు ఇప్పుడు అనుకూలంగా లేనేలేవు.వరద కమ్ముస్తున్న తరుణంలోనే కేంద్ర బృందం పరిశీలనకు రావడం పట్ల స్థానికులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.    


Updated Date - 2022-08-10T05:37:45+05:30 IST