గోదావరికి మళ్లీ వరద

ABN , First Publish Date - 2022-08-09T10:13:25+05:30 IST

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

గోదావరికి మళ్లీ వరద

  • భద్రాచలం వద్ద 36.10 అడుగులుగా నమోదు.. 
  • నీట మునిగిన గుండేటి వాగు లోలెవల్‌ కాజ్‌వే 


పోలవరం/కుక్కునూరు/జంగారెడ్డిగూడెం, ఆగస్టు 8: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 36.10 అడుగులకు చేరుకొంది. ఏలూరు జిల్లా కుక్కునూరులోని గుండేటి వాగు మీద ఉన్న లోలెవల్‌ కాజ్‌వే భారీ వర్షాలకు నీట మునిగింది. దీంతో కుక్కునూరు-దాచారం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన, ఎగువ కాపర్‌ డ్యాం ఎగువన గోదావరి నీటిమట్టం 30.840 మీటర్లు, దిగువ కాపర్‌ డ్యాం, స్పిల్‌ వే దిగువన 21.710 మీటర్లు, పోలవరం వద్ద 21.387 మీటర్లు నమోదైంది. అదనంగా వస్తున్న 3,52,502 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ఎర్రకాలువ జలాశయానికి చేరుతున్నాయి. 6,903 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉండటంతో జలాశయ మూడు గేట్లు ఎత్తి 3,745 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అయితే సాయంత్రానికి ఇన్‌ఫ్లో 5,657 క్యూసెక్కులకు తగ్గింది. తెలంగాణలో వర్షాలతో బేతుపల్లి చెరువు నిండి అదనపు నీరు తమ్మిలేరు జలాశయానికి చేరుతోంది. వర్షం, గాలుల కారణంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి-లక్కవరం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వందేళ్ల వయసున్న భారీ వృక్షం పడిపోయింది. 


నేడు వాయుగుండం?

విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగు తోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం మంగళవారం మరింత బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనించనుంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా  తూర్పు, పడమర ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా సోమవారం వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-08-09T10:13:25+05:30 IST