గోదావరి ఉరకలు

ABN , First Publish Date - 2021-07-24T06:50:32+05:30 IST

గోదావరి వరద ఉధృతమవుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెడపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరంతా గోదావరికి చేరుతోంది. ఇటు ఉప నదుల నుంచీ వరద నీరు వస్తోంది.

గోదావరి ఉరకలు
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం సాయంత్రం గోదావరి వరద పరవళ్లు

  • ఎగువభాగం నుంచి భారీగా వరద నీరు
  • నేడు భద్రాచలంలో మొదటి హెచ్చరిక చేసే అవకాశం  
  • సాయంత్రం 6 గంటలకు భద్రాచలం నీటిమట్టం 26.50 అడుగులు
  • ఉదయానికి 43 అడుగులకు చేరుతుందని హెచ్చరిక
  • కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఉరకలు 8 గిరిజన గ్రామాలకు వరద తాక
  • ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1,64,897  క్యూసెక్కులు సముద్రంలోకి
  • 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద అంచనా

(రాజమహేంద్రవరం/అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరి వరద ఉధృతమవుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెడపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరంతా గోదావరికి చేరుతోంది. ఇటు ఉప నదుల నుంచీ వరద  నీరు వస్తోంది. ఏజెన్సీలో కూడా వర్షాలు కురవడంతో వాగుల గుండా గోదావరికి నీరు చేరుతోంది. ఈ పరిస్థితుల్లో ఈసారి వరద భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 26.50 అడుగులకు పెరిగింది. ఇది శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకు నెలకొన్న పరిస్థితి. గురువారం వారం సాయంకాలం 6 గంటలకు కేవలం 16.30 అడుగులు ఉంది. శుక్రవారం వారం ఉదయం ఆరు గంటలకు 19.40 అడుగులకు చేరింది. సాయంకాలం ఆరు గంటలకు ఏకంగా 26.50 అడుగులకు చేరింది. అంటే అతి వేగంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ పెరుగుదల శనివారం ఉదయానికి 43 అడుగులకు చేరే అవ కాశం ఉన్నట్టు అక్కడి కలెక్టర్‌ ప్రకటించారు. అంటే మొదటి హెచ్చరిక జారీ చేసే స్థాయి ఇది. ఇక ఈ పెరుగుదల పోలవరం ప్రాజెక్టునూ అధికంగా తాకుతోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఉధృతమవుతోంది. స్పిల్‌వేకు ఏర్పాటు చేసిన 46 గేట్లు ఎత్తివేసి రాజమహేంద్రవరం వైపు నీటిని వదిలేస్తున్నారు. దాంతో అధి కారులు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 1,64,897 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఇది క్రమంలో 12 లక్షల   వరకూ చేరుతుందనే అంచనా ఉంది. అంటే రెండు మూడు రోజులకుపైగానే వరద ఉధృతి ఉంటుంది. కానీ రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో గతంలో కనిపించిన ఉధృతి కనిపించదు. కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఎక్కువ నీరు ఉండిపోతోంది. స్పిల్‌వే ద్వారా కొంతమాత్రమే కిందకు వస్తోంది. కానీ గతంలో కాఫర్‌ డ్యామ్‌ వద్ద నిలిచిపోయిన వరద నీరంతా రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో ఉగ్రరూపం దాల్చేది. ప్రస్తుతం అంత ఉధృతి ఇక్కడ కనిపించకపోవచ్చు. పైగా ఇరిగేషన్‌ అధికారులు స్పిల్‌వే నుంచి లక్షా, రెండు లక్షల కూసెక్కులు వస్తుంటే, ఇక్కడ లక్షా 64 వేల క్యూసెక్కుల వరకూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం ఎక్కువగా లేకుండా చూస్తున్నారు. గురువారం 10 అడుగుల వరకూ నీటిమట్టం ఉంటే, శుక్రవారం సాయంకాలం కేవలం 7 అడుగుల నీటిమట్టం మాత్రం ఉండేలా చూశారు. ఇక ఎగువ భాగంలోని కాళేశ్వరం నుంచి 1,58,310 క్యూసెక్కుల నీరు కిందకొస్తోంది. పేరూరు నుంచి 6,51,119 క్యూసెక్కులు వస్తోంది. దీంతో పెద్ద వరదే రావచ్చు. ఎగువన ఏజెన్సీ గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఇప్పటికే దేవీపట్నం మండలం, దాని పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోకి వరద నీరు చేరింది. వీధులన్నీ వరదతో నిండిపోయాయి.

కోనసీమలో పొంగుతున్న నదీపాయలు

ఇక ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగే ప్రమాదం ఉండడంతో గోదావరి నదీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమలాపురం డివిజన్‌ పరిధిలోని నదీ పరీవాహక మండలా లకు చెందిన తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. వరద పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి తగిర రక్షణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి నదీపాయల్లో నీటి ఉధృతి కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని నదీ పరివాహక ప్రాంతాల్లో పల్లపు ప్రాం తాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరిలో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటమాని ఇళ్ల వద్దే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. గోదావరి ఎగువన వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో తీరప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. 

Updated Date - 2021-07-24T06:50:32+05:30 IST