
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు నేడు దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ. 810 తగ్గింది. అలాగే, కిలో వెండిపై రూ. 1500కుపైగా తగ్గింది. క్రితం ట్రేడింగులో పది గ్రాముల బంగారం ధర రూ. 47,706గా ఉండగా, తాజాగా రూ.810 తగ్గడంతో రూ. 46,896కు దిగింది. అలాగే, ఎప్పుడూ బంగారం బాటలోనే పయనించే వెండి ధరలుకూడా దిగొచ్చాయి.
గత ట్రేడింగులో రూ.64,268గా ఉన్న కిలో వెండి ధరపై రూ. 1,548 తగ్గడంతో రూ.62,720కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పతనం కావడమే ధరల తగ్గుదులకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1806 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర 25.05 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.