నగల రుణమాఫీపై ఆడిటింగ్‌ కమిటీ

ABN , First Publish Date - 2022-03-09T13:36:06+05:30 IST

బంగారు నగల తాకట్టు రుణాల మాఫీ హామీ అమలులో నెల కొన్న అవాంతరాలను తొలగించేందుకు డీఎంకే ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకోసం ఆడిటింగ్‌ కమిటీని నియమిస్తూ మంగళ వారం

నగల రుణమాఫీపై ఆడిటింగ్‌ కమిటీ

                        - స్టాలిన్‌ సర్కారు కీలక నిర్ణయం


అడయార్‌(చెన్నై): బంగారు నగల తాకట్టు రుణాల మాఫీ హామీ అమలులో నెల కొన్న అవాంతరాలను తొలగించేందుకు డీఎంకే ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకోసం ఆడిటింగ్‌ కమిటీని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార బ్యాంకుల్లో 40 గ్రాముల (5 సవర్ల)లోపు బంగారాన్ని తాకట్టు పెట్టిన వారి రుణాలను రద్దు చేస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం అధికారం చేపట్టిన తర్వాత రుణ మాఫీ చేసేందుకు చర్యలు చేప ట్టింది. ఇందులోభాగంగా ప్రాథమిక వ్యవసాయ నగర, జిల్లా సహకార బ్యాంకుల్లో 5 సవర్లలోపు బంగారంపై తీసుకున్న రుణాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో గత అన్నాడీఎంకే పాలనలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. కొందరు గిల్టు నగలు కుదువపెట్టి రుణం తీసుకోగా, మరికొందరు నగలే పెట్టకుండా రుణాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాటికి బ్యాంకు అధికారులు కొందరు సహకరించి నట్టు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆయా జోన్ల అధిపతులకు రాష్ట్ర సహకార శాఖామంత్రి ఐ.పెరియస్వామి ఆదేశించారు. అంతేకాకుండా, రుణమాఫీ కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శ కాలను రూపొందించి బ్యాంకులకు పంపించింది. ఈ మార్గదర్శకాలకు లోబడే రుణాలు మాఫీ చేశారా? లేదా? అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా రుణమాఫీ పొందిన లబ్ధిదారుల వివరాలపై ఆడిటింగ్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారంగా సహకార ఆడిటింగ్‌ డైరెక్టరేట్‌ జోన్లు, జిల్లాల వారీగా 75 శాతం మంది ఆడిటింగ్‌ అధికారులను నియమించింది. తొలి దశలో నగర, జిల్లా సెంట్రల్‌ సహకార బ్యాంకుల్లోను, రెండో దశలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు, ఇతర సహకార సంఘాల్లో ఈ ఆడిటింగ్‌ చేయాల్సిందిగా అధికారులను కోరింది. ఒక సహకార బ్యాంకులో ఆడిటింగ్‌ చేసిన తర్వాత ఇతర ఉన్నతాధికారులు ఆ బ్యాంకులో తనిఖీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఆడిటింగ్‌ ముగిసిన వెంటనే జోనల్‌, సర్కిల్‌ ఆడిటింగ్‌ అధికారులు నివేదిక ఏమాత్రం జాప్యం చేయకుండా సహకార శాఖకు పంపించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆడిటింగ్‌ చేసేందుకు కూడా అధికారులను నియమించింది. ఆ ప్రకారంగా చెన్నై జోన్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ హుస్సేన్‌, మదురై, తిరునెల్వేలి జోన్‌లో ఎన్‌.ఎస్‌.శారద, కోవై జోన్‌లో ధనశేఖరన్‌, తిరుచ్చి జోన్‌లో చిత్రకళ, కాంచీపురం జోన్‌కు విక్టర్‌ పాల్‌రాజ్‌, తిరువళ్ళూరు జోన్‌కు మణితో సహా 75 మంది అధికారులను నియమిం చారు. దీంతో సహకార బ్యాంకుల్లో తప్పుడు మార్గంలో రుణాలు పొందిన వారి జాబితా త్వరలోనే వెల్లడికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-03-09T13:36:06+05:30 IST