ఎల్లమ్మో.. మాయమ్మ..!

ABN , First Publish Date - 2022-07-01T14:14:35+05:30 IST

నార్సింగ్‌ మమ్మేలు మా అమ్మ.. గోల్కొండ ఎల్లమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. జగదాంబిక ఎల్లమ్మ.. అంటూ భక్తులు గోల్కొండ కోటలో ఎల్లమ్మ(జగదాంబిక)కు మొక్కుతూ బోనాలు

ఎల్లమ్మో.. మాయమ్మ..!

బోనమెత్తిన గోల్కొండ

శివసత్తుల పూనకాలు..పోతరాజుల విన్యాసాలు

తొలి రోజు లక్ష మంది భక్తులు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు


హైదరాబాద్: నార్సింగ్‌ మమ్మేలు మా అమ్మ.. గోల్కొండ ఎల్లమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. జగదాంబిక ఎల్లమ్మ.. అంటూ భక్తులు గోల్కొండ కోటలో ఎల్లమ్మ(జగదాంబిక)కు మొక్కుతూ బోనాలు సమర్పించారు.  బోనాల సంబురాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మకు తొలిబోనం సమర్పించడంతో నెల రోజుల పాటు సాగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, నృత్యాలతో డప్పు.. బ్యాండ్‌ మేళాలతో నిర్వహించిన చారిత్రక గోల్కొండ జగదాంబిక బోనాలకు జనం భారీగా తరలివచ్చారు. 


కిక్కిరిసిన కోట

గోల్కొండ కోటలో గురువారం మొదటి పూజ ఉండడంతో నగరం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలనుంచి భారీఎత్తున భక్తులు తరలివచ్చారు. గురువారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు. 


ఊరేగింపుగా మొదటి బోనం 

చోటా బజార్‌లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతచారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు.  లంగర్‌హౌజ్‌ నుంచి 70 అడుగుల తొట్టెల ఊరేగింపు, చోటాబజార్‌ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కోటపైనున్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగించారు. పటేల్‌ లక్ష్మమ్మ ఇంటినుంచి మొదటి బోనం బంజారా దర్వాజ నుంచి దేవాలయం వరకు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు.  


పట్టువస్త్రాలు.. ప్రత్యేక పూజలు 

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌,  నగర పోలీసు కమిషనర్‌ సి.వి.ఆనంద్‌, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. 


ఉత్సవాలకు రూ.15 కోట్లు : మంత్రి అల్లోల

నగరంలో బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ జూలై 17, 18 తేదీల్లో సికింద్రాబాద్‌ బోనాలు ఉంటాయని, 24, 25 తేదీల్లో పాతబస్తీలో బోనాలుంటాయని తెలిపారు. రూ.15 కోట్లు మంజూరు చేస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 


అమ్మవారికి బంగారు బోనం

చాంద్రాయణగుట్ట: గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం బంగారుబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. సప్త మాతృకులకు సప్త బంగారు బోనంలో భాగంగా కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ తివారీ ఆధ్యర్యంలో గురువారం సుల్తాన్‌షాహీ జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాతబస్తీ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ తివారీ మాట్లాడుతూ జూలై 3న విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఎస్‌పీ క్రాంతికుమార్‌, మధుసూదన్‌ యాదవ్‌, ఎం.కృష్ణ, వివిధ దేవాలయాల కమిటీల ప్రతినిధులు ఆలే భాస్కర్‌రాజ్‌, కేఎస్‌ ఆనంద్‌రావు, సీర రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


బోనాలకు భారీ బందోబస్తు : సీపీ ఆనంద్‌

గోల్కొండ బోనాల ఉత్సవాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. బోనాల ఉత్సవం తొలిరోజున ఆయన గోల్కొండ జగదాంబ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ అధికారులతో, బోనాల ఉత్సవాల నిర్వాహకులతో భద్రతా చర్యలను సమీక్షించారు. కౌంటర్‌లు, క్యూల వద్ద బారికేడింగ్‌, లైటింగ్‌ అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు, ట్రాఫిక్‌ విభాగాధికారులు జోయెల్‌ డేవిస్‌, కరుణాకర్‌లతోపాటు పలువురు అధికారులతో కలిసి ఆయన లంగర్‌హౌస్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. 8 టీఎ్‌సఎ్‌సపీ ప్లాటూన్‌లతోపాటు 800మంది బలగాల ను యాత్ర ఊరేగింపు మార్గంలో మొహరించామన్నారు. మహిళలకు ఇబ్బందులు రాకుండా బందోబస్తులోనూ మహిళా సిబ్బందిని మొహరించినట్లు తెలిపారు. 


కనకాల కట్టమైసమ్మకు కుమ్మర్ల బోనం

కవాడిగూడ: లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కనకాల కట్టమైసమ్మఆలయం వద్ద తెలంగాణ కుమ్మర్లసంఘం ఆధ్వర్యంలో కుమ్మర్లు గురువారం తొలిబోనం సమర్పించారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండ్‌మేళాలతో ముందుకు సాగగా వందలాదిమంది మహిళలు బోనాలతో తరలివచ్చారు.

Updated Date - 2022-07-01T14:14:35+05:30 IST