భద్రకాళి అమ్మవారి ‘వెలుగుల కొండ’

ABN , First Publish Date - 2022-09-18T05:35:03+05:30 IST

‘పిరమిడ్లు ఈజిప్టులో ఎందుకు ఉన్నాయి?’– టీచర్ అడిగిన ఈ ప్రశ్నకు ఒక చిన్నారి ఇలా సమాధానమిచ్చింది : ‘ఇంగ్లీష్ వారు అపహరించడానికి వీలు లేని, వీలు కాని భారీ, బరువైన కట్టడాలవి’. ఈ సమాధానంలో...

భద్రకాళి అమ్మవారి ‘వెలుగుల కొండ’

‘పిరమిడ్లు ఈజిప్టులో ఎందుకు ఉన్నాయి?’– టీచర్ అడిగిన ఈ ప్రశ్నకు ఒక చిన్నారి ఇలా సమాధానమిచ్చింది : ‘ఇంగ్లీష్ వారు అపహరించడానికి వీలు లేని, వీలు కాని భారీ, బరువైన కట్టడాలవి’. ఈ సమాధానంలో వయస్సుకు మించిన పరిజ్ఞానంతో పాటు అమాయకత్వమూ ఉంది. ఈ ఆసక్తికరమైన సంభాషణ నిజానికి ఒక వ్యంగ్య చిత్రంలోని వ్యాఖ్య. ఆ బాలికకు తెలియని రాజకీయ వాస్తవాలపై నిశిత విమర్శే ఆ వ్యాఖ్య. మానవ నిర్మిత అద్భుత కట్టడాలు బృహత్ పరిమాణంలో ఉండబట్టే బ్రిటిష్ లేదా యూరోపియన్ వలస వాదులు వాటిని స్వాయత్తం చేసుకుని తమ దేశాలకు తరలించలేకపోయారు. అయితే ప్రకృతి శక్తుల మహేంద్ర జాలంతో భూగర్భంలో ఉనికిని సంతరించుకున్న, పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, ప్రకాశంలో మహాద్భుతమైన కోహినూర్ వజ్రం అంతిమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పరమయింది.


కోహినూర్ అంటే పర్షియన్ భాషలో వెలుగుల కొండ లేదా కాంతి శిఖరం అని అర్థం. దాని చివరి సొంతదారు ఎలిజబెత్ 2 అస్తమయం, కొత్త ఆసామి చార్లెస్ 3 రాజ్యాభిషిక్తుడు కావడంతో ఆ వెలుగుల కొండ మళ్లీ మన దేశంలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో సంచలనాత్మక చర్చలకు ఆలవాలమయింది. ఆ విలువైన వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. శతాబ్దాల పాటు భారత్‌ను కొల్లగొట్టిన వలసపాలకులు నష్టపరిహారంగా కోహినూర్‌ను దాని జన్మభూమికి అప్పగించాలని కోరుతున్నారు. ఉదారభావాలు గల చార్లెస్ 3 ఇప్పుడు బ్రిటిష్ సార్వభౌముడు కనుక ఆయన విశాల దృక్పథంతో కోహినూర్ విషయంలో నిర్ణయం తీసుకోగలడనే ఆశాభావాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. ఆ వజ్రాన్ని భారత్‌కు అప్పగించడమంటే బ్రిటన్ గతంలో తన వలస రాజ్యంలో పాల్పడిన మహాదుర్మార్గాలకు ప్రాయశ్చితం చేసుకోవడమేనని కూడా కొందరు అభిప్రాయడ్డారు!


