దేవతలారా...రారండి

ABN , First Publish Date - 2022-09-28T06:31:44+05:30 IST

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ద్వజారోహణ కార్యక్రమంతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.

దేవతలారా...రారండి
ధ్వజారోహణం

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఆహ్వానం


శ్రీవారి ఆలయంలో శాస్ర్తోక్తంగా ధ్వజారోహణం 


పెద్దశేష వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు


తిరుమల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ద్వజారోహణ కార్యక్రమంతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయంలో నిత్యపూజాది కార్యక్రమాల అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివార్లకు ఉదయం విశేష సమర్పణ కావించారు. అనంతరం ప్రధాన అర్చకులు వరుసగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప, ఇతర దేవతలు, కంకణ భట్టాచార్యులైన శేషాచలం దీక్షితులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కంకణధారణ చేశారు.మధ్యాహ్నం 3-5గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగించారు. అలాగే అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వేర్వేరు పల్లకీలలో, ధ్వజపటాన్ని కూడా ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలకు దేవతలందరికీ ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయం చేరుకున్న ఉత్సవర్లు ధ్వజస్తంభం, బలిపీఠం చెంతకు వేంచేశారు. ధ్వజస్తంభంలో ప్రతిష్టింపబడిన గరుడుడికి అభిషేకం, వస్త్ర సమర్పణ, నివేదన తదితర కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడుడికి నివేదించిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. సాయంత్రం 5.45 - 6.15గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజరోహణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.


శ్రీవారికి సీఎం పట్టువస్ర్తాల సమర్పణ


 తిరుమలేశుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు.సాయంత్రం తిరుమల పద్మావతి గృహానికి చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని సంప్రదాయ వస్త్రధారణతో బేడిఅంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపచేశారు. ఆ తరువాత నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని బాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం చేరుకున్నారు.మూలవర్లను దర్శించుకుని బలిపీఠం, ధ్వజస్తంభానికి మొక్కుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేదపండితులు ఆశీర్వాదం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సర క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు.అనంతరం తన బరువుకు సమానంగా బియ్యంతో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. 8.50గంటలకు ఆయన వాహన మండపం చేరుకున్నారు. పది నిమిషాల పాటు వాహనమండపం ముందే నిరీక్షించి పెద్దశేషవాహనంలోని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు.సీఎం అక్కడుండగానే కాసేపు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అధికారులు హైరానాపడ్డారు. రాత్రి 9గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు.అంతకుముందు సీఎం ఆలయంలో ప్రవేశించడానికి ముందు కొంతమంది కార్యకర్తలను టీటీడీ భద్రతాధికారులు మహద్వారం వద్ద అడ్డుకున్నారు. సీఎం వెళ్లేవరకు పంపబోమని చెప్పడంతో భద్రతా సిబ్బంది, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపటి తర్వాత కార్యకర్తలను ఆలయంలోకి అనుమతించారు.ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, రోజా,ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 


 మోస్తరుగానే భక్తుల రద్దీ


రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగానే కనిపించింది. రాత్రి జరిగిన పెద్దశేష వాహనంలోనూ భక్తుల రద్దీ తక్కువగా కనిపించింది. గ్యాలరీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సీఎం పర్యటన నేపథ్యంలోనే భక్తుల రద్దీ తక్కువగా ఉందని, బుధవారం నుంచి రద్దీ పెరగవచ్చని భావిస్తున్నారు. 


పడగనీడలో గోవిందుడి వైభవం


  తిరుమల  బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేషవాహనంలో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. సాయంత్ర ఉత్సవర్లను వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, పట్టుపీతాంబర వస్త్ర, సుగంధ పరిమళ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి 9 గంటలకు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళబృందాల ప్రదర్శనలు, గోవిందనామస్మరణల నడుమ పెద్దశేషవాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు.

Updated Date - 2022-09-28T06:31:44+05:30 IST