దుబ్బాక ఒడిలోకి గోదావరి

ABN , First Publish Date - 2021-04-08T05:41:53+05:30 IST

నా చిన్నతనంలో ఆకాశం నుంచి చినుకు రాలిందంటే ఓ పాట పాడుకునే వారు. ‘దుబురు దుబురు వాన గొట్టె.. దుబ్బాక చెరువు నిండె...

దుబ్బాక ఒడిలోకి గోదావరి

నా చిన్నతనంలో ఆకాశం నుంచి చినుకు రాలిందంటే ఓ పాట పాడుకునే వారు. ‘దుబురు దుబురు వాన గొట్టె.. దుబ్బాక చెరువు నిండె..’ అలా అనుకుంటేనయినా వాన పడుతుందని, చెరువు నిండుతుందని ఆశ. అంతటి దుర్భిక్షం దుబ్బాక ప్రాంతంలో ఉండేది. ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంగు బియ్యం కూడా దొరకనంత దైన్యంగా ఉండేది. ఆఖరుకు ఓ ఇంట్లో ఒడి బియ్యం పోయలేనంత దీనస్థితి ఆ ఇంట ముగ్గురి బలవన్మరణానికి కారణమైంది. నేతన్నలకు గిరాకీ లేక వలసే దిక్కయ్యేది. రజకులు, గంగపుత్రులు.. అన్ని కులాల వారు ఊరు విడిచి ముంబై, భివాండి, హైదరాబాద్‌, దుబాయ్‌, మస్కట్‌ బాట పట్టేవారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ముత్యం రెడ్డి ఎంత అభివృద్ధి చేసినా ‘ఆహార మంత్రి ఇలాకాలో ఆకలి చావులు’ అనే హెడ్డింగులతో వార్తలు వచ్చేవి. అభివృద్ధిలో భాగంగా భవనాలు, గోదాంలు అద్దంలాంటి రోడ్లు ఎన్ని నిర్మించినా వలసలకే ఉపయోగపడ్డాయి. చెప్పలేనంత కరువు దుబ్బాకది.


మాజీమంత్రి, దివంగత అనంతుల మదన్‌మోహన్‌ ఒకానొక సమయంలో దుబ్బాక ఎంపీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. తాను అంతకుముందు ప్రాతినిథ్యం వహించిన సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో దుబ్బాక మండలంలోని 12 గ్రామాలు ఉన్నందున పాత్రికేయులతో మనసులోని మాటలు చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొస్తానని చెప్పారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తానని, తద్వారా సాగునీరందిస్తాననీ స్పష్టం చేశారు. అంతే కాకుండా సిద్దిపేట జిల్లాను కూడా ఏర్పాటు చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు. నేనే కాదు, నాతోటి విలేఖరులెవరూ మదన్ మోహన్ మాటలు నమ్మలేదు. 


ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రవాణా శాఖ మంత్రి కూడా. 1999 ఎన్నికలు సమీపిస్తున్న సమయమది. ఆయన నియోజకవర్గ పరిధిలోని మల్లాయపల్లి గ్రామంలో మాకు పొలం ఉండేది. చెరువు పక్కనే ఉన్నా చుక్క నీరుండేది కాదు. లోవోల్టేజీతో తరచూ బోరు మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు లేఖ కోసం ఆయన వద్దకు వెళ్లాను. నక్సల్స్‌ ప్రభావం, నిర్బంధం ఎక్కువున్న ఆ సమయంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. అయినా అందరూ మద్దతు ఇవ్వాలని తన దగ్గరికి వచ్చిన వారిని కేసీఆర్ కోరేవారు. ‘దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి చేలు, చెలకలు తిరుగుతూ చెక్‌డ్యామ్‌లు కూడా కడుతుంటే.. మీరు తిరగకపోతే ఎలా గెలుస్తారని’ మేం ప్రశ్నించేది. అప్పుడు కేసీఆర్‌.. ‘ముత్తన్న నిజంగానే మొండోడు. తిరుగుతడు.. కానీ ఎంత తిరిగామని కాదు.. ఎంత చేశామనేది ముఖ్యం. కూడవెళ్లి వాగు చుట్టూ చెక్‌డ్యాంలు నిర్మించడం మంచిదే. కానీ కూడవెళ్లి మొత్తం నిండితే ఆగే నీళ్లు అర టీఎంసీ మాత్రమే. నేను సిద్దిపేట నియోజకవర్గానికి మానేరు మంచి నీళ్లు తెస్తున్నా. ఏడాదికి 4 టీఎంసీలు అవుతాయి. ఇంకా కొట్లాడి ఇచ్చంపల్లి ప్రాజెక్టు సాధించి, గోదావరి నీళ్లు తేవాలన్న సంకల్పం ఉంది’ అని చెప్పారు. 


అనేక ఉద్యమాలు, ఆకలి చావుల తర్వాత.. దుబ్బాక ఇప్పుడు చరిత్రను తిరగరాసుకునే పనిలో పడింది. అనంతుల మదన్‌మోహన్‌ ఆశ, కేసీఆర్‌ సంకల్పం.. వెరసి దుబ్బాక ఒడిలోకి గోదావరి నీళ్లు చేరుతున్నాయి. కూడవెళ్లి కూడా కళకళలాడుతున్నది. వ్యవసాయం ఆశాజనకంగా మారి రైతులు, తద్వారా సబ్బండ వర్ణాల బతుకులు మారుతాయనే ఆశ చిగురిస్తున్నది. దీనంతటి వెనుక మంత్రి హరీశ్‌రావు కృషిని ఎవరూ కాదనలేరు. ఊరూరికి, ప్రతి చెరువు వద్దకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ఆయన తిరిగిన రోజులను ఎవరూ మరిచిపోలేరు. దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్‌ను కలిసినపుడల్లా ఆయన ఓ మాట చెప్పేవారు: ‘ముందు నీళ్లు రావాలె. గట్టిగ పంట పండాలె. బిచ్చం అడుక్కునే వాళ్లు కూడా కల్లం అడుగున మిగిలిన ధాన్యం ఏరుకుని బతుకుతరు. బతుకుదెరువు ఇచ్చేవే నీళ్లు.. నీరు పల్లమెరిగినట్టే.. అభివృద్ధి, నాగరికత కూడా అందరికీ ఎరుకలోకి వస్తుంది’.

అంబటి వెంకట్‌ గౌడ్‌

Updated Date - 2021-04-08T05:41:53+05:30 IST