అయితే ఈ సైబర్ ప్రపంచ పౌరులలో చాలా మందికి, బహుశా, ఒక విషయం తెలిసి ఉండక పోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే కోహినూర్‌పై భారత్ హక్కును పరిత్యజించింది. 19వ శతాబ్ది మధ్యనాళ్లలో బ్రిటిష్ సామ్రాజ్ఞి విక్టోరియా మహారాణికి బహూకరించిన కోహినూర్ కొల్లగొట్టినది ఎంత మాత్రం కాదని 2016 ఏప్రిల్‌లో ఆనాటి సొలిసి టర్–జనరల్ రంజిత్ కూమార్ సుప్రీంకోర్టులో అధికారికంగా స్పష్టం చేశారు. కోహినూర్‌ను మళ్లీ భారత్‌కు తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించాలని కోరుతూ నఫిస్ అహ్మద్ సిద్దిఖీ దాఖలు చేసిన ఒక ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మాజీ సొలిసిటర్ జనరల్ ఆ విషయాన్ని పేర్కొన్నారు. ‘కోహినూర్ తస్కరించింది కానీ, బలవంతంగా తీసుకువెళ్లింది కానీ కాదని’ ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత ప్రభుత్వం ఆ ‘కాంతి శిఖరాన్ని’ స్వదేశానికి తీసుకువచ్చేందుకు విఫల ప్రయత్నాలు చేసింది. నాటినుంచి బ్రిటిష్ ప్రధానమంత్రులు దాన్ని భారత్‌కు అప్పగించేందుకు తిరస్కరిస్తూ వస్తున్నారు. ఆ అమూల్య వైభవోపేత వజ్రం ఎలా చేతులు మారీ, రాజ్యాలు మారీ, దేశాలు దాటి, సముద్రాలకు ఆవల ఉన్న బ్రిటన్‌కు చేరి, దాని రాజకుటుంబపు సొత్తు అవడంలో దాని చారిత్రక ప్రస్థానాన్ని తెలుసుకుందాం.


కోహినూర్ వజ్రం కృష్టానదీ తీరంలో ప్రభవించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల నుంచి ఆ వజ్రాన్ని వెలికితీసినట్లు స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాలక్రమంలో అది కాకతీయ పాలకుల కోశాగారానికి చేరింది. వారు దాన్ని ఓరుగల్లులోని భద్రకాళి ఆలయంలోని అమ్మవారి ఎడమ కన్నుగా అమర్చి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు (ఈ ఆలయానికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దిలో తీరాంధ్రంలోని వేంగీ రాజ్యాన్ని జయించిన సందర్భంగా చాళుక్యరాజు రెండో పులకేసి ఓరుగల్లులో భద్రకాళి ఆలయాన్ని నిర్మించాడు. ఓరుగల్లు కాకతీయుల పాలనలోకి వచ్చినప్పుడు ఆ భద్రకాళి అమ్మవారిని తమ కుల దేవతగా గౌరవించి, ఆరాధించారు. ఇప్పటికీ ఉన్న ఈ ఆలయానికి 1950లో గణేశ్‌రావు శాస్త్రి అనే దేవీ ఉపాసకుడు, గుజరాతీ వ్యాపారస్తుడు మగన్‌లాల్ బి సమేజాలు మరమ్మత్తులు జరిపి సరికొత్త కోవెలగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశ గోల్డెన్ టెంపుల్‌గా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం పక్కన విశాల భద్రకాళి సరస్సు కూడా ఉంది). దక్కన్‌పై ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ దండయాత్రలతో కాకతీయులకు పాడురోజులు దాపురించాయి. క్రీ.శ. 1310లో కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఖిల్జీ సైనిక సర్దారులు భద్రకాళి ఆలయాన్ని ధ్వంసం చేసి, అమ్మవారి ఎడమకన్నుగా ఉన్న కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తీసుకువెళ్లారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే కోహినూర్ వజ్రాన్ని వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి విగ్రహం నుంచి తస్కరించారు. ఇది నేటి జనసామాన్యానికి తెలియని నిజం.


