వరంగల్ రూరల్ కల్చరల్, జనవరి 13: ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు జిల్లాలోని వైష్ణవఆలయాల్లో బుధవారం శ్రీగోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసం రోజుల్లో తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యేక ఉత్సవాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. మాసం చివరి రోజు అమ్మవారి కల్యాణోత్సవాలను జిల్లాలోని అన్ని ప్రధాన వైష్ణవ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. దుగ్గొండి మండలంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, కల్లెడలోని శ్రీవేంకటేశ్వరాలయం, వర్ధన్నపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయం శాయంపేటలోని వైష్ణవ ఆలయం, ప్రగతి సింగారంలో సీతారామచంద్రస్వామి ఆలయం, మత్స్యగిరిస్వామి ఆలయం, చెన్నారావుపేట లింగగిరి గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో, ఆత్మకూరులోని చెన్నకేశవ ఆలయం, దామెర ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాల్లో గోదా రంగనాథ కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.