ముంపు.. ముప్పు

ABN , First Publish Date - 2021-07-24T06:08:31+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పోలవరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది.

ముంపు.. ముప్పు
కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గోదావరి

సురక్షిత ప్రాంతాలకు వేలేరుపాడు, కుక్కునూరు ప్రజలు 

పొంగుతున్న వాగులు.. వంకలు..  పోటెత్తిన గోదావరి

10,308 హెక్టార్లలో నారుమళ్లు, నాట్లు మునక

మొగల్తూరులో అత్యధికంగా 77.8 మి.మీ వర్షపాతం

సముద్రంలోకి 1,64,897 క్యూసెక్కుల నీరు విడుదల

తూర్పు, మధ్య డెల్టాలకు నీటి విడుదల నిలిపివేత 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన  ద్రోణి ప్రభావంతో  జిల్లాను వర్షాలు ముంచెత్తాయి.  నాలుగు రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. శుక్రవారం ఉదయం కొంత తెరిపిచ్చినా రాత్రి భారీ వర్షం కురిసింది.  మరో రెండు రోజులపాటు జిల్లాలో భారీ  వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

– ఏలూరు సిటీ 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పోలవరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది. తమ్మిలేరుకు వరద పోటెత్తింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ కారణంగా, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఎర్రకాలువ ప్రాజెక్టులోకి 1,760 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉంది. కొంగువారిగూడెం ప్రాజెక్టు వద్ద ఎర్రకాలువ నీటి మట్టం 79 మీటర్లుగా ఉంది.  గడిచిన 24 గంటల్లో జిల్లాలోని మొగల్తూరు  మండలంలో అత్యధికంగా 77.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 29 మిల్లీమీటర్లు నమోదైంది. 33 మండలాల్లోని 212 గ్రామాల్లో 10,308.45 హెక్టార్లలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వీటిలో వరి నారుమళ్లు 1,709.5 హెక్టార్లు, నాట్లు వేసిన పొలాలు  8,598.45 హెక్టార్లు ముంపునకు గురయ్యాయి. తాడేపల్లిగూడెం మండలంలో 1,250 హెక్టార్లలోను, పెంటపాడు మండలంలో  1,103.6 హెక్టార్లలోను తణుకు మండలంలో 523.2 హెక్టార్లలోను అత్యధికంగా వరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.   మరో రెండు రోజుల పాటు వర్షంలోనే నారుమళ్లు ఉంటే కుళ్లిపోతాయని సార్వా సాగులో నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. 

 

తమ్మిలేరుకు కొనసాగుతున్న వరద 


చింతలపూడి, జూలై 23 : చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం వద్ద వున్న తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి నాలుగు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం 346 అడుగులు ఉందని ప్రాజెక్టు అధికారి డి.అప్పారావు తెలిపారు. ఇదే వరద రేపు కొనసాగితే శనివారంసాయంత్రం గేట్లు తెరిచే అవకాశం ఉందని చెప్పారు. ఎగువ  కూడా వర్షాలు పడుతున్నాయి. డ్యామ్‌ లెవెల్‌ 355 అడుగులు కాగా, 348 అడుగులు చేరుకోగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.


ఎర్రనీరుతో అఖండ గోదావరి ఉరకలు 


కొవ్వూరు, జూలై 23 : కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో అధికంగా వరద నీరు వచ్చి చేరుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ నదిలో చేరడంతో గోదావరిలో ఎర్రనీరు చేరి ఉరకలు పెడుతోంది. కొత్త గోదావరిని చూడడానికి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో శుక్రవారం ప్రధాన స్నానఘట్టాన్ని తాకుతూ గోదావరి నది ప్రవహించింది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో నీటిమట్టం నమోదు చేశారు. బ్యారేజ్‌కు ఉన్న 175 గేట్లను పైకిఎత్తి ఉదయం ఒక లక్షా 10 వేల క్యూసెక్కులు, సాయంత్రం 1,64,897 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌ దిగువన వున్న మూడు ప్రధాన డెల్టాలలో పశ్చిమ డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టాలకు నీటి విడుదల నిలుపుదల చేశామని ధవళేశ్వరం గోదావరి హెడ్‌ వాటర్‌ వర్క్సు అధికారులు తెలిపారు.


మొదటి హెచ్చరిక  దిశగా..


భద్రాచలం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 21 అడుగుల నీటిమట్టం ఉండగా రాత్రి 9 గంటలకు 30.3 అడుగులకు చేరింది. శనివారం ఉదయానికి 42 నుంచి 43 అడుగులకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.




Updated Date - 2021-07-24T06:08:31+05:30 IST