అలా అపహరణకు గురైన కోహినూర్ తరువాయి చరిత్ర మొగల్ చక్రవర్తుల కాలంలో మాత్రమే వెలుగులోకి వచ్చింది. 1526లో ఆ వజ్రం మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ స్వాధీనంలోకి వచ్చింది. ఆ సౌందర్యోపాసకుడు దాన్ని స్వయంగా ‘బాబర్ వజ్రం’గా పిలుచుకుని మురిసిపోయాడు. బాబర్, ఆయన కుమారుడు హుమాయున్ తమ జ్ఞాపకాలలో కోహినూర్‌ను ‘ది డైమండ్ ఆఫ్ బాబర్’గా ప్రస్తావించారు. దాని మూలాలను వివరించారు. యావత్ప్రపంచానికి రెండున్నర రోజుల పాటు ఆహారాన్ని సమకూర్చేందుకు అయ్యే వ్యయాన్ని ఆ వజ్రం విలువగా బాబర్ పరిగణించాడని ప్రతీతి. అఫ్ఘాన్ యోధుడు షేర్ షాతో యుద్ధంలో ఓడిపోయిన హుమాయూన్‌ పర్షియాలో ఆశ్రయం పొందాడు. తనను ఆదరించి, భారత్‌లో రాజ్యాధికారాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు సహకరించిన పర్షియా రాజుకు హుమాయున్ ఆ వజ్రాన్ని బహూకరించాడు. ఆ తరువాత అది షాజహాన్ కాలంలో మళ్లీ మొగల్ చక్రవర్తుల చేతుల్లోకి వచ్చింది. సొంత సోదరులను చంపి తన తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబ్ ఆ వజ్రాన్ని లాహోర్‌కు తీసుకువెళ్ళి అక్కడ బాద్షాహి మసీదులో ఉంచాడు. 1739లో భారత్‌పై ఇరాన్ చక్రవర్తి నాదిర్షా దండయాత్ర వరకు అది ఆ మసీదులోనే ఉంది. ఆగ్రా, ఢిల్లీ నగరాలను ఎటువంటి మినహాయింపులేకుండా దోచుకున్న నాదిర్షా తనతో పాటు నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని కూడా పర్షియాకు తీసుకువెళ్ళాడు. అతడే ఆ వజ్రానికి కోహినూర్ అని నామకరణం చేశాడు. 1739కి ముందు ఆ పేరు ప్రస్తావన ఎక్కడా లేదు. 1747లో నాదిర్షా వారసుల నుంచి అది ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దం ఆరంభంలో అఫ్ఘానిస్తాన్‌పై పట్టుకు బ్రిటిష్ ఇండియా, రష్యాలు తీవ్ర ప్రయత్నాలు చేసిన క్రమంలో దుర్రానీ వారసుడు షా షుజా రాజ్యాన్ని కోల్పోయి లాహోర్‌లో ఆశ్రయం పొందాడు. తనను అన్ని విధాల ఆదరించిన నాటి పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్‌కు కృతజ్ఞతగా షా షుజా కోహినూర్ కానుకగా ఇచ్చాడు.


మహారాజా రంజిత్ సింగ్ తన చివరి రోజులలో ఆ వజ్రాన్ని జగన్నాథ దేవాలయంలోని దేవతకి బహూకరించాలని భావించాడు. అయితే బ్రిటీష్ అధికారులు రంజిత్ సింగ్ అభీష్టాన్ని పట్టించుకోలేదు. రంజిత్ సింగ్ అనంతరం పంజాబ్‌ను ఆక్రమించుకుని ఆయన వారసుల చేతే కోహినూర్‌ను విక్టోరియా మహారాణికి కానుకగా ఇప్పించారు. 1851లో లండన్‌లో జరిగిన ‘గ్రేట్ ఎగ్జిబిషన్’లో దాన్ని ప్రదర్శించారు. ఆ తరువాత అది టవర్ లండన్‌కు చేరి బ్రిటిష్ రాజకుటుంబ వ్యక్తిగత ఆస్తుల్లో భాగంగా ఉండిపోయింది.

కన్నెకంటి వెంకటరమణ

Updated Date - 2022-09-18T05:35:03+05:30 IST