మళ్లీ పోటెత్తిన ‘గోదావరి’

ABN , First Publish Date - 2022-08-11T08:52:31+05:30 IST

మళ్లీ పోటెత్తిన ‘గోదావరి’

మళ్లీ పోటెత్తిన ‘గోదావరి’

కుక్కునూరు- దాచారం మధ్య రాకపోకలు బంద్‌

‘వేలేరుపాడు’లో 40 గ్రామాలను చుట్టుముట్టిన వరద

భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన నీటిమట్టం

జల దిగ్బంధంలో ‘చింతూరు’లోని 25 గ్రామాలు

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ


కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం/చింతూరు/ధవళేశ్వరం, ఆగస్టు 10: గోదావరి మళ్లీ పోటెత్తింది. ఎగువ నుంచి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. తెలంగాణ అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గోదావరి నదికి ఎగువన వరద తక్కువగానే ఉన్నప్పటికీ శబరి, పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా గతం కంటే 8 అడుగుల వరద నీరు అధికంగా వచ్చి చేరింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ ఎగువన గోదావరి నీటిమట్టం 33.370 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 24.760 మీటర్లు నమోదయింది. పోలవరం వద్ద 24 మీటర్లు నమోదయింది. 10,10,387 క్యూసెక్కుల వరదజలాలను దిగువకు విడుదల చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద ఆంధ్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులపై వరద నీరు చేరింది.  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటి ప్రవహిస్తోంది. చింతూరు వద్ద శబరి ఉధృతంగా ప్రవహిస్తోంది. చింతూరు మండలానికి మూడువైపులా వరద చుట్టుముట్టింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు మినహా మిగిలిన ప్రాంతాల వైపు రాకపోకలు సాగించే పరిస్థితి లేకుండా పోయింది. చింతూరు మండలంలో 25 గ్రామాల వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నెల రోజుల వ్యవధిలో రెండో సారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.  

కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలి: విపత్తుల ఎండీ

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వరదల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ(డీఎండీ) ఎండీ అంబేడ్కర్‌ కోరారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 1070, 18004250101, 0863-2377118తో సంప్రదించాలని సూచించారు. 


Updated Date - 2022-08-11T08:52:31+05:30 IST