floods: ధవళేశ్వరం దగ్గర కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-16T22:11:21+05:30 IST

ధవళేశ్వరం (Dhavaleswaram) దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంట గంటకూ గోదావరి (Godavari) వరద ఉధృతి పెరుగుతోంది.

floods: ధవళేశ్వరం దగ్గర కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం: ధవళేశ్వరం (Dhavaleswaram) దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంట గంటకూ గోదావరి (Godavari) వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం దగ్గర 21.30 అడుగులకు నీటిమట్టం చేరింది. 25.08 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద విలయం కొనసాగుతోంది. లంక గ్రామాల్లో ముంపు బాధితులకు తినడానికి తిండి లేదు. తలదాచుకోవడానికి చోటు లేదు. ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్లల్లోని సామగ్రి గోదావరి పాలైంది. పంటలు నీట మునిగాయి. కొట్టుకుపోగా మిగిలిన సామగ్రి, కోళ్లు, పశువులను వెంట బెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కోనసీమ జిల్లా (Konaseema District)లో తీరానికి ఆనుకుని ఉన్న వందకుపైగా లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. సర్కారు కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. వరద ముప్పు నాలుగు రోజులుగా కొనసాగుతున్నా ఇప్పటికీ 8మండలాల్లో లంక గ్రామాలకు అధికారుల జాడే లేదు. ఉన్న సిబ్బంది పెద్దగా సమస్యల్లేని లంకగ్రామాల్లో సహాయక చర్యలపైనే దృష్టిసారిస్తున్నారు.



1986 ఆగస్టు 15న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 76.6 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. అప్పట్లో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం వంటి ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. అప్పట్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ బలంగా లేకపోవడంతో సమాచారం తెలిసేది కాదు. అలాంటి సమయంలో భద్రాచలం నుంచి దిగువకు రికార్డుస్థాయిలో వరద ప్రమాద స్థాయిలో పెరిగి ప్రవహించింది. మృతుల సంఖ్య అప్పట్లో స్వల్పమే అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. 1986, 1990, 2005, 2006, 2020 తర్వాత వశిష్ఠకు ఈ స్థాయిలో వరద తాకింది. వరదలో చిక్కుకున్న ప్రజల కోసం జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-07-16T22:11:21+05:30 IST